You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష

ఐఓఏ కొత్త అధ్యక్షురాలిగా ఎన్నికైన 58 ఏళ్ల పీటీ ఉషను అభినందిస్తూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. ఫిపా ప్రపంచకప్: బెల్జియంపై మొరాకో గెలుపు

    ఖతార్‌లో జరుగుతోన్న ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఆదివారం మరో సంచలనం నమోదైంది.

    గ్రూప్ ‘ఎఫ్’ మ్యాచ్‌లో మొరాకో జట్టు బెల్జియంపై ఘన విజయం సాధించింది.

    వరల్డ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 2 స్థానంలో ఉన్న బెల్జియంపై మొరాకో 2-0తో గెలుపొందింది.

    ఈ టోర్నీ ఆరంభం నుంచి సంచలన ఫలితాలు నమోదవుతున్నాయి.

    దీని కంటే ముందు సౌదీ అరేబియా చేతిలో బలమైన అర్జెంటీనా... జపాన్ చేతిలో జర్మనీ జట్లు ఓటమి చవి చూశాయి.

  3. సీఎం సభలకు నల్ల దుస్తులు వేసుకుని రాకూడదా.. నిబంధనలు ఏం చెప్తున్నాయి

  4. ఇరాన్: అయాతుల్లా ఖమేనీని హిట్లర్‌తో పోల్చిన ఆయన మేనకోడలు

    విదేశీ ప్రభుత్వాలన్నీ ఇరాన్‌తో సంబంధాలను తెంచేసుకోవాలని ఒక వీడియోలో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీ మేనకోడలు ఫరీదా మురాద్‌ఖనీ విజ్ఞప్తి చేశారు.

    ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె ఒక వీడియోను విడుదల చేశారు.

    అయాతుల్లా సోదరి కుమార్తె ఫరీదా.

    ఇరాన్ ప్రభుత్వానికి అధికారాన్ని అనుభవించడం తప్ప ఇంకేం తెలియదని ఆమె వీడియోలో ఆరోపించారు.

    అయాతుల్లా ఖమేనీని ఆమె హిట్లర్, ముస్సోలినీలతో పోల్చారు.

    ఈ ఏడాది జనవరిలో ఫరీదాను అరెస్ట్ చేసి ఆమెను టెహ్రాన్‌లోని ఇర్విన్ జైలులో ఉంచినట్లు మానవ హక్కుల కార్యకర్తలు తెలిపారు.

  5. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లోకి నరేంద్ర మోదీ స్టేడియం

    గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

    2022 మే 29న జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ఈ స్టేడియం వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్‌ను స్టేడియంలో కూర్చొని 1,01,566 మంది ప్రత్యక్షంగా చూశారు.

    ఒక టి20 మ్యాచ్‌కు హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య ఇదే. దీంతో గిన్నిస్ బుక్ రికార్డ్స్ అందుకుంది.

    తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గురించి బీసీసీఐ ట్వీట్ చేస్తూ... ‘‘భారత్, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇది అందరికీ గర్వించే క్షణం’ అని రాసింది.

    బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

    1982లో 49 వేల సీట్ల సామర్థ్యంతో ఈ స్టేడియాన్ని నిర్మించారు. మొతేరా స్టేడియంగా పిలిచే ఈ స్టేడియాన్ని పునర్నిర్మించారు. తర్వాత దీని పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చారు. దీని కెపాసిటీ లక్షా 10వేల సీట్లు.

  6. చైనా: జిన్‌పింగ్ రాజీనామా చేయాలంటూ నిరసనలు, రోజురోజుకూ తీవ్రం

  7. ఐఓఏ అధ్యక్షురాలిగా పీటీ ఉష

    భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నూతన అధ్యక్షురాలిగా ప్రముఖ అథ్లెట్ పీటీ ఉష ఎన్నికయ్యారు.

    ఈ పదవి కోసం ఆమె శనివారం నామినేషన్ దాఖలు చేశారు.

    ఐఓఏ కొత్త అధ్యక్షురాలిగా ఎన్నికైన 58 ఏళ్ల పీటీ ఉషను అభినందిస్తూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు.

    భారత క్రీడాకారులను చూసి దేశం గర్విస్తుందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    పీటీ ఉష తన కెరీర్‌లో ఆసియా గేమ్స్‌లో అనేక స్వర్ణ పతకాలతో పాటు 1984 ఒలింపిక్స్‌ 400 మీ. హర్డిల్స్‌ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచారు.

  8. డిసెంబర్ 9న మైండ్‌స్పేస్-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ రెండో విడత మెట్రో పనులకు ముహుర్తం

    మైండ్ స్పేస్ జంక్షన్‌లోని రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రోకారిడార్‌ను విస్తరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

    అందులో భాగంగా డిసెంబర్ 9న మెట్రో రైలు రెండో విడత పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా ప్రకటించారు.

    31 కి.మీ మేర చేపట్టే ఈ నిర్మాణానికి రూ. 6,250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

    రానున్న మూడు సంవత్సరాల్లోమెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించనుందని ఆయన వెల్లడించారు.

  9. 1000కి పైగా ఎక్కాలు ఈజీగా చెప్పేస్తున్నారు

  10. బల్లార్షా: రైల్వేస్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలి ప్రయాణికులకు గాయాలు

  11. ఆర్మీని ‘అవమానించి’ సారీ చెప్పిన రిచా చద్దా... ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, నిఖిల్ ఏమన్నారు

  12. చిత్తూరు జిల్లా కుప్పం వద్ద దురంతో రైలులో మంటలు, ఎన్. తులసీ ప్రసాద్ రెడ్డి, బీబీసీ కోసం

    బెంగళూరు నుంచి హౌరా వెళ్లేదురంతో రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

    రైలు కుప్పం వద్దకు చేరుకోగానే రైలులోని ఒక బోగీలో మంటలు వచ్చాయి.

    దీంతో కుప్పం స్టేషన్‌లో రైలునునిలిపివేశారు. రైల్వే సిబ్బంది మంటలను అదుపు చేశారు.

    మంటల విషయం తెలుసుకున్నప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రైలు దిగి పరుగులు తీశారు.

    అయితే ఇందులో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

  13. హిజాబ్ ధరించిన టీచర్‌ను వేధించిన వీడియో వైరల్, ముగ్గురు విద్యార్థులపై కేసు

    ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియో తీసిన ముగ్గురు మైనర్ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    తరగతి గదిలో కూర్చొన్న విద్యార్థులు, మరో తరగతి వైపు వెళ్తోన్న ఉపాధ్యాయురాలిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

    తమకు ఈ విషయంపై నవంబర్ 25న ఫిర్యాదు అందినట్లు పోలీసులు చెప్పారు.

    టీచర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ చట్టం సెక్షన్ 67, ఐపీసీ సెక్షన్ 354, 500 కింద నిందితులపై కేసు నమోదు చేశారు.

    అసభ్యకరంగా ప్రవర్తించి వీడియోలు తీసిన విద్యార్థులను గుర్తించినట్లు మీరట్ ఎస్పీ రోహిత్ సింగ్ సజ్వాన్ తెలిపారు. ‘‘వీరంతా మైనర్లే.వారిని అదుపులోకి తీసుకుని జువైనల్ జడ్జి ముందు హాజరు పరచనున్నాం’’ అని ఆయన వెల్లడించారు.

    ఉపాధ్యాయురాలిని వేధించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌ అవుతోంది.

  14. IND vs NZ: భారత్, న్యూజీలాండ్ మధ్య రెండో వన్డే.. వర్షం కారణంగా రద్దు

    భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య ఆదివారం హామిల్టన్‌లో జరుగుతున్న రెండో వన్డే క్రికెట్ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది.

    మ్యాచ్ రద్దయ్యే సమయానికి భారత జట్టు 12.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది.

    మ్యాచ్ నిలిపివేసేటప్పటికి శుభం కుమార్ 42 బంతుల్లో 45 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 34 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.

    అంతకుముందు శిఖర్ ధావన్ మూడు పరుగులు చేసి అవుటయ్యాడు.

    అంతకుముందు వర్షం కారణంగా 50 ఓవర్ల మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు.

    న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు.

    భారత జట్టు బ్యాటింగ్‌కు దిగింది.

    అయితే వర్షం ఆగకపోవటంతో మ్యాచ్‌ను 12.5 ఓవర్ల వద్ద నిలిపివేశారు.

    తొలి వన్డేలో న్యూజీలాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో భారత్‌‌ను ఓడించింది.

  15. వరల్డ్ ఎయిడ్స్ డే: హెచ్ఐవీ/ఎయిడ్స్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?

  16. 24 క్యారెట్ల బంగారంతో పెయింటింగ్స్ ఎప్పుడైనా చూశారా..

  17. ఉత్తర కొరియా ‘ప్రపంచంలోనే అత్యంత బలమైన అణుశక్తి దేశంగా అవతరిస్తుంది’: కిమ్ జోంగ్ ఉన్

    ప్రపంచంలోనే అత్యంత బలమైన అణుశక్తి దేశంగా అవతరించటం ఉత్తర కొరియా లక్ష్యమని ఆ దేశ సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ పేర్కొన్నారు.

    ఈ నెల ఆరంభంలో పరీక్షించిన ఒక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంలో పాలుపంచుకున్న సైనికాధికారులు, శాస్త్రవేత్తలకు పదోన్నతులు ఇచ్చే కార్యక్రమంలో కిమ్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేసినట్లు ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ తెలిపింది.

    ఆ క్షిపణి ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మక ఆయుధమని కిమ్ అభివర్ణించారు. ‘‘ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యంగా అవతరించగల ధైర్యం’’ తమ దేశానికి ఉందని ఆ ఆయుధం చాటుతోందని ఆయన పేర్కొన్నారు.

    ఆ సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ తన కూతురుతో కలిసి కనిపించారు. కిమ్ కూతురు తండ్రితో కలిసి బయట కనిపించటం అది రెండోసారి మాత్రమే.

    ఈ నెల 18వ తేదీన హ్వాసాంగ్-17 క్షిపణి పరీక్ష సందర్భంగా కిమ్ తన కూతురుతో కనిపించినట్లు లండన్‌లోని బీబీసీ ప్రతినిధి అయనా అస్లామ్ చెప్పారు.

  18. ‘జిన్‌పింగ్.. దిగిపో’ – చైనాలో కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా నిరసనలు

    చైనాలో కోవిడ్ నియంత్రణ కోసం విధిస్తున్న ఆంక్షలను నిరసిస్తూ ప్రజా నిరసనలు తీవ్రమవుతున్నట్లు కనిపిస్తున్నాయి.

    షిన్‌జియాంగ్ రాష్ట్ర రాజధాని ఉరుంకి నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది చనిపోవటంతో ఈ నిరసనలు తీవ్రమయ్యాయి.

    మృతులకు సంతాపం తెలుపుతూ షాంఘై నగరంలో వేలాది మంది వీధుల్లోకి వచ్చి ప్రదర్శనల్లో పాల్గొని, కోవిడ్ ఆంక్షల పట్ల నిరసన తెలుపుతున్న దృశ్యాలు విదేశీ పాత్రికేయులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల్లో కనిపిస్తున్నాయి.

    అధ్యక్షుడు షి జిన్‌పింగ్ రాజీనామా చేయాలని వందలాది మంది నిరసనకారులు నినాదాలు చేయటం కూడా వినిపిస్తోంది.

    ఉరుంచి అగ్నిప్రమాదానికి కారణం నివాస భవనాలను లాక్‌డౌన్ చేయటమేనని చాలా మంది జనం ఆరోపిస్తున్నారు.

    దీనిని చైనా ప్రభుత్వ విభాగాలు తిరస్కరిస్తున్నాయి. అయితే అగ్నిప్రమాదానికి సంబంధించి ఎవరైనా అధికారులు బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించినట్లయితే వారిని శిక్షిస్తామని ఉరుంకి అధికారులు శుక్రవారం నాడు ఒక ప్రకటనలో చెప్పారు. ఆ ప్రమాదానికి చింతిస్తున్నామని క్షమాపణ కూడా చెప్పారు.

    షాంఘై నిరసనల్లో కొంత మంది.. మృతుల సంస్మరణార్థం కొవ్వొత్తులు వెలిగించటం, పూల బొకేలు పెట్టటం వీడియోల్లో కనిపిస్తోంది.

    ఇంకొందరు ‘షి జిన్‌పింగ్ దిగిపో’, ‘కమ్యూనిస్ట్ పార్టీ గద్దె దిగు’ అంటూ నినానాదాలు చేయటం వినిపిస్తోంది. కొంతమంది నలుపు, తెలుపు రంగుల్లోని బ్యానర్లు ప్రదర్శించారు.

    చైనాలో ఇలాంటి డిమాండ్లు కనిపించటం, వినిపించటం అసాధారణమైన విషయం. ప్రభుత్వాన్ని, అధ్యక్షుడిని నేరుగా విమర్శిస్తే కఠిన శిక్షలు విధించటం ఇక్కడ మామూలు విషయం.