లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డిని ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డిని ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఈ చర్య తీసుకున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ జి. చిన్నా రెడ్డి తెలిపారు.
కొద్ది రోజుల కిందట మర్రి శశిధర్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారని వెల్లడించారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలసి దిల్లీలో అమిత్ షాతో మర్రి శశిధర్ రెడ్డి భేటీ అయ్యారని, ఆ పార్టీలో చేరే అంశంపై చర్చలు జరిగాయని కాంగ్రెస్ చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవాల్సిన అవసరం ఉందని లేదంటే రాష్ట్రం నష్టపోతుందని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఏపీలో రివర్స్ పాలన సాగుతోందంటూ 'ఇదేం ఖర్మ' అనే పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇంత దారుణమైన, నీచమైన ప్రభుత్వం తాను ఎక్కడా చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందరినీ వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అక్రమ అరెస్టులు చేసి, పోలీసు టార్చర్ చేసి కార్యకర్తలను, నేతలను వేధించారని వాపోయారు. తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకునేది ఖాయం అన్నారు.
సిఎంకు చెందిన ఒక ఫ్లెక్సీ చినిగితే హంగామా చేసిన పోలీసులు.. తునిలో భక్తుడి వేషంలో టీడీపీ నేతపై హత్యాయత్నం చేస్తే ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు.
'బాదుడే బాదుడు' కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. నందిగామలో టీడీపీ కార్యక్రమానికి గతంలో ఎన్నడూ చూడనంతమంది జనం వచ్చారని,. అంత జనం వస్తే నా మీద రాయి విసిరి భయపెట్టాలి అని ప్రయత్నించారని చంద్రబాబు విమర్శించారు.
"పూలల్లో రాళ్లు వచ్చాయని పోలీసులు చెబుతున్నారు.. మరి, పూలల్లో బాంబులు కూడా వస్తాయా?" అని ప్రశ్నించారు.
ప్రభుత్వ దాడులు, వేధింపులతో ప్రజలు విసిగిపోయారని, ఇక టీడీపీ రావాలని కట్టలు తెంచుకుని వచ్చి సంఘీభావం తెలుపుతున్నారని చంద్రబాబు అన్నారు.
కర్నూలు ప్రజలు కూడా ముక్తకంఠంతో ఒకే రాజధాని కావాలి అని నినదించినట్టు టీడీపీ అధినేత తెలిపారు.
అసత్యాలను పదే పదే చెప్పి అందరినీ నమ్మించే ప్రయత్నం వైసీపీ చేస్తోందన్నారు.
ఊర్లో రౌడీకి భయపడి జనం నోరెత్తరు.. ఇప్పుడు అదే విధానంలో జగన్ ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.
"ప్రాణాలు అయినా ఇస్తాను గానీ, రాష్ట్రాన్ని నాశనం కానివ్వను" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.
రాయలసీమ ద్రోహి, ఉత్తరాంధ్ర ద్రోహి, ఆంధ్ర ప్రదేశ్ ద్రోహి జగన్ అంటూ మండిపడ్డారు.
రాబోయే ఎన్నికల్లో తెలుగు దేశం ఓడిపోతే, ఈ రాష్ట్రాన్ని కాపాడే శక్తి ఎవరికీ ఉండదని బాబు అభిప్రాయపడ్డారు.
"మళ్లీ ముఖ్యమంత్రిగానే సభకు వెళతానన్నాను. అలాగే వెళతా"నంటూ మరోసారి స్పష్టం చేశారు.
కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు మాట్లాడారు. 'ఇదేం ఖర్మ' పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా టీడీపీ ఎన్నికల వ్యూహకర్త గా పనిచేస్తున్న రాబిన్ శర్మ వేదిక మీద కనిపించారు. ఆయన్ను తొలిసారిగా పార్టీ నేతలకు చంద్రబాబు పరిచయం చేయడం విశేషం.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాస్వత సభ్యత్వం కల్పించాలన్న భారత డిమాండ్‌కు.. ఆ సభలో వీటో హోదా ఉన్న బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతు తెలిపాయి.
భద్రతా మండలి సంస్కరణలపై శుక్రవారం నాడు జరిగిన వార్షిక చర్చలో.. తొలుత ఐరాసలో బ్రిటన్ రాయబారి బార్బరా ఉడ్‌వర్డ్ మాట్లాడుతూ.. ‘‘భద్రతా మండలిలో ఇండియా, జర్మనీ, జపాన్, బ్రెజిల్‌లకు కొత్త శాస్వత స్థానాలను ఏర్పాటు చేయటానికి, మండలిలో ఆఫ్రికా నుంచి కూడా శాశ్వత ప్రాతినిధ్యం కల్పించటానికి మేం మద్దతు తెలుపుతున్నాం’’ అని చెప్పారు.
ఆ తర్వాత ఐరాసలో ఫ్రాన్స్ ఉప ప్రతినిధి నటాలీ బ్రధుర్స్ ఎస్టివాల్ మాట్లాడుతూ.. ‘‘జర్మనీ, బ్రెజిల్, ఇండియా, జపాన్‌లకు శాస్వత స్థానాల్లో శాశ్వత సభ్యులుగా చేయాలని ఫ్రాన్స్ మద్దతు తెలుపుతోంది’’ అని పేర్కొన్నారు.
భౌగోళిక ప్రాతినిధ్యం ఉండేలా చూడటానికి ఆఫ్రికా దేశాలకు కూడా శాశ్వత సభ్యత్వంలో మరింత ప్రాతినిధ్యం ఇవ్వాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు.
కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయ్యప్ప భక్తులు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు అదుపు తప్పి సమీపంలోని లోయలో బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 44 మందిలో 18 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురిని ఆసుపత్రికి తరలించగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
శబరిమల యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా పతనం తిట్ట వద్ద ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు చెందిన వారు 2 బస్సుల్లో 84 మంది యాత్రకు వెళ్లినట్లు అధికారులకు సమాచారం అందింది. అందులో ఓ బస్సు ప్రమాదానికి గురయినట్టు ఏపీ సీఎంవో తెలిపింది.
కృష్ణా టూర్ అండ్ ట్రావెల్స్ కి చెందిన ఏపీ 27టీయూ 5757 నెంబర్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఎదుటి వాహనాన్ని తప్పించే క్రమంలో అదుప తప్పినట్టు స్థానికులు చెబుతున్నారు.
బస్సులో ఉన్న 8 ఏళ్ల బాలుడితో పాటుగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని కొట్టాయం ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.
బస్సు అదుపుతప్పి బోల్తా పడిన సమయంలో దాదాపు 10 మంది అందులో చిక్కుకున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది.
స్థానికులు, రెస్క్యూ ఆపరేషన్ బృందాల సహాయంతో ఏడుగురిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. పెరునాడ్ తాలూకా ఆస్పత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు.
అయితే వాహనం కింద ముగ్గురు వ్యక్తులు చిక్కుకోవడంతో బస్సులో కొంత భాగాన్ని కట్ చేసి వారిని బయటకు తీశారు. క్రేన్ సహకారంతో బస్సుని కూడా రోడ్డు మీదకు తీసుకొచ్చారు.
పతనం తిట్ట ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. సీఎంవో ఆదేశాలతో ఏపీ అధికారులు కేరళ ప్రభుత్వంతో మాట్లాడినట్టు తెలిపారు.
శనివారం ఉదయం గం. 8.20 ని. ల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు వెల్లడించారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందుతోందని, మిగిలిన యాత్రికులకు వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
పతనం తిట్ట జిల్లా అధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
యాత్రికులంతా ఏలూరు మండలం మాదేపల్లికి చెందిన వారుగా సమాచారం.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేత, ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న దిల్లీ మంత్రి సత్యేందర్ జైన్, జైల్లో మసాజ్ చేయించుకుంటున్న సీసీ కెమెరా వీడియోను ఏఎన్ఐ వార్తా సంస్థ విడుదల చేసింది.
ఈ వీడియోలో మంత్రి సత్యేంద్ర జైన్ మంచం మీద పడుకుని ఉండగా, ఓ వ్యక్తి ఆయన కాళ్లకు, చేతులకు, తలకు, ఒంటికి మసాజ్ చేయడం కనిపిస్తుంది. వీడియో ఆరంభంలో ఆయన ఏవో పేపర్లు చదువుతూ కనిపించారు.
ఇదే వీడియోలో ఆయన వివిధ సందర్భాలు లేదా తేదీల్లో మసాచ్ చేయించుకున్నట్లు కనిపిస్తుంది. సత్యేంద్ర జైన్‌తోపాటు మసాజ్ చేస్తున్న వ్యక్తి షర్ట్‌లు కూడా మారిపోతూ కనిపిస్తుండటంతో ఇది పలు దినాలలో చేయించుకున్న మసాజ్‌లాగా కనిపిస్తుంది.
వీడియో చివర్లో సత్యేంద్ర జైన్ మసాజ్ చేయించుకుంటుండగా, జైలు గదిలోకి ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆయనతో మాట్లాడుతుండటం కనిపిస్తుంది.
అయితే, ఈ వీడియోపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. మంత్రికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో చికిత్స అందిస్తున్నారని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పష్టం చేశారు.
అన్ని జైళ్లలో అనారోగ్యం పాలైన ఖైదీలకు ఇలాంటి సదుపాయాలు కల్పిస్తారని సిసోడియా అన్నారు.
గుజరాత్ ఎన్నికల్లో తమ పార్టీని అప్రతిష్ట పాలు చేసేందుకు ఇలాంటి వీడియోలు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు.
తప్పుడు ఆరోపణలు, కేసులతో సత్యేంద్ర జైన్‌ను బీజేపీ జైలులో వేసిందని మనీశ్ సిసోడియా ఆరోపించారు.
అసలు జైలు వీడియోలు బయటకు ఎలా వచ్చాయో విచారణ జరపాలని మంత్రి డిమాండ్ చేశారు. బీజేపీ నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.
ఇరాన్‌లో నిరసనకారులు.. ఇరాన్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడైన అయతొల్లా రుహొల్లా ఖొమేనీ పూర్వీకుల ఇంటికి నిప్పు పెట్టారు.
ఖొమేన్ నగరంలోని ఆయన ఇల్లు కొంత భాగం మంటల్లో కాలుతుండటం సోషల్ మీడియాలో పోస్టయిన కొన్ని వీడియోల్లో కనిపిస్తోంది.
ఈ వీడియో ఎక్కడిదనే విషయాన్ని వార్తా సంస్థలు తనిఖీ చేసి ధృవీకరించాయి. అయితే అలాంటి దాడి ఏదీ జరగలేదని ప్రాంతీయ అధికారులు తిరస్కరించారు.
అయతొల్లా ఖొమేనీ ఈ ఇంట్లో పుట్టినట్లు చెప్తారు. ఈ ఇంటిని ఆయన సంస్మరణార్థం మ్యూజియంగా మార్చారు.
ఇరాన్‌లో 1979 నాటి ఇస్లామిక్ రివల్యూషన్‌కు ఖొమేనీ నాయకత్వం వహించారు. నాటి పాశ్చాత్య అనుకూల పాలకుడు షా మొహమ్మద్ రెజా పహ్లవీని గద్దె దించి.. ప్రస్తుతమున్న మతవాద రాజ్యాన్ని నెలకొల్పారు.
ఇరాన్ తొలి సుప్రీం లీడర్‌గా పదవి చేపట్టిన ఖొమేనీ 1989లో చనిపోయే వరకూ ఆ పదవిలో కొనసాగారు. ఆయన చనిపోయిన రోజును ఇప్పటికీ ప్రతి ఏటా సంతాప దినంగా పాటిస్తున్నారు.
పలు సోషల్ మీడియా పోస్టుల్లో.. ఖొమేన్ నగరంలో ఖొమేనీ ఇల్లు మంటల్లో కాలుతోంటే పదుల సంఖ్యలో ఉన్న నిరసనకారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేయటం కనిపించింది.
గురువారం సాయంత్రం ఈ వీడియోలను చిత్రీకరించినట్లు ఉద్యమకారుల బృందం ఒకటి చెప్పింది. అయితే ఇలాంటి దాడి ఏదీ జరగలేదని ఖొమేన్ కౌంటీ మీడియా కార్యాలయం చెప్పినట్లు తాస్నిం వార్తా సంస్థ పేర్కొంది.
అయతొల్లా రుహొల్లా ఖొమేనీ కుమారుడైన ప్రస్తుత పాలకుడు అయతొల్లా అలీ ఖొమేనీకి, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్ వ్యాప్తంగా కొంత కాలం నుంచి తీవ్ర నిరసనలు చెలరేగుతున్నాయి.
రెండు నెలల కిందట హిజాబ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ నైతిక పోలీసులు అరెస్ట్ చేసిన మాషా అమీని అనే 22 ఏళ్ల యువతి వారి కస్టడీలో చనిపోవటంతో.. దేశంలో మత రాజ్యానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున నిరసనలు మొదలయ్యాయి.
ఈ నిరసనలను అణచివేయటానికి ఇరాన్ హింసను ప్రయోగిస్తోంది. అనేకమంది నిరసనకారులు చనిపోయారు. గురువారం నాటి తాజా ఘర్షణల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది చనిపోయినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.
మరోవైపు.. భద్రతా బలగాల కాల్పుల్లో చనిపోయిన పలువురు పిల్లలు, యువకుల అంత్యక్రియల సందర్భంగా శుక్రవారం నాడు కూడా భారీ ప్రదర్శనలు జరిగాయి.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.