లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నటుడు కృష్ణ అంత్యక్రియలు ఈరోజు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో జరిగాయి. అంతకుముందు ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని పద్మాలయా స్టూడియోస్‌లో ఉంచారు. రాజకీయ, సినీ ప్రముఖులు కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
విమానాల్లో మాస్కు ధరించడం ఇకపై తప్పనిసరి కాదని, కేంద్ర పౌరవిమానయాన శాఖ తెలిపింది.
కేంద్ర ఆరోగ్యశాఖతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
కోవిడ్-19 నేపథ్యంలో విమానంలో ప్రయాణించేటప్పుడు మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది.
కార్గిల్‌లోని డ్రాస్‌లో గల జామియా మసీద్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో మసీదు పూర్తిగా కాలిపోయినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.
భారత సైన్యం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో బుధవారం తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నటుడు కృష్ణ అంత్యక్రియలు జరిగాయి.
పద్మాలయా స్టూడియోస్ నుంచి మహాప్రస్థానం వరకు కృష్ణ అంతిమయాత్ర సాగింది.
ఆయనను చివరిసారి చూసేందుకు అభిమానులు తరలివచ్చారు.
అనంతరం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కృష్ణ కన్నుమూశారు.
కథువా గ్యాంగ్‌రేప్ మర్డర్ కేసులో జమ్మూకశ్మీర్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
ఈ కేసులోని నిందితుడిని బాలనేరస్థునిగా కాకుండా పెద్దవారిగానే భావించి విచారణ జరపాలని ఆదేశించింది.
జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ జేబీ పర్దీవాలాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పుని వెలువరించింది.
కథువా చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ (సీజేఎం) కోర్టు తన తీర్పులో ఈ కేసులోని నిందితుడిని మైనర్‌గా అంటే జువైనల్‌గా ప్రకటించింది.
ఈ తీర్పుకు వ్యతిరేకంగా దాఖలైన అప్పీల్‌ను విచారించిన సుప్రీంకోర్టు... ‘‘నిందితుడి వయస్సును ధ్రువీకరించే ఇతర సాక్ష్యాలు స్పష్టంగా లేకపోతే, వైద్య అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. వైద్య సాక్ష్యంపై ఆధారపడవచ్చా? లేదా? అనేది సాక్ష్యానికి ఉన్న విలువపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి సీజేఎం కథువా ఉత్తర్వులను కొట్టివేస్తూ, నేరం జరిగిన సమయంలో నిందితుడిని జువైనల్‌గా పరిగణించడం లేదు’’ అని సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది.
ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం, కథువా జిల్లాలోని రసానా ప్రాంతంలోని బకర్వాల్ కమ్యూనిటీకి చెందిన 8 ఏళ్ళ బాలిక 2018 జనవరి 10న కిడ్నాప్‌కు గురైంది. జనవరి 17న ఆమె మృతదేహం లభించింది.
ఈ కేసులో దాఖలు చేసిన 15 పేజీల చార్జిషీటు ప్రకారం బాధితురాలిని కిడ్నాప్ చేసి ఆమెకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశారు. ఆపై ఆమెను హత్య చేశారు.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా), చంద్రుని పైకి పంపించే అత్యంత శక్తిమంతమైన రాకెట్ అంతరిక్ష ప్రయోగ వ్యవస్థను విజయవంతంగా ప్రయోగించింది. నాసా చరిత్రలో ఇది ఒక చరిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుంది.
మూడో ప్రయత్నంలో ఈ ప్రయోగం విజయవంతమైంది. ఇంతకుముందు ఆగస్టు, సెప్టెంబర్‌లో దీన్ని నిలిపేశారు.
ఆర్టెమిస్ మిషన్‌లో ఇది ఒక భాగం. ఈ మిషన్ కింద 50 ఏళ్ల తర్వాత మరోసారి మానవులను చంద్రునిపైకి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ రాకెట్ నిర్వహించిన తొలి మిషన్ ఇది. ఇందులో వ్యోమగాములు ఎవరూ ప్రయాణించరు.
ఒకవేళ ఈ మిషన్ సఫలం అయితే, భవిష్యత్‌లో వ్యోమగాములు ఈ రాకెట్‌లో చంద్రునిపైకి వెళ్తారు.
అంతా అనుకున్నట్లు జరిగితే 2024 నుంచి మరోసారి మానవుడు చంద్రునిపై అడుగు పెట్టే అవకాశం ఉంది.
పోలాండ్‌లో మంగళవారం ఇద్దరి మృతికి కారణమైన క్షిపణిని యుక్రెయిన్ నుంచి ప్రయోగించారని ముగ్గురు అమెరికా అధికారులు చెప్పినట్లు అసోసియేట్ ప్రెస్ (ఏపీ) ఏజెన్సీ ఒక నివేదికలో పేర్కొంది.
ఆ ముగ్గురు అధికారులు తమ వివరాలను బయటపెట్టడానికి ఇష్టపడలేదని ఏపీ వార్తా సంస్థ తెలిపింది.
దీనికంటే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని చెప్పారు. పోలాండ్‌లో ఇద్దరి మృతికి కారణమైన క్షిపణిని రష్యా నుంచి ప్రయోగించడం ‘అసంభవం’ అని ఆయన అన్నారు.
మరోవైపు ఈ క్షిపణిని ఎవరు ప్రయోగించారనే అంశంపై తమ వద్ద కచ్చితమైన ఆధారాలు లేవని పోలాండ్ చెప్పింది.
యుద్ధంలో ఇరు వర్గాలు రష్యా యుద్ధ సామగ్రిని వాడాయి. దీంతో ఎవరు దీన్ని ప్రయోగించారనే దానిపై స్పష్టత రాలేదు. దీనిపై పోలాండ్ దర్యాప్తు చేస్తుంది.
సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ఘట్టమనేని కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు.
ప్రముఖ నటుడు కృష్ణ అంత్యక్రియలు ఈరోజు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో జరుగుతాయి. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని పద్మాలయా స్టూడియోస్‌లో ఉంచారు.
మంగళవారం ప్రముఖులు నివాళులు అర్పించగా, బుధవారం సాధారణ ప్రజలకు అనుమతినిచ్చారు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు.
మధ్యాహ్నం 12 తర్వాత అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (2024) పోటీ చేస్తున్నట్లు రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
అధ్యక్ష ఎన్నికల కోసండెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీలు ముందుగా తమ అభ్యర్థులను ఎన్నుకుంటాయి. అయితే, రిపబ్లికన్ పార్టీ తరఫున తానే ఎన్నికల బరిలో నిలుస్తానని తాజాగా ట్రంప్ ప్రకటించారు.
ఈ మేరకు తన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ ఆయా పత్రాలను పార్టీకి ఆయన సమర్పించారు.
తర్వాత ‘మార్-ఎ-లాగో’ రిసార్ట్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘‘అమెరికాను మళ్లీ గొప్పగా, గర్వించదగినదిగా మార్చడానికి నేను అమెరికా అధ్యక్ష పదవికి నా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్నా.
ఇప్పటి నుంచి అధ్యక్ష ఎన్నికల వరకు గతంలో ఎవరూ పోరాడని విధంగా నేను పోరాడతా. దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న డెమోక్రాట్లను మేం ఓడిస్తాం.
ఇది కేవలం ప్రచారం కాదు. దేశాన్ని కాపాడే ప్రయత్నం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ మళ్లీ నవంబర్ 29 నుంచి అందుబాటులోకి వస్తుందని ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ తెలిపారు.
ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు.
‘‘నవంబర్ 29 నుంచి మళ్లీ ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్‌ను ప్రారంభిస్తాం. మునుపటి కంటే పటిష్టంగా ఈసారి అమలు చేస్తాం’’ అని ట్వీట్‌లోఆయన పేర్కొన్నారు.
నెలకు 8 డాలర్ల సబ్‌స్క్రిప్షన్ ఫీజుతో అందరికీ ట్విట్టర్ బ్లూ టిక్ సేవలను మస్క్ అందుబాటులోకి తెచ్చారు.
అయితే అనేక నకిలీ ఖాతాలు పుట్టుకురావడంతో వెంటనే దీన్ని ఆపేశారు. మళ్లీ ఇప్పుడు పున: ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
యుక్రెయిన్ నగరాలపై, అక్కడి మౌలిక సదుపాయాలపై మంగళవారం రష్యా చేసిన అనాగరిక క్షిపణి దాడులను ఖండిస్తున్నట్లు జీ7, నాటో నేతలు సంయుక్త ప్రకటన చేశారు.
తమ భూభాగంపై రష్యాకు చెందిన క్షిపణి పడటంతో ఇద్దరు మృతి చెందారని నాటో మిత్రదేశమైన పోలాండ్ చెప్పడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యవసరంగా జీ7, నాటో దేశాల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఇండోనేసియాలోని బాలీలో జీ20 సదస్సు జరుగుతుండగా అక్కడే బైడెన్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.
క్షిపణి దాడి విషయంలో పోలాండ్ దర్యాప్తుకు పూర్తి సహకారాన్ని, మద్దతును అందజేస్తామని నాటో, జీ7 నేతలు సంయుక్తంగా ప్రకటించారు.
‘‘యుక్రెయిన్‌కు మా మద్దతును పునరుద్ఘాటిస్తున్నాం. ద్వేషపూరిత దాడులు చేస్తున్న రష్యా జవాబుదారీగా ఉండాలి. రష్యా మంగళవారం చేసిన అనాగరిక క్షిపణి దాడులను మేం ఖండిస్తున్నాం. యుక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో పోలాండ్ భూభాగంపై జరిగిన దాడి గురించి మేం చర్చించాం’’ అని నాటో, జీ7 నేతలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
ఇండోనేసియాలో జరుగుతోన్న జీ20 సమావేశాలు నేటితో యుగియనున్నాయి.