You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇప్పుడు నా తలపై భారం తొలగిపోయింది.. ఊరటగా ఉంది: సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే బుధవారం నాడు బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు ఉపశమనం కలిగినట్లు అనిపిస్తోందని ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చెప్పారు. తనపై భారం తొలగిపోయినట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు.
లైవ్ కవరేజీ
అరుణ్ శాండిల్య
వెబ్‌కామ్ లైవ్ స్ట్రీమింగ్ అశ్లీల చాటింగ్‌ల్లో మీతో మాట్లాడేది మోడలా, మూడో మనిషా?
నేటి లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం
రేపు ఉదయం తాజా వార్తలతో కలుద్దాం.
అంతవరకు సెలవు.
ఇప్పుడు నా తలపై భారం తగ్గింది: సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే బుధవారం నాడు బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు ఉపశమనం కలిగినట్లు అనిపిస్తోందని ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చెప్పారు. తనపై భారం తొలగిపోయినట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు.
‘‘నాకు ఊరటగా ఉందని చెప్పాను. దీనిపై వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు నాపట్ల చాలా ఏళ్లుగా ప్రేమ, గౌరవాలు చూపారు. అది నాకు గర్వకారణం. ఈ భావన నా తుది శ్వాస వరకూ ఉంటుంది’’ అని సోనియా చెప్పారు.
‘‘కానీ ఆ గౌరవం చాలా పెద్ద బాధ్యత కూడా. నేను నా శక్తి సామర్థ్యాల మేరకు చేయగలిగిందంతా చేశాను. ఈ బాధ్యత నుంచి ఈ రోజు నేను తప్పుకుంటున్నాను. నా తల మీది నుంచి ఈ భారం తొలగిపోతుంది. కాబట్టి సహజంగానే ఊరటగా అనిపిస్తుంది. మీరు నాకు మీ సహకారం, మద్దతు అందించారు. నేను హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇప్పుడు ఈ బాధ్యత ఖర్గే గారిది’’ అని ఆమె పేర్కొన్నారు.
ఖర్గే అధ్యక్షుడిగా ఎన్నికవటానికి ముందు సోనియాగాంధీ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ వైదొలగటంతో ఆమె తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నట్లు సమాచారం వచ్చింది: సైబరాబాద్ సీపీ
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించాల్సిందిగా ప్రలోభపెడుతున్నట్లు సమాచారం రావటంతో హైదరాబాద్‌లోని ఒక ఫామ్ హౌస్‌లో సోదాలు నిర్వహించామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.
ఈ విషయం గురించి తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలే తమకు సమాచారం ఇచ్చారని ఆయన బుధవారం రాత్రి మీడియాకు తెలిపారు.
‘‘ముగ్గురు వ్యక్తులు వచ్చి తమను ప్రలోభపెడుతున్నారని, డబ్బు ఎర చూపెడుతున్నారని, కాంట్రాక్టులు, పదవులు ఎర చూపెట్టి పార్టీ ఫిరాయించాలని ప్రలోభ పెట్టినట్లు ఎమ్మెల్యేలు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ఆధారంగా ఈ రోజు (రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో) ఫామ్ హౌస్ మీద రెయిడ్ చేస్తే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనపడ్డారు. ఇందులో ప్రధానంగా రామచంద్రభారతి అలియాస్ సతీశ్ శర్మ, ఈయన ప్రస్తుతం ఫరీదాబాద్ టెంపుల్‌లో ఉంటారు. ఈయన హైదరాబాద్, దిల్లీలో కూడా ఉంటారు. ఈయనే ఇక్కడ వీళ్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కనపడుతోంది. ఆయనతోని సింహయాజి అని తిరుపతి నుంచి ఒక స్వామీజీ కూడా వచ్చారు. వీరిద్దరినీ ఇక్కడ హైదరాబాద్‌లో ఉండే నందకుమార్ సన్నాఫ్ శంకరప్ప ఇక్కడకు తెచ్చి వీళ్లను ప్రలోభాలు పెట్టి, సంప్రదింపులు చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ మీద మేం ఈ రోజు ఈ రెయిడ్ నిర్వహించాం. దీనిపై లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఇన్వెస్టిగేషన్ చేసి, ఎలాంటి ప్రలోభాలు పెడుతున్నారు అన్నదానిపై పూర్తి సమాచారం వెల్లడిస్తాం’’ అని సీపీ వివరించారు.
పరోటాకు, రోటీకి, వేర్వేరు జీఎస్టీ ఎందుకు, పార్లర్ ఐస్‌క్రీమ్‌కు, హోటల్ ఐస్‌క్రీమ్‌కు తేడా ఏంటి?
కరెన్సీ నోట్ల మీద లక్ష్మీ దేవి, వినాయకుడి బొమ్మలు ముద్రించడం సాధ్యమేనా, కేజ్రీవాల్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఏమంటున్నారు
‘‘నేను గర్భవతిని, వానొస్తే గుడిసెలోకి నీళ్లొస్తాయి. పాములు తేళ్లు కూడా లోపలికి వస్తుంటాయి.''-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
టీ20 వరల్డ్‌కప్: ఇంగ్లండ్ మీద ఐర్లాండ్ గెలుపు
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 5 పరుగుల తేడాతో గెలిచింది.
తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఐర్లాండ్ బ్యాటింగ్ చేసింది.
19.2 ఓవర్లలో 157 పరుగులకు ఐర్లాండ్ అన్ని వికెట్లు కోల్పోయింది.
ఆండ్రూ బల్బిర్నీ 47 బంతుల్లో 62 పరుగులు చేయగా లార్కన్ టకర్ 27 బంతులు 34 పరుగులు చేశారు.
158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు వాన వల్ల అంతరాయం కలిగింది.
15వ ఓవర్ వద్ద మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికి 5 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది ఇంగ్లండ్. కానీ వాన వల్ల మళ్లీ మ్యాచ్ మొదలయ్యే అవకాశం లేకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఐర్లండ్‌ను విజేతగా ప్రకటించారు.
డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 15 ఓవర్లకు ఇంగ్లండ్ 110 పరుగులు చేసి ఉండాలి.
'భారత్‌లో పోల్ డాన్స్‌ను కళగా గుర్తించే సమయం వచ్చింది'
ముంబయిలో ఉంటున్న రష్మి జాఠన్ జీవనోపాధిగా పోల్ డాన్స్‌ను ఎంచుకున్నారు. ఎంతో మందికి పోల్ డాన్స్ నేర్పిస్తున్నారు.
భారత్‌లో పోల్ డాన్స్‌ని ఒక కళగా అంగీకరించాల్సిన సమయం వచ్చిందంటున్న ఆమె, అసలు పోల్ డాన్సర్ ఎందుకయ్యారు?
భారతీయ మూలాలున్న రిషి సునక్ అత్యంత తక్కువ కాలంలోనే బ్రిటన్ ప్రధానిగా ఎలా ఎదిగారు?
‘కరెన్సీ నోట్లపై లక్షీ దేవి, వినాయకుడు బొమ్మలు ముద్రించాలి’
కరెన్సీ నోట్ల మీద... వినాయకుడు, లక్ష్మీదేవతల బొమ్మలు ముద్రించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
‘మన కొత్త నోట్ల మీద గాంధీ బొమ్మతోపాటు శ్రీ గణేశ్ జీ, శ్రీ లక్ష్మీ జీల ఫొటోలు ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని కోరుతున్నా.
ఇండోనేసియా, శ్రీ గణేష్ జీ ఫొటోను ముద్రించినప్పుడు మనం ఎందుకు చేయలేం.
రెండు మూడు రోజుల్లో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాను.
దేశ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు మనకు దేవుని ఆశీర్వాదాలు కావాలి’ అని ఆయన అన్నారు.
‘కరెన్సీ నోట్ల మీద లక్ష్మీ దేవి, గణేశ్ బొమ్మలు ఉంటే మన దేశం వృద్ధి చెందుతుంది’ అని కేజ్రీవాల్ అన్నట్లు పీటీఐ తెలిపింది.
‘నేనొక పోల్ డాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌ని.. స్ట్రిప్ టీజ్ నేర్చుకోవడానికి గానీ, స్ట్రిపర్‌గా మారడానికి గానీ ఇక్కడికి ఎవ్వరూ రారు’
మల్లికార్జున ఖర్గే: ‘ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగం తీసుకురావాలని చూస్తున్నారు’
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మల్లికార్జున ఖర్గే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు.
‘భారత్‌లో కాంగ్రెస్ లేకుండా చేయాలని వారు కోరుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ ఉన్నంత కాలం అది సాధ్యం కాదు. మేం కానివ్వం. పోరాడతాం.
కొత్త భారత్‌లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. కాలుష్యం పెరుగుతోంది. రూపాయి పడిపోతోంది. అయినా ప్రభుత్వం నిద్రపోతోంది. కానీ సీబీఐ, ఐటీ, ఈడీ సంస్థలు 24 గంటలు పని చేస్తున్నాయి.
గాడ్సేను దేశభక్తునిగాను గాంధీని దేశద్రోహిగాను పిలుస్తున్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగం తీసుకురావాలని వారు కోరుకుంటున్నారు’ అని అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఖర్గే అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన ఖర్గే
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు.
మల్లికార్జున ఖర్గే నాయకత్వం కొత్త స్ఫూర్తిని నింపి పార్టీని బలోపేతం చేస్తుందని సోనియా గాంధీ అన్నారు.
బాధ్యతలు చేపట్టడానికి ముందు గాంధీ, నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ సమాధుల వద్ద ఆయన నివాళులు అర్పించారు.
'డర్టీ బాంబ్' అంటే ఏంటి? దీనిని యుక్రెయిన్ ఉపయోగిస్తుందా? రష్యా ఆరోపణలు ఎందుకు?
ఉత్తరప్రదేశ్: ‘డెంగ్యూ రోగికి బత్తాయి రసం ఎక్కించిన ఆసుపత్రి’
డెంగ్యూ పేషెంట్‌కు బత్తాయి రసం ఎక్కించిందనే ఆరోపణలతో ప్రయాగరాజ్‌లోని గ్లోబల్ హాస్పిటల్‌కు అధికారులు నోటీసులు జారీ చేసినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
రక్తంలోని ప్లేట్లెట్స్‌ను ఎక్కించడానికి బదులు గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు రోగికి బత్తాయి రసం ఎక్కించారనేది ఆరోపణ.
ఈ నెల 28 అంటే శుక్రవారం లోపు బిల్డింగ్‌ను ఖాళీ చేయాలంటూ ఆసుపత్రికి ప్రయాగరాజ్ డెవలప్మెంట్ అథారిటీ ఆదేశించింది.
ఆ ఆసుపత్రిని ‘అక్రమంగా’ నిర్మించారని దాన్ని ‘పడగొడతామ’ని తెలిపింది.
ప్రస్తుతం ఆ ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు.
రష్యాతో నేరుగా చర్చలు జరపాలంటూ రాసిన లేఖను వెనక్కి తీసుకున్న డెమోక్రాట్స్
యుక్రెయిన్-రష్యా యుద్ధానికి ఒక పరిష్కారం కనుగొనేలా రష్యాతో చర్చలు జరపాలంటూ రాసిన లేఖను అమెరికా కాంగ్రెస్‌లోని లెఫ్ట్ వింగ్ డెమోక్రాట్స్ వెనక్కి తీసుకున్నారు.
అమెరికా నేరుగా రష్యాతో చర్చలు జరపాలంటూ ఆ లేఖలో డెమోక్రాట్స్ కోరారు. అయితే తమతో చర్చలు జరిపేందుకు రష్యా సిద్ధంగా లేదని అమెరికా చెబుతూ వస్తోంది.
రెండు పక్షాలు చర్చలకు సిద్ధంగా ఉన్నప్పుడే దౌత్య మార్గాలు పని చేస్తాయని, కానీ యుక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో పరిస్థితి అలా లేదని అమెరికా అధ్యక్ష కార్యాలయం అధికారులు అన్నారు.
అయితే ఆ లేఖను ‘నెల రోజుల’ కిందట రాశారని, అందులో ‘మార్పులు చేర్పులు’ చేయక ముందే సిబ్బంది విడుదల చేశారని చైర్‌ఉమన్ ప్రమీల జయపాల్ అన్నారు.
బ్రిటన్, అమెరికా మాత్రమే కాదు.. పోర్చుగల్, మారిషస్, సింగపూర్ సహా 8 దేశాల్లో అగ్రనేతలుగా ఉన్న భారత సంతతి నాయకులు వీళ్లే
‘ఈ చలికాలంలో తిరిగి రావొద్దు’... ఇతర దేశాల్లో శరణార్థులుగా ఉన్న తమ పౌరులకు యుక్రెయిన్ పిలుపు
ప్రస్తుత చలికాలం ముగిసే వరకు దేశంలోకి తిరిగి రావొద్దంటూ ఇతర దేశాల్లో శరణార్థులుగా ఉంటున్న తమ పౌరులను యుక్రెయిన్ కోరింది.
రష్యా దాడులు చేస్తున్న నేపథ్యంలో శరణార్థులు కూడా వస్తే ఇంధనం, విద్యుత్ సరఫరా వ్యవస్థల మీద భారం పడుతుందని ఆ దేశం భావిస్తోంది.
శరణార్థులు తిరిగి వస్తే ‘వ్యవస్థలు తట్టుకోలేవు’ అని యుక్రెయిన్ డిప్యూటీ ప్రధాని ఇరినా వెరిషుక్ అన్నారు.
‘ఈ చలికాలం మనం నెట్టుకొని రావాలి’ అని ఆమె పిలుపునిచ్చారు.
రష్యా చేసిన దాడుల వల్ల దేశంలోని మూడో వంతు విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నదని ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ ఆరోపించారు.