You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

"రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణాలో బీజేపీ ఉత్సవాలు చేస్తోంది" - రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ స్వతంత్ర వజ్రోత్సవాల పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ ఇక్కడ ఉత్సవాలు చేస్తోందని అన్నారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    మళ్లీ రేపు ఉదయం తాజా వార్తలతో కలుద్దాం.

  2. తైవాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.6 తీవ్రత నమోదు

    ఆగ్నేయ తైవాన్‌లో శనివారం సాయంత్రం భారీ భూప్రకంపనలు వచ్చినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్) వెల్లడించింది.

    రిక్కర్ స్కేల్‌పై 6.6 తీవ్రత నమోదైనట్లు తెలిపింది.

    తైవాన్‌లోని యూజింగ్‌కు 91 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది.

    కాగా భూ ఉపరితలానికి 7.3 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు తైవాన్ వెదర్ బ్యూరో వెల్లడించింది.

    ఇంతవరకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినట్లు తెలియలేదని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

  3. యుక్రెయిన్‌లో ఎదురుదెబ్బలు తగులుతున్నా పుతిన్ ధైర్యంగానే కనిపిస్తున్నారు. కారణం ఏంటి?

  4. ఇటలీలో పెరిగిపోతున్న ఖర్చులు.. రష్యాపై ఆంక్షలు ఎత్తివేయాలంటున్న ప్రజలు

  5. విజయవాడ: శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని కాలితో తన్నుతూ దాడి చేసిన లెక్చరర్.. ఎందుకు? ఆ తర్వాత ఏం జరిగింది?

  6. నేలకొండపల్లి: ఎస్సై స్రవంతి రెడ్డి కులం పేరుతో బహిరంగంగా దళితులను దూషించారా? లేదా? ఎస్సీ కాలనీ వాసులు ఏమంటున్నారు, పోలీసుల వాదనేంటి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  7. క్వీన్ ఎలిజబెత్ 2: కోహినూర్ వజ్రం, హంసలు, డాల్ఫిన్స్‌, ఖరీదైన కార్లు, భూములు, బంగళాలు.. కింగ్ చార్లెస్‌కు తల్లి నుంచి వారసత్వంగా ఏం వస్తున్నాయి?

  8. "రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణాలో బీజేపీ ఉత్సవాలు చేస్తోంది" - రేవంత్ రెడ్డి

    హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ స్వతంత్ర వజ్రోత్సవాల పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘

    ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌తో పాటు భారత్ లో విలీనమైన జునాఘడ్‌లో బీజేపీ ఎందుకు ఉత్సవాలు చేయడం లేదని ప్రశ్నించారు

    రాజకీయ ప్రయోజనాల కోసమే ఇక్కడ బీజేపీ ఉత్సవాలు చేస్తోందని ఆయన అన్నారు.

    తెలంగాణ పరిశ్రమలను గుజరాత్‌కు తరలించుకుపోవాలని, హైదరాబాద్‌లో మత కలహాలు సృష్టించాలని బీజేపీ చూస్తోందని ఆయన ఆరోపించారు.

    సర్దార్ పటేల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడని, ఆయనను ఆర్ ఎస్ ఎస్ నుంచి నిషేధించారని గుర్తు చేశారు. స్వతంత్ర పోరాటంలో కానీ, సాయుధ పోరాటంలో కానీ బీజేపీ పాత్ర లేదని గుర్తు చేశారు.

    సెప్టెంబరు 17ను మత విద్వేషాలు రెచ్చగొట్టే ఆయుధంలా బీజేపీ వాడుకుంటోంది అని రేవంత్ ఆరోపించారు.

    హైదరాబాద్ విలీనంలో నెహ్రూ పాత్రను గుర్తు చేశారు. అసలు తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ పునాది వేసిందే పటేల్ అని ఆయన అన్నారు.

    తమ నాయకుడు పటేల్ ను బీజేపీ దొంగిలిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర కోడ్, పాట అన్నిటినీ మారుస్తాం అని అన్నారు.

    ఈ సందర్భంగా తెలంగాణ తల్లి పేరుతో ఒక కొత్త శిల్పాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహం ఒక చేతిలో జొన్న కంకులతో, మరో చేత్తో అభయం ఇస్తూ, మెడలో తెలంగాణ సంప్రదాయ ఆభరణంతో మూడు రంగుల చీరతో ఉంటుంది.

    కాంగ్రెస్ పార్టీ ఈ ఉత్సవాలను ఏడాది పాటు చేయాలని నిర్ణయించింది.

  9. మూన్‌లైటింగ్ అంటే ఏమిటి? ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు దీనిపై ఎందుకు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి?

  10. యుక్రెయిన్: రష్యా అణ్వాయుధ ప్రయోగం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన బైడెన్

    అమెరికా అధ్యక్షుడు బైడెన్ యుక్రెయిన్ యుద్ధంలో రసాయనిక లేదా ట్యాక్టికల్ న్యూక్లియర్ ఆయుధాలను ప్రయోగించవద్దని రష్యాను హెచ్చరించారు.

    ఆయన సీబీఎస్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

    రష్యా అటువంటి చర్యలకు పాల్పడితే, అంతర్జాతీయంగా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని బైడెన్ హెచ్చరించారు.

    రష్యా ఫిబ్రవరిలో యుక్రెయిన్ పై దాడి మొదలుపెట్టినప్పటి నుంచి తమ న్యూక్లియర్ సేనలను అప్రమత్తంగా ఉంచింది.

    పశ్చిమ దేశాలు చేసిన ప్రకటనల వల్లే ఈ చర్య తీసుకున్నట్లు పుతిన్ ప్రకటించారు.

    గత 80 ఏళ్లుగా న్యూక్లియర్ ఆయుధాలు మనుగడలో ఉన్నాయి. వీటిని చాలా దేశాలు తమ జాతీయ భద్రతకు అవరోధకాలుగా భావిస్తాయి.

    రష్యా దగ్గర సుమారు 5977 అణ్వాయుధాలు ఉన్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ పేర్కొంది. అయితే, వీటిని రష్యా ఉపయోగించకపోవచ్చని భావిస్తున్నారు.

  11. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన చీతాలివి, 70 ఏళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టాయి.

  12. కునో జాతీయ పార్కులోకి చిరుతలను వదిలిపెట్టిన ప్రధాని మోదీ

    నమీబియా నుంచి భారత్ కు తీసుకొచ్చిన 8 చిరుతలను ప్రధాని మోదీ శనివారం కునో జాతీయ పార్కులో విడుదల చేశారు.

    ఇవి భారత్ లో గత 70 ఏళ్ల క్రితం అంతరించిపోయాయి. వీటిని తిరిగి దక్షిణ ఆఫ్రికా నుంచి తెప్పించారు.

    వీటిని పూర్తిగా ఆవాసాల్లోకి వదిలిపెట్టే ముందు నెలరోజుల పాటు క్వారంటైన్ లో ఉంచుతారు.

  13. ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ నాయకులు, ప్రముఖులు

    ప్రధాన మంత్రి మోదీకి అనేక మంది నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, క్యాబినెట్ మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

    మరో వైపు శుక్రవారం జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మోదీ పుట్టినరోజుకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.

    మోదీ పుట్టినరోజు గురించి పుతిన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

    పుతిన్ మొదట మోదీకి 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఆ తర్వాత ప్రధాని మోదీ పుట్టిన రోజు గురించి మాట్లాడారు.

    "ప్రియమైన స్నేహితుడా, రేపు మీ పుట్టినరోజని తెలుసు. రష్యా సంప్రదాయంలో పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా చెప్పం. అందుకే, నేనిప్పుడు మీకు శుభాకాంక్షలు చెప్పలేను. కానీ, ఈ విషయం నాకు తెలుసని మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మీకు నా అభినందనలు”.

    “మీ దేశం సుభిక్షంగా ఉండాలని, మీ నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటున్నాం” అని అన్నారు.

    బౌద్ధ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా కూడా మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

  14. "మతతత్వ శక్తులు తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నాన్ని చేస్తున్నాయి" - జాతీయ సమైక్యతా దినోత్సవ సభలో కేసీఆర్

    1948, సెప్టెంబర్ 17న తెలంగాణభారతదేశంలో విలీనమయిన రోజును తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది.

    ఈ సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్ర శేఖర రావు ప్రసంగించారు.

    తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వేరు పడేందుకు జరిగిన తెలంగాణ పోరాటానికి సారధ్యం వహించానని చెప్పుకుంటూ 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని అన్నారు.

    "తమ నేతృత్వంలో తెలంగాణ ఏ విధంగా ఉండాలని ప్రజలు కోరుకున్నారో అదేవిధంగా నేడు తెలంగాణ అన్నిరంగాల్లోనూ అగ్రగామి రాష్ట్రంగా పురోగమన దిశలో నడుస్తోంది" అని అన్నారు.

    "ఎనిమిదేళ్లుగా ప్రగతి బాటలో ప్రయాణిస్తున్న రాష్ట్రంలో మతతత్వ శక్తులు బయలుదేరి తమవికృత ప్రయత్నాలతో తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి" అని కేసీఆర్ ఆరోపించారు.

    "ఏ దేశమైనా, ఏ సమాజమైనా తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ, వాటిలోని మంచి చెడులను అర్ధం చేసుకుంటూ అప్రమత్తంగా ముందడుగు వేయాలి" అని సూచించారు.

    "హక్కుల కోసం, అస్తిత్వం కోసం తెలంగాణ సమాజం అనుభవించిన ఘర్షణను తలచుకుంటే నేటికీ నా కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి" అని అన్నారు. .

    దేశంలోనూ, రాష్ట్రంలోనూ మతోన్మాదశక్తులు పేట్రేగి పోతున్నాయి. తమ సంకుచిత ప్రయోజనాల కోసం విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయి. మనుషుల మధ్య ఈ రకమైన విభజన ఏ విధంగానూ సమర్థనీయం కాదు" అని అన్నారు.

    "జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి".

    "ఆనాటి చరిత్రతో, పరిణామాలతో ఎటువంటి సంబంధంలేని అవకాశవాదులు చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకుప్రయత్నం చేస్తున్నాయి" అని ఆరోపించారు.

    "జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న ఈ దుష్ట శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాలి. ఈ విషయంలో రెప్పపాటు కాలం ఆదమరిచినా సమాజం కల్లోలంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని మరోమారు హెచ్చరిస్తున్నాను" అని అన్నారు.

    ఈ సందర్భంగా తెలంగాణ కోసం పోరాడిన రాజకీయ నాయకులు, పోరాట యోధులు, సాహిత్యకారులు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

  15. "రాజకీయాల కోసమే తెలంగాణ ప్రభుత్వం విమోచన దినాన్ని నిర్వహించలేదు" - అమిత్ షా

    హైదరాబాద్‌లో శనివారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణా విమోచన దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రసంగించారు.

    "1947లో భారత్‌కు స్వతంత్రం వచ్చే నాటికి హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలనలో ఉండేది. ఆ తర్వాత 13 నెలల పాటు హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రజలు రజాకార్ల అరాచకాలను భరించాల్సి వచ్చింది" అంటూ నిజాం పాలనను గుర్తు చేశారు.

    "నిజానికి రాష్ట్ర ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలనే కోరిక ఉండేది. ఈ రోజును నిర్వహిస్తామని వివిధ పార్టీలు హామీలిచ్చాయి. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటు బ్యాంకు రాజకీయాలతో విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు".

    "రజాకార్ల అరాచకాలు నేటికీ జ్ఞాపకాల్లో సజీవంగా మెదులుతున్నాయి. హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన అరాచకాల గురించి జరిగిన అధ్యయనాలను దేశంలో నలుమూలలా ప్రచారం చేసి వీరుల కథలు వినిపిస్తాం" అని చెప్పారు.

    "సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా కష్టాలనెదుర్కొని ఆపరేషన్ పోలో నిర్ణయాన్ని తీసుకున్నారు. హైదరాబాద్ ను భారత్ లో విలీనం చేసి ఉండకపోతే స్వతంత్ర భారత స్వప్నం ఎప్పటికీ పూర్తి అయి ఉండేదని పటేల్ భావించారు".

    సెప్టెంబరు 17 న తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

  16. అమిత్ షా పై హైదరాబాద్‌లో వ్యంగ్యంగా ఫ్లెక్సీలు

    తెలంగాణాలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాహైదరాబాద్ విచ్చేశారు. ఆయన రాకను నిరసిస్తూ, ఆయన పై వ్యంగ్యంగా ఫ్లెక్సీలు పెట్టారు.

    హైదరాబాద్ నగరంలో పలు బస్టాండ్లపై ఈ బోర్డులు ఏర్పాటు చేశారు.

    "తెలంగాణ అనే చేపకు అమిత్ షా గేలం వేసి, నీకు నేను భరోసా ఇస్తున్నా" అని చెబుతున్నట్టుగా ఈ ఫ్లెక్సీలు ఉంటాయి. వాటితో పాటూ "బైబైమోదీ" అనే హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు.

    గతంలో అనేకసార్లు మోదీ పై వ్యంగ్యంగా ఫ్లెక్సీలు పెట్టి, పోస్టర్లు వేశారు. ఈ సారి అమిత్ షాపై ఫ్లెక్సీ పెట్టారు.

    గతంలో బ్యాంకుల లోన్లు కొందరకి మాఫీ చేయడం వంటి అంశాలపై కూడా బీజేపీ పై వ్యంగ్యంగా బోర్డులు పెట్టారు.

  17. గ్వాలియర్ చేరుకున్న చిరుతలు

    నమీబియా నుంచి భారత్‌కు తీసుకొస్తున్న 8 చిరుతలు గ్వాలియర్ చేరుకున్నాయి. సుమారు 70ఏళ్ల క్రితం భారత్ లో అంతరించిపోయిన ఈ చిరుతలను దక్షిణ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చారు.

    భారత ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా వీటిని తిరిగి మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో ప్రవేశపెట్టనున్నారు. ఇందు కోసం మోదీ మధ్యప్రదేశ్ బయలుదేరి వెళుతున్నారు.

  18. తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న అమిత్ షా

    కేంద్ర ప్రభుత్వం తెలంగాణాలో నిర్వహిస్తున్న విమోచన దినోత్సవంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.

    ఆయన సీఆర్‌పిఆఫ్ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.

    ఈ కార్యక్రమంలో అమిత్ షాతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

    హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం జరుగుతోంది.

  19. హలో..గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.