You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రధాని చేసిన అవినీతి, బంధుప్రీతి వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించిన రాహుల్
ఈ విషయం పై మాట్లాడబోనని, అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అంటూ రాహుల్ గాంధీ వెళ్లిపోయారు.
లైవ్ కవరేజీ
లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం. అంత వరకు సెలవు.
మొబైల్ ఫోన్ రీపేర్‌ను ఉపాధిగా మార్చుకుంటున్న మహిళలు
‘చైనా మాంజా’ అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
చైనా మాంజా అమ్ముతున్నారంటూ దిల్లీలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
మాంజా అంటే గాలి పటం ఎగరవేడానికి వాడే దారం.
‘పశ్చిమ దిల్లీలో పోలీసులు గస్తీ కాస్తున్న సమయంలో ఒక షాపు వద్ద అక్రమంగా చైనా మాంజా విక్రయిస్తున్నట్ల గమనించారు. తనిఖీలు చేయగా సుమారు 170 బండిల్స్ కనిపించాయి.
అది అశోక్ కుమార్ అనే వ్యక్తికి చెందిన దుకాణం. దాంతో కేసు పెట్టి ఆయనను అరెస్టు చేశాం’ అని డీసీపీ సమీర్ శర్మ తెలిపారు.
‘నువ్వొక బాంబర్‌వి’ అంటూ ఆ యువకుడికి వచ్చిన మెసేజ్‌తో విమానం ఆరుగంటలు ఆగిపోయింది...
సల్మాన్ రష్దీ: ‘సైతాన్ ఒక కన్ను పోగొట్టుకుంది’- రష్దీ మీద దాడిపై ఇరాన్ మీడియాలో కథనాలు
ఇండియా@75: స్వతంత్ర భారత్‌లో 15 కీలక ఘట్టాలు
భారతదేశంలో తయారైన మైకుకు ‘చికాగో రేడియో’ అని ఎందుకు పేరు పెట్టారు, గాంధీ దాన్ని ఎందుకు ఉపయోగించారు
ప్రధాని చేసిన అవినీతి, బంధుప్రీతి వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించిన రాహుల్
అవినీతీ, బంధుప్రీతి అనే రెండు అంశాలు దేశానికి ప్రధాన సమస్య మారాయంటూ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని చేసిన ప్రసంగంపై స్పందించేందుకు రాహుల్ గాంధీ నిరాకరించారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. తాను ఈ విషయం పై మాట్లాడబోనని, అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అంటూ రాహుల్ గాంధీ స్పందించకుండా వెళ్లిపోయారని వెల్లడించింది.
మరోవైపు నరేంద్ర మోదీ ప్రసంగం నిరాశాపూరిత ప్రసంగమని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా వ్యాఖ్యానించారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, అందరికీ ఇళ్లు ఇస్తామని, నల్లధనం వెనక్కి తెస్తామని, ఉపాధి కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వాగ్దానాలు చేశారని, ఈ వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో నిద్రపట్టక ఆయన నిరాశాపూరిత ప్రసంగాలు చేస్తున్నారని ఖేరా అన్నారు.
బీజేపీలోనే అసలైన కుటుంబవాదం, బంధు ప్రతీ ఉన్నాయని ఖేరా ఆరోపించారు. లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసిన వ్యక్తి క్రికెట్‌లో అత్యున్నత పదవి పొందినట్లు తనకు గుర్తు లేదని అన్నారు.
ఓ మంత్రి కొడుకు ఫారిన్ సర్వీస్ ఎగ్జామ్ పాస్ కాలేదని, కానీ ఆయనిప్పుడు ఒక థింక్ ట్యాంక్ అధినేతగా వ్యవహరిస్తున్నారని ఖేరా అన్నారు. మోదీ తన మంత్రుల మీద తానే విమర్శలు చేసుకున్నారని ఆయన అన్నారు.
వైఎస్ జగన్: ‘తెలుగు వాడు రూపొందించిన జెండా నేడు దేశానికే గుండె’
విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగుర వేశారు. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వ విభాగాలు రూపొందించిన శకటాల ప్రదర్శనను జగన్ తిలకించారు.
తరువాత మాట్లాడిన జగన్... భారతదేశపు ఆత్మకు, ప్రజలందరి ఆత్మగౌరవానికి జాతీయ జెండా ప్రతీకని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
- మన తెలుగువాడు పింగళి వెంకయ్యగారు తయారు చేసిన ఈ జెండా ఇప్పుడు 141 కోట్ల భారతీయుల గుండె.
- అహింసే ఆయుధంగా, సత్యమే సాధనంగా సాగిన శాంతియుత స్వతంత్ర సంగ్రామ పోరాటం... ఒక్క భారతదేశానికి మాత్రమే కాదుమొత్తంగా ప్రపంచ మానవాళికి స్ఫూర్తిగా కలకాలం నిలిచే ఉంటుంది.
- గత 75 సంవత్సరాల్లోఇండియా తిరుగులేని విజయాలను, అనేక రంగాల్లో అభివృద్ధిని సొంతం చేసుకుంది.
కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది: కేసీఆర్
తెలంగాణవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య వేడుకలు జరిగాయి. హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కేంద్రం సమాఖ్యస్పూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తోందని.. రాష్ట్రాల అధికారాలను కుదిస్తోందని, రాజ్యంగబద్ద పదవుల్లో ఉన్నవారే ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నంచేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు.
గాంధీ,నెహ్రు,పటేల్‌లతో పాటు దేశ స్వాతంత్ర్య పోరాటంలో తుర్రేబాజ్ ఖాన్, రాంజీగోండు,మౌల్వీ అలావుద్దీన్, సంగెం లక్ష్మీబాయి, పీవీ నర్సింహరావ్ వంటి తెలంగాణ వీరులు ప్రముఖ పాత్రపోషించారని కేసీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం బలమైన ఆర్థిక శక్తిగా అవతరిస్తోందని చెప్పిన కేసీఆర్ తన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రజలకు కలుగుతున్న లబ్ధి వివరాలు వెల్లడించారు.
తెలంగాణ ఇప్పటివరకు లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని.. మరో 91,142 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ ప్రక్రియ చేపట్టామని కేసీఆర్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర అప్పులపై అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆరోపించిన కేసీఆర్... ‘కేంద్రం లెక్కల ప్రకారం 2019-20 నాటికి తెలంగాణ మొత్తం అప్పు 2,25,450కోట్లు. 2014 లో తెలంగాణ ఏర్పడే నాటికి 75,577 కోట్ల అప్పు ఉంది. తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు 1,49,873 కోట్ల అప్పు ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడి వ్యయంగానే వినియోగించింది. దేశంలోని 22 రాష్ట్రాలు తెలంగాణకన్నా ఎక్కువగా అప్పులు చేశాయి’ అన్నారు.
‘పసిపిల్లలు తాగే పాలు నుంచి స్మశానవాటికల నిర్వహణ వరకు ప్రజల అవసారలపై కేంద్రం పన్నులు విధిస్తూ పేద, మధ్యతరగతిపై భారం మోపుతోంది. సంక్షేమ పథకాలకు ‘ఉచితాలు’అనే పేరు తగిలించి అవమానిస్తోంది. కేంద్రం అసమర్థత వల్ల ఆర్థికాభివృద్ది కుంటుపడింది. ద్రవ్యోల్భణతో ధరలు ఆకాశాన్నంటాయి.నిరుద్యోగం పెరిగింది. తన వైఫల్యాలు కప్పిపుచ్చేందుకు విద్వేశ రాజకీయాలతో ప్రజలను విభజించే ఎత్తుగడలకు పాల్పడుతోంది. రాజ్యంగ పదవుల్లో ఉన్నవారే ఫాసిస్ట్ దాడులకు పాల్పడుతున్నారు’ అంటూ కేంద్రంపై కేసీఆర్ విమర్శలు చేశారు.
కుటుంబపాలన, అవినీతికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటం చేస్తున్నాను, దేశ రాజకీయాలను శుద్ధి చేస్తాను.. మీ ఆశీర్వాదం కావాలి: మోదీ
‘ఒకవైపు బతికేందుకు జీవించేందుకు చోటులేదు. మరోవైపు దోచుకున్నది దాచుకునేందుకు చోటు లేదు. అవినీతిపై పోరాడాలి. ప్రత్యక్ష నగదు బదిలీ ఆధార్ మొబైల్ ద్వారా రూ. 2 లక్షల కోట్లు అవినీతిపరుల చేతుల్లోకి వెళ్లకుండా చూశాం
నిర్ణయాత్మక పోరాటం చేస్తున్నాను. నాకు ఆశీర్వాదం ఇవ్వండి. మద్దతు ఇవ్వండి. తద్వారా నేను ఈ పోరాటంలో విజయం సాధించి, సామాన్యుల జీవితాలపై అవినీతి ప్రభావం లేకుండా చేస్తా
అవినీతిపైన పోరాటం చేస్తాం. అవినీతిపరులపైనా సానుభూతి వస్తోంది.
జైలుకు వెళ్లిన తర్వాత కూడా వాళ్ల ప్రతిష్ట పెరుగుతోంది. సమాజంలో అపరిశుభ్రతపై, అవినీతిపరులపై కోపం లేకపోతే..
దౌర్భాగ్యం.. రాజకీయ.. కుటుంబ పాలన.. చాలా సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. దేశ టాలెంట్, సామర్థ్యానికి నష్టం జరుగుతోంది. అవినీతికి ఒక కారణం ఇదే.. ప్రతి సంస్థలోనూ అవినీతికి వ్యతిరేకంగా చైతన్యం పెరగాలి.
రాజకీయాల్లో కుటుంబ పాలన చాలా అన్యాయం చేసింది. వారి రాజకీయమంతా కుటుంబ ఎదుగుదల కోసమే. దేశం కోసం కాదు.
దేశ రాజకీయాలను, సంస్థలను శుద్ధి చేసేందుకు.. కుటుంబ యోగ్యత ఆధారంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఇది అనివార్యం. ఈ మనఃస్థితి దేశానికి మంచిది కాదు. మీ భవిష్యత్ కోసం, మీ మంచి కోసం పోరాడుతున్నాను. రాజకీయ పోరాటానికి మీ మద్దతు కావాలి. ప్రజాస్వామ్యానికి నేను జవాబుదారీని’’ అన్నారు మోదీ.
నరేంద్ర మోదీ: మహిళలను అగౌరవపర్చబోమని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి
మహిళలను అగౌరవపర్చడం ఆపుతామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
అంతరిక్షం నుంచి మహాసముద్రాల లోతుల వరకు ప్రతి అంశంలో పరిశోధనలకు ఈ దేశ యువతకు అన్నిరకాలుగా మద్దతు లభించేలా కృషి కొనసాగుతోందన్నారు.
ఆ క్రమంలోనే స్పేస్ మిషన్, డీప్ ఓసన్ మిషన్ విస్తరిస్తున్నట్లు చెప్పారు.
మోదీ: స్వేచ్ఛాభారత నిర్మాతల కృషి ఫలితమే ఇది
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగించిన ప్రధాని మోదీ ‘స్వేచ్ఛాభారత నిర్మాతల’ను స్మరించుకున్నారు. స్వతంత్ర పోరాటంలో వారి పాత్రను దేశ ప్రజలకు గుర్తుచేశారు.
ఎర్రకోట నుంచి వరుసగా తొమ్మిదో ఏడాది ప్రసంగించిన ఆయన జాతిపిత గాంధీతో ప్రారంభించి భగత్ సింగ్, రాంప్రసాద్ బిస్మిల్, రాణి లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్ సహా ఇతర స్వాతంత్ర్య పోరాటయోధులు బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను ఎలా కదిలించారో చెప్పారు.
జవహల్ లాల్ నెహ్రూ, రాంమనోహర్ లోహియా, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబూ రాజేంద్ర ప్రసాద్ వంటివారు భారతదేశ నిర్మాణానికి చేసిన కృషిని ఆయన గుర్తుచేసుకున్నారు.
స్వామి వివేకానంద, అరబిందో, రవీంద్రనాథ్ ఠాగోర్ వంటి ఆలోచనాపరుల... శ్యామప్రసాద్ ముఖర్జీ, లాల్ బహుదూర్ శాస్త్రి వంటి నేతల సేవలను స్మరించారు.
అల్లూరి సీతారామరాజు వంటి ఆదివాసీల పోరాటం
స్వాతంత్ర్య పోరాటంలో ఆదివాసీలు కీలక పాత్ర పోషించారన్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆయన అల్లూరి సీతారామరాజు, బిర్సా ముండా, తిరోత్ సింగ్ వంటివారిని ప్రస్తావించారు.
రాణి లక్ష్మీబాయి, జల్కారీ బాయి, రాణి చెన్నమ్మ, బేగం హజరత్ మహా వంటి మహిళలు పరాయి పాలకులను ఎదిరించారని మోదీ అన్నారు.
అంతకుముందు మోదీ ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఎర్రకోట వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి ప్రవేశ ద్వారం వద్ద ఫేషియల్ రికగ్నిషన్ కెమేరాలను అమర్చారు.
స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో ఎర్రకోట వద్ద కోతులు తిరగకుండా వాటిని పట్టుకునేవారినీ అందుబాటులో ఉంచారు.
ఎర్రకోట ప్రాంతంలో నిత్యం గాలిపటాలు ఎగురవేసే వారిలో సుమారు 231 మందిని పోలీసులు తమ నియంత్రణలో ఉంచారు. వేడుకల సందర్భంగా సోమవారం ఉదయం మూడు గంటల పాటు ఎర్రకోట ప్రాంతంలో ఆకాశంలో ఎవరూ ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నరు.
Live: ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగం
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు.
అనంతరం ఆయన ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు.
స్వాతంత్ర్య పోరాటంలో త్యాగాలు చేసిన జాతీయ నాయకులను ఆయన ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీ సమాధి వద్ద ఆయనకు నివాళులర్పించి అక్కడి నుంచి ఎర్రకోటకు చేరుకున్నారు.
ప్రధాని తన ప్రసంగంలో అల్లూరి సీతారామరాజు వంటి తెలుగు స్వాతంత్ర్య పోరాటకారులను గుర్తుచేశారు.
దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
స్వాతంత్ర్యం సాధించుకుని 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలపడంతో పాటు జైహింద్ అంటూ ట్వీట్ చేశారు.
హలో, గుడ్ మార్నింగ్!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.