తెలంగాణలో భారీ వర్షాల ధాటి
కొనసాగుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయిదో రోజు విస్తారంగా వర్షాలు కురిశాయి. నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి
సామర్థ్యాన్ని మించి ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్ట్ ప్రమాదంలో ఉందన్న
వార్తలు వచ్చాయి.జిల్లా మంత్రి ఇంద్రకరణ్
రెడ్డి, అధికారులతో కలిసి ప్రాజెక్ట్‌ను సందర్శించారు.ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు వచ్చిన ప్రమాదం ఏమీ
లేదని, గేట్లు అన్నీ పనిచేస్తున్నాయని ప్రాజెక్ట్ అధికారి
సుశీల్ మీడియాకు తెలిపారు. ఎగువ బోథ్ ప్రాంతంలో భారీ వానలతో4 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది.
దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిర్మల్
జిల్లాలో 18 సె.మీ సగటు వర్షపాతం నమోదైంది.
కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్‌కు ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి భారీ ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో 81 గేట్లను పైకి ఎత్తి 12 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ మహారాష్ట్ర నుంచి వరద కొనసాగుతోంది. మంగళవారం నుంచి ప్రాజెక్ట్ లెవల్‌ను 76 టీఎంసీల వద్ద స్థిరంగా ఉంచి మిగులు జలాలను దిగువకు వదులుతున్నారు.
రాజన్నసిరిసిల్ల జిల్లాలో అప్పర్ మానేరు డ్యామ్ పొంగిపొర్లుతోంది.
కడెం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడంతో దిగువన గోదావరిపై ఉన్న పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు భారీ వరద చేరింది. 45 గేట్లు ఎత్తి 9 లక్షల పైచిలుకు క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
చెన్నూరు, మంచిర్యాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి.
ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు కొమురం భీమ్ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తేసారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలతో 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి నిర్వాసితులకు భోజన వసతి కల్పించారు.
జగిత్యాల జిల్లా రాయికల్ వద్ద రామోజీవాగులో నిన్న కారుతో సహా గల్లంతైన ఎన్టీవీ జర్నలిస్ట్ జమీర్ ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోనూ ఇదే రకమైన పరిస్థితులు నెలకొన్నాయి.
కామారెడ్డి బీడీ వర్కర్స్ కాలనీలో బట్టలు ఆరేసే క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మంగళవారం మృత్యువాత పడ్డారు.
ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రేపు ఉదయం 8:30 గంటల వరకు ఆసిఫాబాద్, ములుగు, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి, పెద్దపల్లి, వరంగల్, జనగామ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ హెచ్చరించింది.