You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

మహారాష్ట్ర సంక్షోభం: ముఖ్యమంత్రి నివాసం నుంచి కుటుంబంతో సహా బయటకు వెళ్లిపోయిన ఉద్ధవ్ ఠాక్రే

‘‘వారికి నామీద ఏవైనా వ్యతిరేకత ఉన్నట్లయితే ఇదంతా సూరత్ వెళ్లి చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్లు నా దగ్గరకు వచ్చి నా ముందే ఇది చెప్పి ఉండొచ్చు’’ అని ఠాక్రే వ్యాఖ్యానించారు.

లైవ్ కవరేజీ

  1. ద్రౌపది ముర్ము: క్లర్క్‌ నుంచి రాష్ట్రపతి వరకు... ఆదివాసీ నేత ప్రస్థానం

  2. ధన్యవాదాలు

    నేటి బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

    మళ్లీ రేపు లైవ్ పేజీలో తాజా కథనాలతో కలుద్దాం.

    ధన్యవాదాలు.

  3. బ్రేకింగ్ న్యూస్, ముఖ్యమంత్రి నివాసం నుంచి కుటుంబంతో సహా బయటకు వెళ్లిపోయిన ఉద్ధవ్ ఠాక్రే

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తన అధికారిక నివాసం నుంచి బుధవారం రాత్రి బయటకు వెళ్లిపోయారు.

    ఆయన వెనుకే ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే, ఆయన సోదరుడు తేజస్ ఠాక్రే, వారి తల్లి రష్మీ ఠాక్రేలు కూడా ఆ నివాసం నుంచి వెళ్లిపోయారు.

    నివాసం వెలుపల భారీగా పోగైన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ‘ఉద్ధవ్ మీరు వెళ్లండి.. మీ వెంటే మేమున్నాం’ అంటూ నినాదాలు చేశారు.

    ‘అసహజ సంకీర్ణం’ నుంచి తప్పుకోవాలి: ఏక్‌నాథ్ షిందే

    దీనికి ముందు శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిందే అస్సాం రాజధాని గౌహతిలో బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో శివసేన మనుగడ సాగించాలంటే ‘అసహజ సంకీర్ణం’ నుంచి శివసేన బయటపడాల్సి ఉందని పేర్కొన్నారు.

    రాష్ట్రంలో రెండున్నరేళ్ల సంకీర్ణ ప్రభుత్వ హయాంలో భాగస్వామ్య పార్టీలే లాభపడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు మహారాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.

    ఏక్‌నాథ్ షిందే కొందరు తిరుగబాటు ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని మంగళవారం నాడు ముంబై నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు చేరుకోవటంతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మొదలైంది.

    ఆయన బుధవారం సాయంత్రం సూరత్ నుంచి తనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు సహా అస్సాం రాజధాని గౌహతి చేరుకున్నారు.

    తనకు ఏడుగురు స్వతంత్ర శాసనసభ్యులు సహా మొత్తం 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ చెప్పింది.

    అయితే.. మరో నలుగురు మహారాష్ట్ర ఎమ్మెల్యేలు గౌహతికి చేరుకున్నారని, దీంతో మొత్తం అక్కడ బస చేసిన ఎమ్మెల్యేల సంఖ్య 40కి చేరిందని బీబీసీ ప్రతినిధి తెలిపారు.

  4. ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసం నుంచి సామాన్ల తరలింపు

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసం వర్ష బంగళా నుంచి బుధవారం రాత్రి సామాన్లు బయటకు తరలిస్తున్నారు.

    ‘నేను ముఖ్యమంత్రిగా కొనసాగవద్దని ఏ ఎమ్మెల్యే అయినా కోరుకుంటున్నట్లయితే.. వర్ష బంగళా (ముఖ్యమంత్రి అధికార నివాసం) లో నా వస్తువులన్నీ సర్దుకుని మాతోశ్రీకి వెళ్లిపోవటానికి నేను సిద్ధం’’ అని ఉద్ధవ్ ఠాక్రే ఫేస్‌బుక్ లైవ్‌లో చెప్పిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది.

    సామాన్లు తరలిస్తున్న వీడియోను ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.

    అంతకుముందు మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం భాగస్వామి అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలేలు ఉద్ధవ్ ఠాక్రేతో గంటసేపు సమావేశమై చర్చలు జరిపారు.

    ఆ తర్వాత ఠాక్రే అధికారిక నివాసం బయటకు వచ్చి ఇంటి వద్ద గుమిగూడిన శివసేన కార్యకర్తలకు అభివాదం చేశారు.

    ఇదిలావుంటే.. తమకు అవకాశం లభిస్తే శాసనసభలో తమ మెజారిటీని నిరూపించుకుంటామని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

    ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అని, ముఖ్యమంత్రిగానే కొనసాగుతారని ఆయన చెప్పారు.

  5. నీటిలో నానినప్పుడు వేళ్లు ఎందుకు ముడతలు పడతాయి, దాన్నివల్ల కూడా ప్రయోజనాలుంటాయా?

  6. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో బైజూస్ ఒప్పందంలో ఏముంది, దీనిపై అభ్యంతరాలు ఎందుకు?

  7. ఒడిషా ఎమ్మెల్యేలందరూ పార్టీలకతీతంగా ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలి: నవీన్ పట్నాయక్

    ఒడిషాకు చెందిన శాసనసభ్యులందరూ ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు.

    ద్రౌపతి ముర్ము ఒడిషా కుమార్తె అని, రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు అందరూ పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఆమెకు మద్దతు తెలపాలని ఆయన బుధవారం ట్వీట్ చేశారు.

    ఒడిషాకు చెందిన గిరిజన మహిళా నేత, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము పేరును.. రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రంలోని అధికార ఎన్‌డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా మంగళవారం రాత్రి ప్రకటించారు.

    దానికి ముందు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరును కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రకటించారు.

  8. ప్రాణాలు మింగేస్తున్న మ్యాన్‌హోల్స్-మురుగు కాలువల్లోకి ఇంకా మనుషులే దిగాలా

  9. అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం - 1,000మందికి పైగా మృతి

  10. దినేశ్ కార్తీక్: ఫినిష్ అయిపోయాడనుకున్న ప్రతిసారీ ఫీనిక్స్ లాగా పైకి లేస్తున్న క్రికెటర్

  11. బ్రేకింగ్ న్యూస్, ఉద్ధవ్ ఠాక్రే: ‘నేను సీఎంగా వద్దని ఎమ్మెల్యేలు కోరుకుంటే నా సామాన్లు సర్దుకుని వెళ్లిపోవటానికి సిద్ధం’

    ‘‘నేను ముఖ్యమంత్రిగా కొనసాగవద్దని ఏ ఎమ్మెల్యే అయినా కోరుకుంటున్నట్లయితే.. వర్ష బంగళా (ముఖ్యమంత్రి అధికార నివాసం) లో నా వస్తువులన్నీ సర్దుకుని మాతోశ్రీకి వెళ్లిపోవటానికి నేను సిద్ధం’’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు.

    రాష్ట్రంలో అధికార శివసేన పార్టీలో సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో.. ఉద్ధవ్ ఠాక్రే బుధవారం సాయంత్రం ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

    ‘‘నా సొంత వాళ్లే (ఎమ్మెల్యే) నన్ను వద్దనుకుంటే నేనేం చెప్పగలను? వారికి నామీద ఏవైనా వ్యతిరేకత ఉన్నట్లయితే ఇదంతా సూరత్ వెళ్లి చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్లు నా దగ్గరకు వచ్చి నా ముందే ఇది చెప్పి ఉండొచ్చు’’ అని వ్యాఖ్యానించారు.

    ‘‘మీరు చెప్తే సీఎం పదవి వదిలిపెట్టటానికి నేను సిద్ధం. ఇది నంబర్ల గురించి కాదు. ఇది నన్ను ఎంతమంది వ్యతిరేకిస్తున్నారనే దాని గురించి. ఒక్క ఎమ్మెల్యే అయినా సరే నన్ను వ్యతిరేకిస్తున్నట్లయితే నేను వెళ్లిపోతా. కనీసం ఒక్క ఎమ్మెల్యే నన్ను వ్యతిరేకించాన కూడా అది నాకు చాలా అవమానరం’’ అని ఆయన పేర్కొన్నారు.

    ‘‘ముఖ్యమంత్రి పదవి వస్తుంది, పోతుంది. కానీ నిజమైన సంపద ప్రజల అభిమానం. గడచిన రెండేళ్లలో ప్రజల నుంచి ఎంతో అభిమానం సంపాదించుకోగలగటం నా అదృష్టం’’ అని చెప్పారు.

    ‘‘కాంగ్రెస్, ఎన్‌సీపీలు నాకు మద్దతిచ్చాయి. కానీ నా సొంత వాళ్లే నన్ను సీఎంగా వద్దని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. నా ఎమ్మెల్యేలు ఇక్కడ నా ముందుకు వచ్చి, నేను సీఎంగా వద్దని వారు కోరుకుంటున్నట్లు నాతో చెప్తే.. నేను ఈ పదవిని అంటి పెట్టుకుని ఉండను. నా రాజీనామాను నేను సిద్ధంగా ఉంచుతాను’’ అని ఠాక్రే పేర్కొన్నారు.

    ‘‘తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి, రాజీనామా చేయాల్సిందిగా నాకు చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీకి సారథ్యం వహించే సమర్థత నాకు లేదని శివసైనికులు ఎవరైనా భావించినట్లయితే నాకు చెప్పండి. శివసేన సభ్యుడు మరెవరైనా సీఎం అవటానికి నేను సంతోషంగా అంగీకరిస్తా’’ అని చెప్పారు.

  12. Cannabis: గంజాయితో ఇక్కడ కూరలు వండుతారు, ఐస్‌ క్రీమ్‌లు, పానీయాలు అన్నింటిలోనూ..

  13. ఈ యూట్యూబర్లు ఇచ్చే ఆర్ధిక సలహాతో లాభాలు సంపాదించొచ్చా, యూజర్లు ఎందుకు ఎగబడుతున్నారు

  14. మహారాష్ట్ర సంక్షోభం: ‘రెబల్ ఎమ్మెల్యేల’ను కలవనున్న బీజేపీ చీఫ్

    మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చార్టర్ ఫ్లయిట్‌లో సూరత్ చేరుకున్నారు. కాసేపట్లో నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన గువాహటి బయలుదేరారు.

    శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ శిందే గువాహటిలో ఉన్న విషయం తెలిసిందే. తన వద్ద 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన చెబుతున్నారు.

    మరోవైపు ఈరోజు సాయంత్రానికి కల్లా పార్టీ సమావేశానికి రావాలని అందరి ఎమ్మెల్యేలకు శివసేన ఆదేశాలు జారీ చేసింది.

    సమావేశానికి రాని వారి సభ్యత్వం రద్దు చేస్తామని హెచ్చరించింది.

  15. అస్సాం: వరదల వల్ల నీట మునిగిన 32 జిల్లాలు

    అస్సాంలో వారం రోజులుగా వరద విధ్వంసం సృష్టిస్తోంది.

    గత ఏడు రోజుల్లో 45 మందికి పైగా చనిపోయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పరిస్థితి మరింత ఘోరంగా మారుతోంది.

  16. మహారాష్ట్ర: ‘నాతో 46 మంది ఎమ్మెల్యేలున్నారు... ఇది మరింత పెరుగుతుంది’

    తనతో 46 మంది ఎమ్మెల్యేలున్నారని శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ శిందే అన్నారు. వీరిలో 6 నుంచి 7గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలున్నారని తెలిపారు.

    ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, వారితో తాము చర్చించ లేదని వార్తా సంస్థ ఏఎన్‌ఐకు ఆయన వెల్లడించారు.

  17. మహారాష్ట్ర సంక్షోభం: ‘నన్ను పోలీసులు ఎత్తుకెళ్లారు’

    తాను ఉద్ధవ్ ఠాక్రేతోనే ఉన్నట్లు శివసేన రెబల్ క్యాంప్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ అన్నారు.

    తనను పోలీసులు ఎత్తుకొని పోయినట్లు ఆయన తెలిపారు.

    ‘నాకు గుండెపోటు వచ్చిందనే నెపంతో నన్ను 100 నుంచి 150 మంది పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. నాకు హాని చేయాలని వారు భావించారు. దేవుడి దయవల్ల నేను బాగానే ఉన్నా.’ అని ఆయన మీడియాకు తెలిపారు.

  18. వీఆర్‌ఓను బూతులు తిట్టిన వైసీపీ ఎమ్మెల్యే, తులసీ ప్రసాద్ రెడ్డి, బీబీసీ కోసం

    చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం గాండ్లపల్లిలో ఈ నెల 21న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

    ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అధికారులపై చిందులేశారు.

    గాండ్లపల్లి ఇన్‌చార్జ్ వీఆర్ఓగా వారం క్రితమే బాధ్యతలు తీసుకున్న రవిని పరుష పదజాలంతో ఎమ్మెల్యే బూతులు తిట్టారు. దీంతో మనస్థాపానికి గురైన రవి కంటతడి పెట్టుకున్నారు.

    రెండు సంవత్సరాల నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పాస్ బుక్‌లు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని ఎమ్మెల్యేకి రైతులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

    మనస్తాపానికి గురైన కొందరు అధికారులు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు.

    ఈ విషయంపై వీఆర్‌ఓ రవిని బీబీసీ సంప్రదించింది. దీనిపై తాను మాట్లాడే పరిస్థితుల్లో లేనని ఆయన తెలిపారు.

  19. ‘హిందుత్వ పేరుతో ప్రజాస్వామ్యం మసకబారుతోంది’

    దేశంలో హిందుత్వ పేరుతో ప్రజాస్వామ్యం మసకబారుతోందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు.

    ఈ విషయాన్ని ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకోవడం లేదని, తరువాత వారే బాధపడతారని ఆయన చెప్పుకొచ్చారు.

    దేశంలో శాంతి భద్రతలు సరిగా లేవు, ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది... కానీ బీజేపీ మాత్రం ఎమ్మెల్యేలను కొనే పనిలో ఉందని ఆయన విమర్శించారు.

  20. బ్రేకింగ్ న్యూస్, మహారాష్ట్ర సంక్షోభం: ప్రారంభమైన కేబినెట్ సమావేశం

    మహారాష్ట్రలో ప్రారంభమైన కేబినెట్ సమావేశం.

    కరోనా సోకడంతో వీడియో కాన్ఫరేషన్ ద్వారా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమావేశంలో పాల్గొంటున్నారు.