You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బోరిస్ జాన్సన్: అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందుగా మద్దతు కోరుతూ ఎంపీలకు బ్రిటన్ ప్రధాని లేఖలు
ఈ ఓటింగ్‌లో ఓడిపోతే, ప్రధాన మంత్రి పదవికి బోరిస్ జాన్సర్ రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు కన్వర్వేటివ్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకుంటుంది.
లైవ్ కవరేజీ
పృథ్వి రాజ్
నేటి ముఖ్యాంశాలు
అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందుగా తనకు మద్దతు ఇవ్వాలని ఎంపీలకు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ లేఖలు రాశారు.
2006 వారణాసి బాంబు పేలుళ్ల కేసు నిందితుడు వలీయుల్లా ఖాన్‌కు ఘాజియాబాద్ కోర్ట్ మరణశిక్ష విధించింది.
కేరళలోని తిరువనంతపురంలో రెండు నోరో వైరస్ కేసులు నమోదైనట్లు అధికార వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు.
ఉత్తర కొరియా ఆదివారం నాడు వరుసగా ఖండాంతర క్షిపణులను పేల్చింది. దీనికి ప్రతిస్పందనగా దక్షిణ కొరియా, అమెరికా దేశాలు కూడా సోమవారం నాడు ఎనిమిది క్షిపణులను పేల్చాయి.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌లకు చంపేస్తామంటూ ఆదివారం బెదిరింపు లేఖ అందింది. దీనిపై ముంబయి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో ఆదివారం సాయంత్రం ఒక యాత్రికుల బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 26 మంది యాత్రికులు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
బ్రిటన్ రాణిగా 70 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎలిజబెత్-2, ఈ 70 ఏళ్ల ప్రయాణం 70 సెకన్లలో
హార్సిలీ హిల్స్: ఈ ఆంధ్రా ఊటీకి ఆ పేరు ఎలా వచ్చింది? ఇక్కడ గడిపితే టీబీ వ్యాధి నయమవుతుందా
బోరిస్ జాన్సన్: అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందుగా మద్దతు కోరుతూ ఎంపీలకు బ్రిటన్ ప్రధాని లేఖలు
అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందుగా తనకు మద్దతు ఇవ్వాలని ఎంపీలకు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ లేఖలు రాశారు.
అయితే, షెడ్యూల్ ప్రకారం ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలకూ ఆయన హాజరు అవుతున్నారు. ఎస్టోనియా ప్రధాన మంత్రి కజా కల్లాజ్‌తో ఆయన భేటీ అయ్యారు. యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమీర్ జెలియెన్‌స్కీతోనూ ఆయన ఫోన్‌లో మాట్లాడారు.
బ్రిటన్ కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల(భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 నుంచి 12.30 మధ్య) మధ్య అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. రాత్రి 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 1.30 గంటలకు) ఫలితాలను వెల్లడిస్తారు.
ఈ ఓటింగ్‌లో ఓడిపోతే, ప్రధాన మంత్రి పదవికి బోరిస్ జాన్సర్ రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు కన్వర్వేటివ్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకుంటుంది.
అరవింద్ కేజ్రీవాల్: ‘కశ్మీరీ పండిట్ల హత్యలు సరికాదు’
కశ్మీరీ పండిట్‌ల పట్ల జరుగుతోన్న నరమేధం సరైనది కాదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
‘‘కశ్మీరీ పండిట్లు రెండు సార్లు వలస వెళ్లాల్సి వచ్చింది. ఆ రెండుసార్లూ బీజేపీనే అధికారంలో ఉంది. వారికి రక్షణ కల్పించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా’’ అని ఆయన అన్నారు.
చైనా: అంతరిక్షంలో నంబర్ 1 కావాలనుకుంటుందా? ప్రయోగాలకు నిధులు సమకూరుస్తున్నది ఎవరు
2006 వారణాసి బాంబు పేలుళ్ల కేసులో వలీయుల్లా ఖాన్‌కు మరణశిక్ష
2006 వారణాసి బాంబు పేలుళ్ల కేసు నిందితుడు వలీయుల్లా ఖాన్‌కు ఘాజియాబాద్ కోర్ట్ మరణశిక్ష విధించింది.
వారణాసిలోని సంకట్‌మోచన్ ఆలయం, వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లలో 2006లో బాంబులు పేలడంతో 28 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ కేసులో సుదీర్ఘ కాలంగా వాదనలు జరుగుతున్నాయి. తాజాగా ఘాజియా బాద్ కోర్టు వలీయుల్లా ఖాన్‌కు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
టిప్పు సుల్తాన్ కట్టించిన జామియా మసీదు ఒకప్పుడు హనుమాన్ మందిరమా
కేరళలో రెండు నోరో వైరస్ కేసులు
కేరళలోని తిరువనంతపురంలో రెండు నోరో వైరస్ కేసులు నమోదైనట్లు అధికార వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
పాఠశాలకు వెళ్లే విద్యార్థుల్లోనే ఈ వైరస్‌ను గుర్తించినట్లు, దీనిపై పూర్తి నివేదికను ప్రభుత్వం కోరిందని తెలిపింది.
నూపుర్ శర్మ వివాదం: భారత్, అరబ్ దేశాల సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడనుంది
‘ఏపీలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలి’- జేపీ నడ్డా
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని విజయవంతం చేయటానికి విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసుకోవటం శుభప్రదమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.
ఏపీలో 46 వేల బూత్‌లు ఉన్నాయని, వీటికి కమిటీలు వేసి ప్రజలను కలవాలని కోరారు.
‘‘ఏపీలో పదివేలకు మించి శక్తి కేంద్రాలున్నాయి. ఇందులో రెండున్నర వేల కేంద్రాలకు కమిటీలు వేసుకోవాలి. రానున్న రెండు నెలల్లో ఇది పూర్తి కావాలి. కమిటీలో మహిళలు, బీసీ, ఎస్సీ, గిరిజన, ముస్లిం ఇలా అన్ని వర్గాలు ఉండాలి.
ప్రతీ బూత్ పరిధిలో కార్యకర్తలతో కూర్చుని మన్ కీ బాత్ కార్యక్రమం విని చర్చించేలా కార్యక్రమాలు జరగాలి.
ఇంటింటికి వెళ్లి మన కార్యక్రమాల గురించి వివరించి, వారి మద్దతు సేకరించి వారి తలుపుకు మన స్టికర్ అంటించాలి. ప్రతీరోజూ అయిదుగురు కొత్తవారిని కలవాలి. వారికి మన పార్టీ కార్యక్రమాలు తెలపాలి.
మీకు ఒక దారి చూపుతాం ఆ మార్గంలో మీరు నడిస్తే చాలు. ఒక్క నియోజకవర్గం కూడా వదలకుండా గెలుస్తాం. మీరే కార్యక్షేత్ర యోధులు. మీ చేతుల్లోనే పార్టీ పురోగతి ఉంది. పార్టీని ఏపిలో అధికారంలోకి రావటానికి ప్రతిజ్ఞ తీసుకోవాలి’’ అని నడ్డా ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల...
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు.
మొత్తం 6,15,908 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 4,14,281 మంది పాసయ్యారని మంత్రి వెల్లడించారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారని చెప్పారు.
పదో తరగతి ఫలితాల్లో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో.. అనంతపురం జిల్లా చివరి స్థానంలో నిలిచినట్లు మంత్రి బొత్స చెప్పారు.
విద్యార్థులు తమ ఫలితాలను ఈ లింక్‌లో తెలుసుకోవచ్చు.
పదో తరగతి పరీక్షల కోసం మొత్తం 6,22,537 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. వారిలో బాలికలు 3,02,474 మంది, బాలురు 3,20,063 మంది ఉన్నారు.
ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పరీక్షలు నిర్వహించారు. మే 13 నుంచి ప్రశ్నపత్రాల మూల్యాంకనం చేపట్టారు.
కోవిడ్ మహమ్మారి కారణంగా లాక్‌డౌన్లు, ఆంక్షలు అమలులో ఉండటంతో.. రెండేళ్ల తర్వాత మొదటిసారిగా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించింది. మొదటిసారిగా విద్యార్థుల మార్కులను ప్రకటిస్తున్నారు.
ర్యాంకుల ప్రచారంపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.
10వ తరగతి ఫలితాల ముఖ్యాంశాలివీ...
మొత్తం 67.26 శాతంఉత్తీర్ణత
బాలికలేటాప్... 70.70 శాతంఉత్తీర్ణత
బాలురు 64.02 శాతంఉత్తీర్ణత
ప్రకాశంజిల్లాలోఅత్యధికంగా 78.3 శాతం ఉత్తీర్ణత
అనంతపురంలోఅత్యల్పంగా 49.70 శాతం ఉత్తీర్ణత
797 స్కూళ్లలో 100 శాతంఉతీర్ణత
ఒక్కవిద్యార్థికూడాపాస్కానిపాఠశాలలు 71
వచ్చే నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకుసప్లిమెంటరీపరీక్షలు
సప్లిమెంటరీ పరీక్షలకురేపటి నుండి ఫీజుచెల్లించవచ్చు
ఉత్తర కొరియాకు హెచ్చరికగా క్షిపణులు పేల్చిన అమెరికా, దక్షిణ కొరియా, ఫ్రాన్సెస్ మావో, బీబీసీ న్యూస్
ఉత్తర కొరియా ఆదివారం నాడు వరుసగా ఖండాంతర క్షిపణులను పేల్చింది. దీనికి ప్రతిస్పందనగా దక్షిణ కొరియా, అమెరికా దేశాలు కూడా సోమవారం నాడు ఎనిమిది క్షిపణులను పేల్చాయి.
ఉత్తర కొరియా తన క్షిపణి పరీక్షలను కొనసాగిస్తున్న నేపథ్యంలో.. ఆ దేశానికి హెచ్చరికగా అమెరికా, దక్షిణ కొరియాలు తమ క్షిపణులను పేల్చాయి.
ఉత్తర కొరియా తన తూర్పు తీరం నుంచి పలు క్షిపణులను ప్రయోగించిన కొన్ని గంటల తర్వాత.. మిత్రపక్షాలైన అమెరికా, దక్షిణ కొరియాలు.. భూతల దాడి చేసే సైనిక వ్యూహాత్మక క్షిపణులు ఎనిమిదింటిని పేల్చాయి.
అమెరికా నుంచి ఒక క్షిపణిని, దక్షిణ కొరియా నుంచి ఏడు క్షిపణులను పేల్చారు. అమెరికా ఆయుధాల సాయంతో దక్షిణ కొరియా తన బలాన్ని ప్రదర్శించటం ఈ ఎత్తుగడలో భాగంగా విశ్లేషకులు చెప్తున్నారు.
పొరుగు దేశమైన ఉత్తర కొరియా నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలకైనా తన ప్రభుత్వం కఠినంగా స్పందిస్తుందని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యేల్ పేర్కొన్నారు.
ఉత్తర కొరియా అణు కార్యక్రమం, క్షిపణి కార్యక్రమాలు కొరియా ద్వీపకల్పంలోని శాంతికి మాత్రమే కాక.. ఈశాన్య ఆసియా శాంతికి, ప్రపంచ శాంతికి ముప్పు కలిగించే స్థాయికి చేరాయని ఆయన సోల్ నగరంలో ఒక యుద్ధ సంస్మరణ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు.
అమెరికా, దక్షిణ కొరియాలు తరచుగా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తుంటాయి. వీటి పట్ల ఉత్తర కొరియా ఎప్పటికప్పుడు ఆగ్రహం వ్యక్తంచేస్తుంటుంది.
క్షమా బిందు: పెళ్లి కొడుకు లేకుండానే పెళ్లి, హనీమూన్ కూడా.. ఏంటీ సోలోగమి?
‘బీజేపీ నేతల విద్వేష ప్రసంగాలకు ఇండియా ఎందుకు క్షమాపణ చెప్పాలి మోదీజీ?’ - కేటీఆర్ ట్వీట్
‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారూ.. బీజేపీ విద్వేషకుల విద్వేష ప్రసంగాలకు గాను అంతర్జాతీయ సమాజానికి ఇండియా ఒక దేశంగా ఎందుకు క్షమాపణ చెప్పాలి?’’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు ట్విటర్ ద్వారా ప్రశ్నించారు.
బీజేపీ అధికార ప్రతినిధులు పలువురు మొహమ్మద్ ప్రవక్తను గురించి చేసిన వ్యాఖ్యలపై గల్ఫ్ దేశాలు మండిపడుతున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు.
‘‘క్షమాపణ చెప్పాల్సింది బీజేపీ. భారతదేశం కాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘మీ పార్టీ ప్రతి రోజూ విద్వేషాన్ని చిమ్ముతూ వ్యాపిస్తున్నందుకు గాను మొదట దేశంలో భారతీయులకు క్షమాపణ చెప్పాలి’’ అని ఆయన విమర్శించారు.
నూపుర్ శర్మ: మొహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలకు భారత్ క్షమాపణ చెప్పాలన్న ఖతర్.. భారత్ ఏమని బదులిచ్చిందంటే..
మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?
ఇమ్రాన్ ఖాన్‌ను ఈసారి అరెస్ట్ చేస్తాం: పాకిస్తాన్ హోంమంత్రి
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన బెయిల్ కాలపరిమితి ముగియగానే త్వరలో అరెస్ట్ చేస్తామని పాక్ హోంమంత్రి రాణా సనానుల్లా చెప్పారు.
పీటీఐ పార్టీ చేపట్టిన రెండో లాంగ్ మార్చ్‌కు ముందు.. తనను అరెస్ట్ చేసే అవకాశముందని భావించిన ఇమ్రాన్ ఖాన్ పెషావర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇమ్రాన్ ఖాన్ బెయిలును 50,000 రూపాయల పూచీకత్తు మీద మూడు వారాల పాటు పొడిగిస్తూ పెషావర్ హైకోర్టు జూన్ 2వ తేదీన ఆదేశాలిచ్చింది.
ఇమ్రాన్ ఖాన్.. హింస, అల్లర్లు, దేశద్రోహం, సాయుధ దాడులు తదితర డజనుకు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నారని రాణా సనానుల్లా ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇమ్రాన్ ఖాన్‌కు చట్టప్రకారం భద్రతను అందిస్తున్నామని, జూన్ 25వ తేదీన ఆయన బెయిల్ గడువు ముగియగానే అదే భద్రతా సిబ్బంది ఇమ్రాన్‌ను అరెస్ట్ చేస్తారని ఆయన ఆ ట్వీట్‌లో రాశారు.
మహారాష్ట్రలో కోవిడ్ నాలుగో వేవ్ మొదలై ఉండొచ్చు: ఆదిత్య ఠాక్రే
మహారాష్ట్రలో కరోనావైరస్ ఇన్ఫెక్షన్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో కోవిడ్ నాలుగో వేవ్ మొదలై ఉండవచ్చునని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యానించారు.
అయితే జనం ఆందోళన చెందవద్దని అందరూ మాస్కులు ధరిస్తూ సమయానికి కరోనావైరస్ వ్యాక్సీన్ బూస్టర్ డోసులు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
‘‘బహుశా ఇది నాలుగో వేవ్ కావచ్చు. కానీ ఐసీఎంఆర్ కావచ్చు, భారత ప్రభుత్వం కావచ్చు, మన వైద్యుడు కావచ్చు.. వారిచ్చే సూచనలను మనం పాటించాలి. అత్యంత ముఖ్యమైన విషయం భయపడకూడదు. మన ఆర్థిక పరిస్థితి బలపడుతోంది’’ అని ఆయన మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.
రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య పెరగలేదని, కాబట్టి ప్రజలకు భయం అవసరం లేదని ఠాక్రే చెప్పారు.
‘‘ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేటపుడు మాస్కులు ధరించాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం. మాస్కు ధరించటం తప్పనిసరిగా ఇంకా చేయలేదు. కానీ త్వరలో చేస్తాం. జనం గడువు లోగా బూస్టర్ డోస్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అన్నారు.
మహారాష్ట్రలో గత వారం రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత ఐదు రోజులుగా రోజుకు వెయ్యికి పైగా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఆదివారం నాడు కూడా రాష్ట్రంలో 1,494 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
మరోవైపు ఆదివారం నాడు దేశవ్యాప్తంగా 4,518 కొత్త కరోనావైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. గత ఒక్క రోజులో మరో 9 మంది కోవిడ్ వల్ల చనిపోయినట్లు చెప్పింది.
తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 24,052 నుంచి 25,782కి పెరిగినట్లు వివరించింది.