నేటి ముఖ్యాంశాలు
దేశంలో త్వరలో జనాభా నియంత్రణ చట్టం తేబోతున్నట్లు కేంద్ర ఆహార శుద్ధి మంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపారు.
రష్యాతో యుద్ధం చేస్తున్న యుక్రెయిన్‌కు సాయంగా అధునాతన రాకెట్ వ్యవస్థలను పంపించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
కోల్‌కతాలో మంగళవారం అర్ధరాత్రి హఠాత్తుగా చనిపోయిన ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కేకే (53) ఉదంతంలో పోలీసులు అసహజ మరణం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
రష్యా తమ మీద యుద్ధానికి దిగినప్పటి నుంచీ యుక్రెయిన్‌లో 15,000 కు పైగా అనుమానిత యుద్ధ నేరాల ఫిర్యాదులు వచ్చాయని యుక్రెయిన్ చీఫ్ ప్రాసిక్యూటర్ ఇరీనా వెనెడిక్టోవా చెప్పారు.
పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుండి ఈ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.
గోదారి గట్టున ల్యాప్‌టాప్‌లతో కుస్తీ.. చెట్ల కింద.. బైకుల మీద.. సిగ్నల్ కోసం పాట్లు.. కోనసీమలోని 16 మండలాల్లో ప్రస్తుత పరిస్థితి ఇది. ఇక్కడ ఇంటర్నెట్‌పై ఆంక్షలు అమలవుతున్నాయి.
భారతీయ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బుధవారం చేసిన ట్వీట్ పలు ఊహాగానాలకు దారి తీస్తోంది.ఆయన రాజకీయాల్లోకి అడుగు పెడతారేమోననే ఊహాగానాలు చేస్తున్నారు.
అవినీతి నిరోధకం కోసమంటూ ఏపీ ప్రభుత్వం కొత్త యాప్ ని ప్రవేశపెట్టింది. ‘ఏసీబీ 14400’ పేరుతో మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ యాప్ ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు.
రానున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ నగరంలో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించనుందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన ఒక మనీ లాండరింగ్ కేసులో జూన్ 8వ తేదీన విచారణకు హాజరు కావలసిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోని గురు నానక్ కాలనీలో బుధవారం తెల్లవారుజామున ఓ ఫుట్‌బాల్ ఆటగాడు హత్యకు గురయ్యాడు. గుణదల ప్రాంతంలోని కొందరు దండుగులు ఈ హత్యకు పాల్పడినట్టు పటమట పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్డేట్ల కోసం ఈ లింకును క్లిక్ చేయండి.