You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శ్రీలంక: నిరసనల నడుమ అధికార పార్టీ ఎంపీ ఆత్మహత్య
శ్రీలంకలో సోమవారం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరిగాయి. అమరకీర్తి వాహనంపైనా నిరసనకారులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అమరకీర్తి వాహనం లోపలే ఉన్నారు.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అప్‌డేట్ల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
నేటి ముఖ్యాంశాలు
ఆర్థిక సంక్షోభం నడుమ శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్ష రాజీనామా చేశారు.
నిరసనకారుల దాడి నడుమ శ్రీలంక అధికార పార్టీ ఎంపీ అమరకీర్తి అథుకోరేలా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
వికలాంగ చిన్నారిని ప్రయాణానికి అనుమతించకపోవడంపై ఇండిగో ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది.
అసాని తుపాను ప్రభావంతో ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాల్లో గాలులు, చిరు జిల్లులు మొదలయ్యాయి.
గ్యాస్ ధరల పెంపుపై ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో సీపీఎం కార్యకర్తలు నిరసనలు చేపట్టారు.
శ్రీలంకలో మంత్రులు, అధికార పార్టీ ఎంపీల ఇళ్లు ఆహుతి
ఆర్థిక సంక్షోభం నడుమ శ్రీలంకలో మంత్రులు, అధికార పార్టీ ఎంపీల ఇళ్లకు నిరసనకారులు సోమవారం నిప్పు పెట్టారు.
అధ్యక్షుడి అధికారిక నివాసానికి పరిసరాల్లోని రాజకీయ నాయకుల ఇళ్లకు నిప్పు పెట్టడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
మంత్రి రమేశ్ పథిరానా, పుట్టాలం ఎంపీ సనథ్ నిశంథ తదితరుల ఇళ్లకు నిప్పు పెట్టారు.
అధికార పార్టీకి చెందిన జాన్స్‌టన్ ఫెర్నాండో, సమన్‌లాల్ ఫెర్నాండో తదితరుల నాయకుల ఇళ్లకు కూడా నిప్పు పెట్టారు.
అగ్నిమాపక దళాలు, భద్రతా సిబ్బంది పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.
వికలాంగ చిన్నారిని ప్రయాణానికి అనుమతించకపోవడంపై ఇండిగో క్షమాపణలు
రాంచీ విమానాశ్రయంలో వికలాంగ చిన్నారిని విమానం ఎక్కకుండా అడ్డుకున్నారనే ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది.
ఈ విషయంపై ఇండిగో సీఈవో రనోజోయ్ దత్తా సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆ ఘటన విషయంలో మేం విచారం వ్యక్తం చేస్తున్నాం. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 75,000 మందికిపైగా వికలాంగ చిన్నారులను మేం ప్రయాణాలకు అనుమతించాం. వికలాంగ చిన్నారుల విషయంలో మరింత ప్రమత్తంగా ఉండాలని మా సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. అయినప్పటికీ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం విచారకరం’’అని ఆయన అన్నారు.
‘‘మేం ఆ కుటుంబాన్ని లోపలకు అనుమతించాలనే అనుకున్నాం. అయితే, అక్కడవున్న కొంతమంది ఆందోళన వ్యక్తంచేశారు. భద్రతా కారణాల దృష్ట్యా సిబ్బంది ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’అని దత్తా చెప్పారు.
‘‘ఆ చిన్నారి కోసం వారి తల్లితండ్రులు తమ జీవితాన్ని అంకితం చేశారని మాకు తెలుసు. వారికి సంఘీభావం తెలిపేందుకు ఆ చిన్నారికి ఎలక్ట్రానిక్ వీల్‌చైర్ బహుమతిగా అందిస్తాం’’అని వివరించారు.
ఈ విషయంపై వివాదం రేగడంతో కఠిన చర్యలు తీసుకుంటామని పౌర విమాన యాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హెచ్చరించారు.
శ్రీలంకలో అధికార పార్టీ ఎంపీ ఆత్మహత్య
శ్రీలంకలో అధికార ఎస్‌పీపీ పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి అథుకోరేలా సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు.
కొలంబో నగర శివార్లలోని నిట్టంబువా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
నిట్టంబువాలో సోమవారం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరిగాయి. అమరకీర్తి వాహనంపైనా నిరసనకారులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అమరకీర్తి వాహనం లోపలే ఉన్నారు.
నిరసనలు జరుగుతున్న సమయంలోనే ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
డాలర్‌తో పోలిస్తే ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో పతనమైన రూపాయి
డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం 77.50 రూపాయలకు చేరింది. రూపాయి విలువ ఇంతగా పడిపోవడం ఇదే తొలిసారి.
పవన్ కళ్యాణ్‌ని సీఎం అభ్యర్థిగా చంద్రబాబు అంగీకరిస్తారా? – సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్న, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన పార్టీల నేతలంతా పొత్తుల చుట్టూ వ్యాఖ్యలు చేస్తున్నారు. త్యాగాలకు సిద్ధం, అన్ని పార్టీలు కలిసి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే రాష్ట్రం అంధకారమవుతుందని, అందుకే ప్రజల కోసం పొత్తులుంటాయని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇచ్చేశారు. విపక్ష నేతల ప్రకటనలపై అధికార పార్టీ వైసీపీ కూడా స్పందిస్తోంది. త్యాగాలకు సిద్ధమంటున్న చంద్రబాబు తమ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ని అంగీకరిస్తారా అని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. "తనకు సీఎం పదవి వస్తే, త్యాగం చేసి పవన్‌కళ్యాణ్‌ను ఆ పదవి ఇస్తారా? ఆ విషయమైనా చెప్పాలి. లేదా చంద్రబాబుని సీఎంను చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్దంగా ఉన్నారా? అన్న విషయమయినా చెప్పాలి. లేకపోతే సోము వీర్రాజు చెప్పాలి. తమకు ఎప్పటికీ వీళ్లను మోయడమే పనా? అన్న విషయం ఆయన చెప్పాలి. ఆయన ఇప్పటికే మేము అసలు మోయం అని చెబుతున్నాడు" అని సజ్జల వ్యాఖ్యానించారు.
విపక్షాలకు వారిలో వారికే స్పష్టత లేదంటూ సజ్జల విమర్శించారు. ఒకరు త్యాగం అంటుంటే, వేరొకరు తానే సీఎం అంటారంటూ ఎద్దేవా చేశారు. మరొకరు తాము ఎవరితోనూ కలవమంటూ ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ గందరగోళంలో ఉన్నారని,. స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
2014 నుంచి చూస్తే చంద్రబాబు స్కీమ్ ప్రకారం, ఆయన కధ, మాటలు, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ ప్రకారమే పవన్ కళ్యాణ్ నడుస్తున్నారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కేవలం చంద్రబాబును తిరిగి అధికారంలో ఎలా కూర్చోబెట్టాలి అనేదే ఏకైక కార్యక్రమంగా పవన్ పెట్టుకున్నారంటూ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలను కూడా సినిమాల మాదిరిగా రీల్ రీల్ కి సీన్ మారుతుందని ఆశిస్తున్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రజలకు జవాబుదారీతనంతో సేవ చేస్తే ప్రజలే ఆశీర్వదిస్తారని జగన్ నమ్ముతున్నారంటూ సజ్జల తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్, శ్రీలంక ఆందోళనలు: అధికార పార్టీ ఎంపీ మృతి
శ్రీలంకలో ఆందోళనలు, ఘర్షణల నడుమ పార్లమెంటు సభ్యుడు ఒకరు మృతి చెందారు. మృతి చెందిన ఎంపీ అధికార పార్టీకి చెందిన అమరకీర్తి అథుకొరల అని పోలీసులు ప్రకటించారు.
రాజధాని కొలంబో శివార్లలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి.
హింసాత్మక ఘర్షణల్లో మొత్తం 79 మందికి గాయాలు అయ్యాయి. వీరికి చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
కొలంబో శివార్లలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చేపట్టిన వారికి, ప్రధాని మహింద రాజపక్స మద్దతుదారులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కొన్ని గుడారాలను రాజపక్స మద్దతుదారులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అల్లర్లు చెలరేగడంతో పోలీసులు వాటర్ గన్స్, బాష్పవాయువును ప్రయోగించారు.
బ్రేకింగ్ న్యూస్, దేశ ద్రోహ చట్టంపై సమీక్షలో యూటర్న్ తీసుకున్న కేంద్రం, సుచిత్రా మొహంతి, హిందీ కోసం..
దేశ ద్రోహ చట్టం సమీక్ష విషయంలో మోదీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది.ఈ చట్టాన్ని సమీక్షిస్తున్నామని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. కాలం చెల్లిన పాత చట్టాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
‘‘దేశద్రోహం చట్టానికి వ్యతిరేకంగా భిన్న వర్గాల నుంచి వస్తున్న స్పందనలను ప్రధాన మంత్రి పరిగణలోకి తీసుకున్నారు. ఈ చట్టం దుర్వినియోగంపైనా ఆయన దృష్టిసారించారు’’అని చెబుతూ సుప్రీం కోర్టులో కేంద్రం ప్రమాణపత్రం దాఖలుచేసింది.
ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై కేంద్రం స్పందించింది. తమ సమీక్ష పూర్తయ్యేవరకు ఈ పిటిషన్లపై విచారణ చేపట్టొద్దని కేంద్రం కోరింది.
‘‘దేశ సార్వభౌమత్వం పరిరక్షణకు మేం కట్టుబడి ఉన్నాం. అదే సమయంలో బ్రిటిష్ పాలన కాలంనాటి చట్టాలను మేం పక్కన పెట్టేయాలని నిర్ణయించాం. దీనిలో భాగంగా సీఆర్‌పీసీలోని 124ఏను (దేశద్రోహ చట్టం) కూడా సమీక్షిస్తున్నాం’’అని ప్రమాణపత్రంలో పేర్కొన్నారు.
‘‘75వ స్వాతంత్ర్య దినోత్సవానికి భారత్ సిద్ధమవుతున్న నేపథ్యంలో బ్రిటిష్ కాలంనాటి కాలం చెల్లిన చట్టాలను తొలగించాలని ప్రధాన మంత్రి భావిస్తున్నారు’’అని ప్రమాణపత్రంలో వివరించారు.
ఇదివరకు ఈ చట్టం చాలా ముఖ్యమైనదని, దీనికి సమీక్షించే ఉద్దేశంలేదని సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
మహింద రాజపక్స vs కుమార్ సంగక్కర: శ్రీలంక ప్రధానిపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్
శ్రీలంకలో భావోద్వేగాలు పెరిగిపోతున్నాయని, ప్రజలంతా నిగ్రహంతో ఉండాలని ప్రధాని మహింద రాజపక్స కోరారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. హింసకు పాల్పడితే అది మరింత హింసకు దారితీస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్నినివారించేందుకు ఆర్థిక పరిష్కారాలే అవసరమని, ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందని, ఈ సంక్షోభాన్ని నివారించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని మహింద రాజపక్స పేర్కొన్నారు.
ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కుమార్ సంగక్కర ఇలా రాశారు.. హింస చెలరేగింది మీ మద్దతు దారుల వల్లనే. ఈ గూండాలు, దోపిడీదారులు మొదట మీ కార్యాలయానికే వచ్చారు. ఆ తర్వాత శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తున్న వారిపై దాడికి దిగారు అని పేర్కొన్నారు.
ఈ ట్వీట్‌కు ముందు, తర్వాత కూడా కుమార్ సంగక్కర శ్రీలంకలో ఆందోళనలపై పలు ట్వీట్లు చేశారు.
తమ కనీస అవసరాలు, హక్కుల కోసం శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న వారిపై దోపిడీదారులు, గూండాలు దాడికి దిగారని, వీరికి ప్రభుత్వంలోని దోపిడీదారులు గూండాలు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ హింస అంతా ప్రభుత్వం మద్దతుతో జరిగిన హింసేనని, కావాలనే, ముందస్తు ప్రణాళికతో జరిపించారని పేర్కొన్నారు.
44 ఏళ్ల కుమార్ సంగక్కర శ్రీలంక క్రికెట్ జట్టు వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గామంచి ప్రదర్శన కనబర్చాడు. ఆ జట్టు కెప్టెన్‌గానూ సేవలు అందించాడు. టెస్టుల్లో 52 సెంచరీలు, 12400 పరుగులు చేసిన కుమార్ సంగక్కర వన్డేల్లో 25 సెంచరీలు, 14234 పరుగులు చేశాడు.
ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సేవలు అందిస్తున్నాడు.
బ్రేకింగ్ న్యూస్, మహింద రాజపక్స: రాజీనామా చేసిన శ్రీలంక ప్రధాన మంత్రి
శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు.
రాజీనామా లేఖను అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు పంపించారు.
గొటబాయ రాజపక్స, మహింద రాజపక్స ఇరువురూ అన్నదమ్ములు.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. దీంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి.
ప్రజలకు తినేందుకు ఆహారం కూడా లభించని పరిస్థితులు నెలకొన్నాయి. కరెంటు కోతలు ఎక్కువయ్యాయి. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు ఊహించని రీతిలో పెరిగిపోయాయి.
దీంతో చాలామంది ప్రజలు రోడ్లపైకి వచ్చి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని కొన్ని వారాలుగా నిరసన తెలుపుతున్నారు. ర్యాలీలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి రాజీనామా సమర్పించారు.
గ్యాస్ ధర పెంపు మీద సీపీఎం నిరసన
గ్యాస్ సిలీండర్ ధరలు పెరగడానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ధరలు పెంచుతూ ప్రజలపై భారం వేస్తున్నాయని విమర్శించారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. నిరసనలకు దిగిన సీపీఎం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
శ్రీలంక: రాజధాని కొలంబోలో చెలరేగిన హింస
శ్రీలంక రాజధాని కొలంబోలో హింస చెలరేగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న వారికి, ఆ దేశ ప్రధాని మహింద రాజపక్ష మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఈ ఘర్షణలో సుమారు ముగ్గురు గాయపడ్డారు.
నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న ప్రాంతానికి చేరుకున్న మహింద రాజపక్ష మద్దతుదారులు నిరసనకారుల మీద దాడులు చేశారు.
రెడ్ క్రాస్ కడుతోన్న తాత్కాలిక ఆసుపత్రిని కూడా వారు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.
చివరకు పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఈరోజుతో శ్రీలంకలో నిరసన ప్రదర్శనలకు నెల రోజులు పూర్తయ్యాయి.
శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్ష రాజీనామా చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
శ్రీలంక ఆర్థికసంక్షోభంలో చిక్కుకున్న నాటి నుంచి అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా నిరసనలు ప్రారంభమయ్యాయి.
పుతిన్: ‘పశ్చిమ దేశాల వల్లే యుక్రెయిన్ యుద్ధం’
యుక్రెయిన్‌లో యుద్ధానికి కారణం పశ్చిమ దేశాలేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
దొన్బస్ రీజియన్‌లోని రష్యా బలగాలు, వాలంటీర్లు తమ మాతృ భూమి కోసం పోరాడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
రష్యా విక్టరీ డే వేడుకల సందర్భంగా పుతిన్ ప్రసంగించారు.
రెండో ప్రపంచయుద్ధంలో నాజీ జర్మనీ మీద సోవియట్ యూనియన్ సాధించిన విజయాన్ని ప్రతి ఏటా విక్టరీ డేగా రష్యా జరుపుకుంటోంది.
తమ భూభాగం మీద దాడి చేసేందుకు పశ్చిమ దేశాలు సిద్ధమవుతున్నాయని పుతిన్ ఆరోపించారు.
రష్యాకు ముప్పు పొంచి ఉన్నందునే యుక్రెయిన్ మీద ప్రత్యేక సైనిక చర్యను చేపట్టినట్లు ఆయన తెలిపారు.
యుక్రెయిన్ యుద్ధంలో చనిపోయిన సైనికుల కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని పుతిన్ హామీ ఇచ్చారు.
మతసామరస్యాన్ని కాపాడుతామంటూ గ్రామస్థుల ప్రతిజ్ఞ
దిల్లీ: ‘అక్రమ కట్టడాల కూల్చివేతకు బుల్ డోజర్లు’
దిల్లీలోని షహీన్ బాగ్‌లోకి బుల్ డోజర్లు రావడం వివాదాస్పదంగా మారుతోంది. అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు బుల్ డోజర్లు తీసుకొచ్చామని దక్షిణ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చెబుతోంది.
స్థానిక ప్రజలు బుల్ డోజర్లకు అడ్డంగా రోడ్డు మీద కూర్చొని నిరసనలు తెలియజేస్తున్నారు.
‘బుల్ డోజర్లను అడ్డుకోవడానికి మేం వచ్చాం. అక్రమ కట్టడాలు, ఆక్రమణల గురించి మాట్లాడుతున్న ప్రభుత్వానికి 15 ఏళ్లుగా అవి కనిపించడం లేదా?’ అని ఒక సామాజిక కార్యకర్త ప్రశ్నించారు.
అయితే అక్రమ కట్టడాలను తొలగిస్తామని, ఇందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని దక్షిణ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ (సెంట్రల్ జోన్) చైర్మన్ అన్నారు.
తుగ్లకాబాద్, సంగం విహార్, షాహీన్ బాగ్‌లకు బుల్‌డోజర్లను తరలించారు.
#
ఇక్కడ ప్రతి ఆడపిల్లకూ మూడుసార్లు పెళ్లి చేస్తారు
అమెరికాలో పెరిగిన ఉద్యోగాలు... నష్టాల్లో భారత్ స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు ప్రారంభంలో భారీ నష్టాలను చవి చూడటంతో ఈరోజు మదుపర్ల సంపద సుమారు 4 లక్షల కోట్ల తగ్గింది.
సెన్సెక్స్ గత ముగింపు 54,835తో పోలిస్తే 600 పాయింట్లకు పైగా నష్టపోయి 54,188 వద్ద ఓపెన్ అయింది.
దీంతో తొలి 30 నిమిషాల్లో బీఎస్‌లోని కంపెనీల మార్కెట్ విలువ రూ.3.74 లక్షల కోట్లు తగ్గి రూ.251.14 లక్షల కోట్లకు చేరుకుంది.
నిఫ్టీ బ్యాంక్, ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఇన్‌ఫ్రా వంటి రంగాల్లో ఎక్కువగా అమ్మకాలు కనిపిస్తున్నాయి.
అమెరికాలో ఏప్రిల్ నెలలో నియామకాలు బాగా పెరిగాయి. తద్వారా కంపెనీలకు జీతాల ఖర్చు పెరిగి ఫలితంగా ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయి. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే భయాలు నెలకొన్నాయి.
ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్ల మీద కనిపించింది. మరోవైపు అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి బలహీనపడటం కూడా నేడు నష్టాలకు మరొక కారణంగా కనిపిస్తోంది.
పాకిస్తాన్: కరాచీలో ముగ్గురు చైనా పౌరుల హత్య తరువాత రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయా?