నేటి ముఖ్యాంశాలు
నల్ల సముద్రపు రేవును మూసివేయడంతో యుక్రెయిన్ నుంచి 2.5 కోట్ల టన్నుల ధాన్యపు ఎగుమతులు నిలిచిపోయినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) తెలిపింది.
రైతు సంఘర్షణపేరుతో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన వరంగల్‌లో పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రసంగించారు.తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీతో కాంగ్రెస్ ఎలాంటి పొత్తూ పెట్టుకోదని రాహుల్ గాంధీ ప్రకటించారు. తమకు అవకాశం ఇస్తే తెలంగాణ కలను నెరవేరుస్తామని, పేద ప్రజలు, రైతులకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
రైతు సంఘర్షణపేరుతో కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతు సమస్యల పై వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు.
లౌడ్ స్పీకర్ల పై అజాన్ చేయడం ప్రాథమిక హక్కుల పరిధిలోకి రాదని అలహాబాద్ హైకోర్టు శుక్రవారం పేర్కొంది.
సీనియర్ టీడీపీ నాయకుడు,మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి శుక్రవారం మరణించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఆయన ఐదు సార్లు ఎన్నికయ్యారు.
మద్యపానం చేసే మహిళల సంఖ్య ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఎక్కువగా ఉన్నట్లు 5వ జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లోని నర్సీపట్నంలో ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, రేప్ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ పెళ్లి చేసుకున్నారు. రియాస్దీన్ షేక్ మహ్మద్‌తో పోయిన ఏడాది డిసెంబరులో ఖతీజాకు ఎంగేజ్‌మెంట్ కాగా గురువారం వివాహం జరిగింది.
ఎల్‌ఐసీ ఐపీఓకు మంచి స్పందన వచ్చింది. మూడు రోజుల్లోనే అది ఫుల్‌గా సబ్‌స్క్రైబ్ అయింది. మొత్తం మీద ఇప్పటి వరకు 1.12 రెట్లు ఎక్కువ స్పందన కనిపించింది.
గుజరాత్‌లోని ముదార్దా గ్రామానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తిని గుడిలో మైకు పెట్టినందుకు కొట్టి చంపారనే వార్తలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
భక్తుల కోసం కేదార్‌నాథ్ దేవాలయాన్ని తెరచారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పూజలు చేశారు.
ఇంతటితో బీబీసీ లైవ్ ముగిస్తున్నాం.