అనకాపల్లి: ‘కాబోయే భార్య.. సర్‌ప్రైజ్ ఇస్తానంటూ గొంతు కోసింది’, లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం
విశాఖకు చెందిన రామునాయుడు అనే యువకుడు హైదరాబాద్ సీఎస్ఐఆర్ లో సైంటిస్టుగా పనిచేస్తున్నాడు. అతనికి రావికమతం మండలంలోని కొమ్మలపూడి గ్రామానికి చెందిన యువతితో నిశ్చితార్థం అయింది. వచ్చే నెల 29 న వీరికి పెళ్లి చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలో రామునాయుడు ఇటీవల హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చాడు.
“మా ఊరు ఒకసారి రావచ్చు కదా అని నాకు కాబోయే భార్య ఫోన్ చేసింది. దాంతో నేను కొమ్మలపూడి గ్రామానికి వెళ్లాను. ఇంటికి వెళ్లగానే నాతో మాట్లాడాలంటూ కొండపై ఉన్న సాయిబాబా ఆలయానికి తీసుకుని వెళ్లింది. నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను.. కళ్లు మూసుకోమని చెప్పింది. నేను కళ్లు మూసుకున్నాను. వెంటనే ఆమె చాకుతో నా గొంతు కోసింది. గొంతు కోసిన తర్వాత కూడా ఆమె అక్కడే ఉంది. రక్తం కారుతున్నా... అతి కష్టం మీద వెంటనే నేను 108కి ఫోన్ చేశాను. వాళ్లు నన్ను హాస్పిటల్ కి తీసుకుని వచ్చారు” అని రామునాయుడు చెప్పారు.
అయితే, ఆ యువతి మాత్రం తామిద్దరం బండిపై ప్రయాణిస్తూ కిందపడిపోయామని చెబుతోంది.
“మేం ఇద్దరం కొండపైకి బండిపై వెళ్లాం. అక్కడ కాసేపు ఉన్నతర్వాత వస్తుండగా...బండి మీద నుంచి పడిపోయాం. దాంతో అతనికి గాయాలయ్యాయని యువతి చెప్పింది. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ప్రస్తుతానికికైతే యువతిపై ఇంకా కేసు నమోదు చేయలేదు” అని బుచ్చయ్యపేట ఎస్సై రామకృష్ణ బీబీసీతో చెప్పారు.