You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

2024 ఎన్నికల వ్యూహంపై సోనియా గాంధీకి ప్రశాంత్ కిశోర్ ప్రెజెంటేషన్

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో పార్టీ సీనియర్ నేతలు నాలుగు గంటల పాటు సమావేశమయ్యారు. రాహుల్‌గాంధీ కూడా పాల్గొన్న ఈ భేటీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా హాజరై ప్రెజెంటేషన్ ఇచ్చారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. తమిళనాడు: ఖైదీలకు నాట్యం నేర్పుతున్న డాన్స్ టీచర్

  2. తెలంగాణ: కామారెడ్డిలో తల్లీకొడుకుల ఆత్మహత్య... మున్సిపల్ చైర్మన్ సహా ఏడుగురిపై కేసు

  3. నేటి ముఖ్య పరిణామాలివీ...

    • రష్యా సేనలు నిష్క్రమించిన తర్వాత యుక్రెయిన్ రాజధాని కీయెవ్ పరిసరాల్లో 900 మంది పౌరుల మృతదేహాలు బయటపడినట్లు కీయెవ్ పోలీస్ విభాగం అధిపతి వెల్లడించారు.
    • పంజాబ్‌లో గృహ వినియోగదారులకు జూలై 1 నుంచి 300 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు రాష్ట్రంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది.
    • యుక్రెయిన్ మీద రష్యా సైనిక దాడిలో ఇప్పటివరకూ 3,000 మంది వరకూ యుక్రెయిన్ సైనికులు చనిపోయారని ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ చెప్పారు. మరో 10,000 మంది సైనికులు గాయపడ్డారని ఆయన తెలిపారు.
    • అమెరికా, నాటో ఆయుధాలను సరఫరా చేయటం ద్వారా యుక్రెయిన్‌లో సంఘర్షణకు ఆజ్యం పోస్తున్నారని, ఇది ‘అనూహ్య పర్యవసానాలకు’ దారితీయగలదని రష్యా హెచ్చరించింది.
    • తమిళనాడులోని మదురైలో కలళగర్ ఉత్సవం సందర్భంగా జనం పోటెత్తటంతో.. గుంపులో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు ఊపిరాడక చనిపోయారని తమిళనాడు మంత్రి పి.మూర్తి చెప్పారు.
    • మోదీ ప్రభుత్వ పాలనలో ప్రజలను విభజించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు.
    • ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. 2024 ఎన్నికల వ్యూహంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సవివరమైన ప్రెజెంటేషన్ ఇచ్చారని కాంగ్రెస్ నేత కె.సి.వేణుగోపాల్ తెలిపారు.
    • బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌ను తమ దేశంలో ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. యుక్రెయిన్‌లో యుద్ధం విషయంలో బ్రిటన్ తమకు ‘శత్రుపూరిత’ వైఖరి అనుసరిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
    • ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. శనివారం లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 18 పరుగులతో ముంబైపై గెలిచింది.

    ఇవీ ఈనాటి ముఖ్య పరిణామాలు. ఇక్కడితో నేటి బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం.

    యుక్రెయిన్ మీద రష్యా యుద్ధానికి సంబంధించిన తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని ఫాలో అవండి.

  4. మత హింసకు వ్యతిరేకంగా ప్రజలంతా ఒక్కటవ్వాలన్న ప్రతిపక్ష పార్టీలు

    సమాజాన్ని విడగొట్టడానికి, విబేధాలు సృష్టించడానికి ఆహారం, దుస్తులు, నమ్మకాలు, పండగలు, భాషకు సంబంధించిన విషయాలను అధికార పక్షానికి చెందిన కొన్ని వర్గాలు ఉపయోగించుకుంటోన్న తీరు పట్ల తాము ఆందోళన చెందుతున్నామని దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు పేర్కొన్నారు.

    ఇలాంటి విషయాల్లో ప్రజలంతా సంయమనం పాటించాలనీ, శాంతి-సామరస్యాలతో జీవించాలని ఉమ్మడి లేఖ ద్వారాప్రజలను కోరారు.

    మొత్తం 13 పార్టీలకు చెందిన ప్రముఖ నేతల పేరుతో ఈ లేఖను విడుదల చేశారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ వంటి అగ్ర నాయకులు ఉన్నారు.

    మత హింసకు కారణమయ్యే వారికి కఠిన శిక్షలు విధించాలని వారు డిమాండ్ చేశారు.

    దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇటీవల చెలరేగిన మత హింసను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

    ‘‘ద్వేషాన్ని, పక్షపాతాన్ని వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియా, ఆడియో-విజువల్ ప్లాట్‌ఫార్మ్‌లను దుర్వినియోగం చేస్తోన్న తీరు మాకు బాధ కలిగిస్తోంది.

    తమ చర్యలు, ప్రసంగాలు, మాటలతో మతోన్మాదాన్ని రెచ్చగొట్టేవారికి వ్యతిరేకంగా మాట్లాడటంలో ప్రధాని మోదీ విఫలమయ్యారు. ఈ విషయంలో ఆయన మౌనంగా ఉండటం ఆశ్యర్యంగా ఉంది.

    దేశంలో వందల ఏళ్లుగా ఉన్న సామాజిక సామరస్యాన్ని పటిష్టం చేసేందుకు మేం సమష్టిగా కృషి చేస్తాం. సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోన్న విషపూరితపు ఆదర్శాలను అడ్డుకుంటాం.

    మత హింసను పెంచాలనే దుర్మార్గపు లక్ష్యంతో పనిచేస్తోన్న వారికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు శాంతి, సామరస్యాన్ని పాటించాలని కోరుతున్నాం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

  5. ముంబై ఇండియన్స్‌కు వరుసగా ఆరో ఓటమి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.

    శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 18 పరుగులతో ముంబై ఇండియన్స్‌పై గెలిచింది.

    టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది.

    కెప్టెన్ కేఎల్ రాహుల్ (60 బంతుల్లో 103; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లలో జైదేవ్ ఉనాద్కట్ 2 వికెట్లు పడగొట్టాడు.

    అనంతరం 200 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులే చేయగలిగింది.

    సూర్యకుమార్ యాదవ్ (37) టాప్ స్కోరర్. అవేశ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు.

    ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ముంబై ఇండియన్స్, పాయింట్ల పట్టికలో చివరిదైన పదో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ రౌండ్ నుంచి దాదాపు నిష్క్రమించింది.

  6. యుక్రెయిన్‌లో తాజా పరిణామాలు

    • బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో పాటు మరో 12 మంది ఇతర రాజకీయ నాయకులు తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. యుద్ధం విషయంలో బ్రిటన్ శత్రుపూరిత వైఖరి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
    • యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఐక్యరాజ్యసమితి 1,982 మంది సాధారణ పౌరులు మరణాలను నమోదు చేసింది. వాస్తవానికంటే ఈ సంఖ్య తక్కువే అని హెచ్చరించింది.
    • ఈరోజు ఉదయం కీయెవ్‌లో జరిగిన క్షిపణి దాడిలో ఒకరు మరణించగా, చాలామంది గాయాల పాలయ్యారని నగర మేయర్ విటాలీ చెప్పారు.
    • పశ్చిమ దేశాలు, యుక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేయడం కొనసాగిస్తే ‘అనూహ్య పరిణామాలు’ ఉంటాయని రష్యా హెచ్చరించింది.
    • రష్యాకు చెందిన మాస్క్వా యుద్ధనౌకను రెండు యుక్రెయిన్ నెప్ట్యూన్ క్షిపణులు ఢీకొట్టాయని అమెరికా అధికారులు చెప్పారు. నౌకలో అగ్నిప్రమాదం కారణంగా నౌక మునిగిపోయిందని రష్యా చెబుతోంది.
  7. ఇళయరాజా: నరేంద్ర మోదీని అంబేడ్కర్‌తో పోల్చినందుకు సోషల్ మీడియాలో విమర్శలు

  8. ఎలాన్ మస్క్: ట్విటర్‍ను ఎలాగైనా కొనాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు... పాయిజన్ పిల్ ఆయన కలకు గండి కొడుతుందా?

  9. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మీద రష్యా నిషేధం

    బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌ను తమ దేశంలో ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. యుక్రెయిన్‌లో యుద్ధం విషయంలో బ్రిటన్ తమకు ‘శత్రుపూరిత’ వైఖరి అనుసరిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

    బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్, మాజీ ప్రధానమంత్రి థెరెసా మే, స్కాట్లండ్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టర్జియన్‌ సహా మరో 13 మంది బ్రిటన్ ప్రభుత్వ ప్రముఖుల మీద కూడా ఈ నిషేధం విధిస్తున్నట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.

    ‘‘బ్రిటన్ ప్రభుత్వం అనూహ్యమైన శత్రుపూరిత చర్యలు చేపట్టటం.. ముఖ్యంగా రష్యా ప్రభుత్వ ముఖ్యుల మీద ఆంక్షలు విధించిన నేపథ్యంలో మేం ఈ చర్య తీసుకున్నాం. ఈ జాబితాను త్వరలో విస్తరిస్తాం’’ అని రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వివరించింది.

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురు అమెరికా ప్రభుత్వ ప్రముఖులు తమ దేశంలోకి ప్రవేశించటానికి వీల్లేదంటూ రష్యా ఇప్పటికే నిషేధం ప్రకటించింది.

  10. కామారెడ్డిలో తల్లీకొడుకుల ఆత్మహత్య.. చనిపోయేముందు సోషల్ మీడియాలో వీడియో

    తెలంగాణలోని కామారెడ్డిలో శనివారం తల్లీకొడుకుల మృతదేహాలు కాలిపోయిన స్థితిలో లభ్యం అయ్యాయి. ఈ ఘటనలో మెదక్ జిల్లా రామాయంపేట్‌కు చెందిన తల్లీకొడుకులు గంగం సంతోష్ (35), పద్మ (65) నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు కామారెడ్డి పోలీసులు చెప్పారు.

    చనిపోవటానికి ముందు మృతులు సోషల్ మీడియాలో పెట్టిన సెల్ఫీ వీడియోలో రామాయంపేట్‌కు చెందిన ఏడుగురు వ్యక్తుల వేధింపులవల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు చెప్పారు.

    ఉదయం 6 గంటల ప్రాంతంలో లాడ్జీలోని 203 నంబర్ గది నుండి పొగలు రావడంతో లాడ్జ్ సిబ్బంది పోలీస్, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

    ఈ తల్లీకొడుకులు వైద్యచికిత్స కోసం ఈ నెల 11వ తేదీన కామారెడ్డికి వచ్చినట్టు లాడ్జ్‌లోని లాగ్ బుక్‌లో వివరాలు నమోదై ఉన్నాయి.

    కామారెడ్డిలో పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాలను పోలీసులు రామాయంపేట్‌కు తరలించారు. రామాయంపేట్‌లో మృతదేహాలతో కుటుంబసభ్యులు మున్సిపల్ చైర్మన్ జితేందర్‌ గౌడ్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

    ఈ తల్లీకొడుకులు వీడియోలో ఆరోపించిన పేర్లలో రామాయంపేట్ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాప్ యాదగిరిలతో పాటు గతంలో అక్కడ సీఐగా పనిచేసిన నాగార్జునగౌడ్‌ల పేర్లు ప్రధానంగా పేర్కొన్నారు. వీరితో పాటు ఐరేని పృథ్వీరాజ్, తోట కిరణ్, కన్నాపురం కృష్ణాగౌడ్, స్వరూప్‌ల పేర్లు వీడియోలో చెప్పారు.

    చేయని తప్పుకు తన కొడుకును జితేందర్ జైలు పాలు చేశాడని, అతని సెల్‌ఫోన్ పది రోజుల పాటు ఉంచుకున్నారని, అందులోని డాటాను కాపీ చేసుకుని తరచూ వేధిస్తున్నారని, వారి కారణంగానే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామని, వారిని శిక్షించాలని పద్మ తన వీడియోలో కోరారు.

    గత 18 నెలలుగా ఏడుగురు వ్యక్తుల వల్ల తమ కుటుంబం మనశ్శాంతి కోల్పోయిందని, ఆస్తులు కోల్పోయానని, అప్పుల పాలయ్యానని మృతుడు గంగం సంతోష్ వీడియోలో ఆరోపించారు. గతంలో ఓ కేసు విషయంలో తనను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అందులోని డాటాను కాపీ చేసుకుని అప్పటి సీఐ నాగార్జునగౌడ్ మున్సిపల్ చైర్మన్ జితేందర్‌ గౌడ్‌కు ఇచ్చారని ఆ డాటా ఆధారంగా తరచూ వేధింపులకు పాల్పడుతున్నారని వీడియోలో ఆరోపించారు. ఈ విషయంలో గతంలో మెదక్ జిల్లా ఎస్పీతో పాటు పలువురు నాయకులకు ఆయన ఆర్జీ పెట్టుకున్నారు.

    మృతుల సెల్ఫీ వీడియో ఆధారంగా, వీడియోలో ఆరోపించిన ఏడుగురిపై ఐపీసీ 306 సెక్షన్ కింద కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు.

    ‘‘మృతులు ఫేస్‌బుక్‌లో పెట్టిన వీడియో ఆధారంగా ఆత్మహత్యకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్నాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో మరిన్ని వివరాలు తేలుతాయి’’ అని కామారెడ్డి డీఎస్‌పీ సోమనాథం మీడియాకు తెలిపారు.

  11. తెలంగాణ జీవరేఖ ప్రాణహిత... రాక్షస బల్లులు, పెద్ద పులులు తిరుగాడిన నదీ తీరం

  12. సోనియా గాంధీకి 2024 ఎన్నికల వ్యూహంపై ప్రశాంత్ కిశోర్ ప్రెజెంటేషన్

    ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. 2024 ఎన్నికల వ్యూహంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సవివరమైన ప్రెజెంటేషన్ ఇచ్చారని కాంగ్రెస్ నేత కె.సి.వేణుగోపాల్ తెలిపారు.

    ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంత్ కిశోర్ సమర్పించిన ఎన్నికల వ్యూహం మీద సోనియాగాంధీ ఏర్పాటు చేసిన సీనియర్ నేతల బృందం పరిశీలించి వారం రోజుల్లో పార్టీ అధ్యక్షురాలికి నివేదిక సమర్పిస్తుందని ఆయన చెప్పారు.

    ఆ తర్వాత సోనియా తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

    అంతకుముందు.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో పార్టీ సీనియర్ నేతలు సమావేశమై నాలుగు గంటల పాటు చర్చించారు.

    పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా పాల్గొన్న ఈ భేటీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా హాజరై ప్రెజెంటేషన్ ఇచ్చారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    కాంగ్రెస్ నేతలు అంబికా సోనీ, దిగ్విజయ సింగ్, మల్లిఖార్జున ఖర్గే, అజయ్ మాకెన్‌, కె.సి.వేణుగోపాల్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నట్లు చెప్పింది.

  13. కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య

    కేరళలోని పాలక్కాడ్‌లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒకరు హత్యకు గురైనట్లు పీటీఐ వార్తా సంస్థ ఒక కథనంలో తెలిపింది.

    ఆ కథనం ప్రకారం.. పాలక్కాడ్ పట్టణంలోని తన దుకాణంలో ఉన్న శ్రీనివాసన్ (45) మీద శనివారం మధ్యాహ్నం మోటార్‌సైకిల్ మీద వచ్చిన దుండగులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ ఫలితం లేకపోయింది.

    ఈ దాడి వెనుక.. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ విభాగం సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రమేయముందని బీజేపీ ఆరోపిస్తోంది.

    పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకుడు సుబేర్ (43) హత్య జరిగిన 24 గంటల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య జరగటం గమనార్హం. శుక్రవారం ప్రార్థనలు ముగించుకుని ఇంటికి తిరిగివస్తున్న సుబేర్ మీద దుండగులు దాడి చేసి హత్య చేశారు.

  14. భయోత్పాతం, వంచన, బెదిరింపులు ఈ ప్రభుత్వ వ్యూహానికి మూలస్తంభాలు: సోనియా గాంధీ

    కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు మీద కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు.

    ‘‘భయోత్పాతం, వంచన, బెదిరింపులు ఈ కుహనా ‘గరిష్ట పాలన, కనిష్ట ప్రభుత్వ’పు వ్యూహానికి మూలస్తంభాలయ్యాయి’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చర్చ, సంవాదం, మాట్లాడుకోవటం అనేవి పూర్తిగా తిరస్కరణకు గురయ్యాయని సోనియా పేర్కొన్నారు.

    ‘‘దేశం మునుపెన్నడూ ఇంతటి విద్వేషాన్ని చూడలేదు’’ అన్నారు. ‘‘విద్వేష ప్రసంగాలు ఎక్కడి నుంచి వచ్చినా సరే వాటికి వ్యతిరేకంగా విస్పష్టంగా బాహాటంగా వైఖరి తీసుకోకుండా ప్రధానమంత్రిని నిరోధిస్తున్నదేమిటి?’’ అని ఆమె ప్రశ్నించారు.

    కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ ప్రకారం.. భారతదేశం శాశ్వతంగా ప్రజాసమూహాల విభజనతో కొనసాగాలా? అని సోనియాగాంధీ ప్రశ్నించారు.

    మోదీ ప్రభుత్వ పాలనలో ప్రజలను విభజించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.

    ‘‘ఇటువంటి వాతావరణం ప్రజల ప్రయోజనం కోసమేనని దేశ పౌరులు నమ్మాలన్నది అధికారంలో ఉన్న కోరికనేది స్పష్టం’’ అని వ్యాఖ్యానించారు.

    సోనియా నివాసంలో సుదీర్ఘ భేటీ.. ప్రశాంత్ కిషోర్ ప్రెజెంటేషన్..

    ఇదిలావుంటే.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో శనివారం నాడు పార్టీ సీనియర్ నేతలు సమావేశమై నాలుగు గంటల పాటు చర్చించారు.

    పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా పాల్గొన్న ఈ భేటీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా హాజరై ప్రెజెంటేషన్ ఇచ్చారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    కాంగ్రెస్ నేతలు అంబికా సోనీ, దిగ్విజయ సింగ్, మల్లిఖార్జున ఖర్గే, అజయ్ మాకెన్‌, కె.సి.వేణుగోపాల్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నట్లు చెప్పింది.

  15. మదురై కలళగర్ ఉత్సవానికి పోటెత్తిన జనం.. ఊపిరాడక ఇద్దరు మృతి

    తమిళనాడులోని మదురైలో కలళగర్ ఉత్సవం సందర్భంగా జనం పోటెత్తటంతో.. గుంపులో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు ఊపిరాడక చనిపోయారని తమిళనాడు మంత్రి పి.మూర్తి చెప్పారు.

    జనంలో చిక్కుకున్న వారికి శ్వాస అందకపోవటంతో ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయినట్లు తెలిపారు. మరో 11 మంది కూడా ఇలా జనంలో చిక్కుకుని ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారని, వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

    చిత్తిరై పండుగలో భాగంగా కలళగర్ దేవరను వైగై నదీ ప్రవేశ ఉత్సవం శనవారం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు.

  16. యుక్రెయిన్‌లో నేటి ముఖ్య పరిణామాలివీ...

    • యుక్రెయిన్ రాజధాని కీయెవ్ నగరాన్ని శనివారం బాంబులు తాకాయని ఆ దేశాధికారులు తెలిపారు. అలాగే పశ్చిమాన గల ఎల్వీవ్ నగరంపైన కూడా బాంబుల దాడి జరిగినట్లు చెప్పారు. ఈ దాడులు ఏ ప్రాంతాలు లక్ష్యంగా జరిగాయి? ప్రాణనష్టం సంభవించిందా? అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు.
    • అమెరికా, దాని మిత్రపక్షాలు యుక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను కొనసాగిస్తే ‘అనూహ్య పర్యవసానాలు’ ఉంటాయని రష్యా అధికారికంగా హెచ్చరించింది.
    • యుక్రెయిన్ మీద రష్యా చేపట్టిన సైనిక దాడిలో ఇప్పటివరకూ 2,500 నుంచి 3,000 మంది వరకూ యుక్రెయిన్ సైనికులు చనిపోయారని, మరో 10,000 మంది సైనికులు గాయపడ్డారని ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ చెప్పారు.
    • రష్యాకు చెందిన ప్రతిష్టాత్మక మొస్క్వా యుద్ధనౌకను యుక్రెయిన్‌కు చెందిన నెప్ట్యూన్ క్షిపణులు రెండు తాకాయని, ఆ పేలుడు వల్ల మునిగిపోయిన నౌకలో కొందరు సైనిక సిబ్బంది కూడా చనిపోయారని అమెరికా అధికారులు చెప్తున్నారు. అయితే నౌకలో చెలరేగిన మంటల వల్ల తమ నౌక మునిగిపోయిందని రష్యా అంటోంది.
    • యుక్రెయిన్‌లో యుద్ధం మొదలైనప్పటి నుంచీ ఆ దేశంలో 4,633 మంది పౌరుల మరణాలు నమోదయినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. అయితే ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొంది.
  17. మొహంజోదారో ఇప్పుడెలా ఉంది

  18. పక్షులు గాయపడినా, జబ్బుపడినా ఈ కుటుంబం తట్టుకోలేదు

  19. గుజరాత్‌లో 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

    గుజరాత్‌లోని మోర్బిలో నిర్మించిన 108 అడుగుల భారీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు.

    ‘‘ఇలాంటి మహా హనుమాన్ విగ్రహాన్ని మనం కొన్నేళ్లుగా సిమ్లాలో చూస్తున్నాం. ఇప్పుడు మార్బిలో రెండో విగ్రహం ఏర్పాటైంది. రామేశ్వరం, పశ్చిమ బెంగాల్‌లలో కూడా ఇలాంటి మరో రెండు విగ్రహాలు ఏర్పాటవుతాయని నాకు చెప్పారు’’ అని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

    ‘హనుమాన్ చార్ ధామ్’ ప్రాజెక్టులో భాగంగా భారతదేశంలో నలుదిక్కులా ఏర్పాటు చేయతలపెట్టిన నాలుగు హనుమాన్ విగ్రహాల్లో రెండో విగ్రహాన్ని పశ్చిమాన మోర్బిలో నెలకొల్పారు.

    మొదటి విగ్రహాన్ని ఉత్తరాన హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో 2010లో ఆవిష్కరించారు.

    మూడో విగ్రహాన్ని దక్షిణాన రామేశ్వరంలో స్థాపించే పనులు మొదలయ్యాయని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

  20. గురజాలలో మహిళపై సామూహిక అత్యాచారం?

    ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా గురజాలలో ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు.

    గురజాల టౌన్ రైల్వే స్టేషన్ అయిన గురజాల గేట్ హాల్ట్ వద్ద నుంచి మహిళను అపహరించి అత్యాచారం చేసినట్టు అనుమానిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, కేసు దర్యాప్తు సాగుతోందని పోలీసులు చెప్పారు.

    శనివారం బాధితురాలిని స్థానికులు కొందరు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలు ఒడిశాకు చెందిన 30 సంవత్సరాల మహిళగా చెబుతున్నారు. ఆమెతో పాటుగా మూడేళ్ల బాబు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

    నలుగురు దుండగులు ఈ నేరానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. శుక్రవారం రాత్రి స్టేషన్‌లో రైలు కోసం వేచి చూస్తున్న సమయంలో బలవంతంగా లాక్కెళ్లి సమీపంలోని తుప్పల్లో ఈ దురాగతానికి పాల్పడినట్టుగా భావిస్తున్నారు.

    తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఘటనాస్థలంలోనే బాధితురాలు స్పృహతప్పి పడి ఉండడం, సమీపంలో పడివున్న చిరిగిన దుస్తులు, మద్యం సీసాలను కూడా పోలీసులు గుర్తించారు.

    గురజాలలో ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు వేగంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.