You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

పాకిస్తాన్: మంత్రివర్గంతో ఇమ్రాన్ ఖాన్ అత్యవసర సమావేశం, అర్ధరాత్రి దాటిన తరువాత అవిశ్వాసంపై ఓటింగ్?

పాకిస్తాన్ ప్రతిపక్ష నాయకురాలు మరియం నవాజ్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మీద మరోసారి నిప్పులుకక్కారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఇమ్రాన్ ధిక్కరించారని, అది దుష్పరిణామాలకు దారితీస్తుందని ఆమె హెచ్చరించారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. ‘రష్యాపై భారీ యుద్ధానికి యుక్రెయిన్ సిద్ధంగా ఉంది’

  2. పాకిస్తాన్: ప్రధాని పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్

  3. నేటి ముఖ్య పరిణామాలు

    • పాకిస్తాన్ పార్లమెంట్‌లో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శనివారం అర్ధరాత్రి 12 గంటలకు ఓటింగ్ జరిగే అవకాశమున్నట్లు పార్లమెంట్ సెక్రటేరియట్ వర్గాలను ఉటంకిస్తూ పాకిస్తాన్ మీడియా జియో న్యూస్ పేర్కొంది.
    • యుక్రెయిన్ ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు బ్రిటన్ ప్రధాని కీయెవ్‌కు వెళ్లి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీని వ్యక్తిగతంగా కలుసుకున్నారు.
    • ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
    • కరోనా మహమ్మారి మీద పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సీన్ బూస్టర్ డోస్ ఇవ్వటాన్ని ప్రారంభించటానికి ఒక రోజు ముందు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిషీల్డ్, కోవాక్జిన్ వ్యాక్సీన్ డోసుల ధరలను రూ. రూ. 225కు తగ్గించారు.
    • శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రమైపోయిన పరిస్థితుల్లో దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స గద్దె దిగాలని.. ఆయన స్వయంగా వైదొలగకపోతే ఆయనను అభిశంసించాలని, ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపక్ష నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) ఎంపీ విజిత హెరాత్ డిమాండ్ చేశారు.
    • సిరియాలో యుద్ధ కార్యకలాపాల్లో విస్తృత అనుభవమున్న కొత్త జనరల్‌ అలెగ్జాండర్ ద్వోర్నికోవ్‌ను యుక్రెయిన్‌లో యుద్ధ కార్యక్రమాలకు ఇన్‌చార్జిగా రష్యా నియమించినట్లు పశ్చిమ దేశాల నాయకులు ధ్రువీకరించారు.

    ఇవి ఇప్పటివరకూ ఉన్న ముఖ్యాంశాలు. నేటి లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

    యుక్రెయిన్ యుద్ధంపై తాజా పరిణామాలనుబీబీసీ న్యూస్ లైవ్ పేజీద్వారా తెలుసుకోవచ్చు.

  4. శశి థరూర్ పార్లమెంటులో చూసిన చూపు ఎందుకు వైరల్ అయింది... దానికి ఆయన ఏమన్నారు?

  5. తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు వేగంగా అంతరించిపోతోందా?

  6. పాకిస్తాన్: రాత్రి 12 గంటలకు ఓటింగ్ నిర్వహించే అవకాశం

    పాకిస్తాన్ పార్లమెంట్‌లో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శనివారం అర్ధరాత్రి 12 గంటలకు ఓటింగ్ జరిగే అవకాశమున్నట్లు పార్లమెంట్ సెక్రటేరియట్ వర్గాలను ఉటంకిస్తూ పాకిస్తాన్ మీడియా జియో న్యూస్ పేర్కొంది. ఈ విషయాన్ని వార్తా సంస్థ ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది.

    దీనికంటే ముందు రాత్రి 9 గంటలకు పాకిస్తాన్ మంత్రివర్గ అత్యవసర సమావేశం జరగనుంది. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ సమావేశానికి పిలుపునిచ్చారు.

  7. బ్రేకింగ్ న్యూస్, కీయెవ్‌లో యూకే ప్రధాని, జెలియెన్‌స్కీని వ్యక్తిగతంగా కలిసిన బోరిస్ జాన్సన్

    యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ శనివారం మధ్యాహ్నం కీయెవ్‌లో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీతో సమావేశమయ్యారు.

    వీరిద్దరూ మాట్లాడుకుంటోన్న ఫొటోను లండన్‌లోని యుక్రెయిన్ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. డౌనింగ్ స్ట్రీట్ కూడా దీన్ని ధ్రువీకరించింది.

    ‘‘యుక్రెయిన్ ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు బ్రిటన్ ప్రధాని కీయెవ్‌కు వెళ్లి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీని వ్యక్తిగతంగా కలుసుకున్నారు. వారు యుక్రెయిన్‌కు దీర్ఘకాలిక మద్దతు గురించి చర్చిస్తారు. దీనితో పాటు యుక్రెయిన్‌కు నూతన సైనిక, ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తారు’’ అని ఆ ప్రాంత అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

  8. చెన్నైపై 8 వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు

    ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

    ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు చేసింది.

    మొయిన్ అలీ (35 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, వాషింగ్టన్ సుందర్ చెరో 2 వికెట్లు తీయగా... భువనేశ్వర్ కుమార్, మర్కో జాన్సెన్, ఎయిడెన్ మార్క్‌రమ్ తలా ఓ వికెట్ తీశారు.

    అనంతరం 155 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 17.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (50 బంతుల్లో 75; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (32), రాహుల్ త్రిపాఠి (39 నాటౌట్) రాణించారు.

    ముకేశ్ చౌధరీ, డ్వేన్ బ్రావో చెరో వికెట్ తీశారు.

  9. అత్యవసర మంత్రివర్గ సమావేశానికి పిలుపునిచ్చిన ఇమ్రాన్ ఖాన్

    పాకిస్తాన్ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పరిశీలనలో ఉన్న సమయంలో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అత్యవసర మంత్రివర్గ సమావేశానికి పిలుపు ఇచ్చినట్లు పాకిస్తాన్ మీడియా తెలిపిందని ఏఎన్‌ఐ పేర్కొంది

    శనివారం రాత్రి 9 గంటలకు ప్రధానమంత్రి నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

  10. పాకిస్తాన్-ఇమ్రాన్ ఖాన్: అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఎందుకు వాయిదా పడింది

  11. పాకిస్తాన్: ‘ఈ రోజు రాత్రి 8 గంటల తర్వాత అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్’

    పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం మీద శనివారం రాత్రి 8 గంటల తర్వాత ఓటింగ్ జరగవచ్చునని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

    విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి మాట్లాడుతుండగా.. అవిశ్వాస తీర్మానాన్ని వెంటనే చేపట్టాలని పట్టుపడుతూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండటంతో పార్లమెంటు సమావేశాన్ని వాయిదా వేసినట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి.

  12. బూస్టర్‌కి బూస్ట్: కోవిషీల్డ్, కోవాక్జిన్ డోసుల ధర రూ. 225కి తగ్గింపు

    కరోనా మహమ్మారి మీద పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సీన్ బూస్టర్ డోస్ ఇవ్వటాన్ని ప్రారంభించటానికి ఒక రోజు ముందు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిషీల్డ్, కోవాక్జిన్ వ్యాక్సీన్ డోసుల ధరలను రూ. రూ. 225కు తగ్గించారు.

    కోవిషీల్డ్ ధర రూ. 600 నుంచి రూ. 225కు తగ్గించగా, కోవాగ్జిన్ ధరను రూ. 1200 నుంచి రూ. 225కు తగ్గించారు.

    సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదార్ పూనావాలా, భారత్ బయోటెక్ సహవ్యవస్థాపకురాలు సుచిత్రా ఎల్లాశనివారం ట్విటర్‌లో ఈ విషయాన్ని ప్రకటించినట్లు ఎన్‌డీటీవీ ఒక కథనంలో తెలిపింది.

    కోవిషీల్డ్ బూస్టర్ డోసు ధర కూడా ఇంతకుముందు లాగానే రూ. 600 ఉంటుందని సీఐఐ శుక్రవారం నాడు చెప్పింది. అయితే.. శనివారం భారత ప్రభుత్వంతో చర్చించిన అనంతరం వ్యాక్సీన్ డోసు ధరను రూ. 225కు తగ్గించాలని నిర్ణయించినట్లు ఆదార్ పూనావాలా తన ట్వీట్‌లో వివరించారు.

    దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ముందుజాగ్రత్తగా బూస్టర్ డోస్‌ను అందుబాటులోకి తేవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము అభినందిస్తున్నట్లు చెప్పారు.

  13. ‘దేశం మొత్తాన్నీ ఒక వ్యక్తి చెరబట్టారు’ - ఇమ్రాన్ ఖాన్ మీద మరియం నవాజ్ ఆగ్రహం

    పాకిస్తాన్ ప్రతిపక్ష నాయకురాలు మరియం నవాజ్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మీద మరోసారి నిప్పులుకక్కారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఇమ్రాన్ ధిక్కరించారని, అది దుష్పరిణామాలకు దారితీస్తుందని ఆమె హెచ్చరించారు.

    ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తనపై అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవటానికి భయపడుతున్నారని, దేశ వ్యవస్థనంతటినీ కుప్పకూల్చారని ఆమె మండిపడ్డారు.

    ఆమె శనివారం తాజా ట్వీట్‌లో.. 22 కోట్ల మంది జనాభా ఉన్న దేశం కొన్ని వారాలుగా ప్రభుత్వం లేకుండా సాగుతోందని పేర్కొన్నారు.

    ఇమ్రాన్ ఖాన్‌ను ప్రధానమంత్రిగా కానీ, మాజీ ప్రధానమంత్రిగా కానీ పరిగణించరాదని, తనను తాను కాపాడుకోవటానికి దేశం మొత్తాన్నీ చెరబట్టిన ఉన్మాదిగా పరిగణించాలని మరియం వ్యాఖ్యానించారు.

    మతి స్థిమితం లేని ఒక వ్యక్తి దేశమంతటినీ దిగజార్చటానికి అనుమతించరాదన్నారు.

  14. కోవిషీల్డ్ ధర రూ. 600 నుంచి రూ. 225కు తగ్గింపు

    కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను సవరించినట్లు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) శనివారం ప్రకటించింది.

    కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రైవేటు ఆసుపత్రులకు ఇచ్చే కోవిషీల్డ్ ఒక డోసు ధరను రూ. 600 నుంచి రూ. 225కు తగ్గించినట్లు సీఐఐ చైర్మన్ ఆదార్ పూనావాలా ట్వీట్‌లో తెలిపారు.

  15. సెమీస్‌లో కిడాంబి శ్రీకాంత్ ఓటమి

    కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్‌లో ఓటమి పాలయ్యారు.

    శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ఐదో సీడ్ శ్రీకాంత్ 19-21, 16-21తో మూడో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు.

    పురుషుల విభాగంలో వెంగ్ హాంగ్ యాంగ్, క్రిస్టీ ఫైనల్‌కు చేరుకున్నారు.

  16. అవిశ్వాసంపై ఈరోజు ఓటింగ్ ఉంటుందో లేదో నాకు తెలియదు: పీటీఐ నేత మలైకా బుఖారీ

    పార్లమెంట్ వాయిదా పడటానికి గల కారణాన్ని పీటీఐ నేత మలైకా బుఖారి చెప్పారు. సభకు విరామం ఇవ్వాలని స్పీకర్ అనుకోవడం వల్లే వాయిదా పడిందని తెలిపారు.

    అవిశ్వాసంపై ఓటింగ్‌ను అడ్డుకునేందుకు ఇదో ఎత్తుగడ అనే ఆరోపణల్ని ఆమె ఖండించారు.

    ఈరోజు అవిశ్వాసంపై ఓటింగ్ జరుగుతుందా? లేదా అనే సంగతి తనకు తెలియదని అన్నారు. అయితే, అవిశ్వాసంపై ఓటింగ్ మాత్రం తప్పకుండా జరుగుతుందని చెప్పారు.

    ‘‘పార్లమెంట్‌లో అందరూ వరుసగా ఉపన్యసించాల్సి ఉంది. అందులో భాగంగానే మొదట ప్రతిపక్ష నేత ప్రసంగించారు. ఆ తర్వాత షా మహమూద్ ఖురేషీ ప్రసంగం సందర్భంగా సభ వాతావరణం వేడెక్కింది. దీంతో బ్రేక్ ఇచ్చారు. మళ్లీ షా మహమూద్ ఖురేషీ ప్రసంగంతోనే సభ ప్రారంభం అవుతుంది’’ అని ఆమె వివరించారు.

    ‘‘మేం కోర్టును గౌరవిస్తాం. రాజ్యాంగం, చట్ట ప్రకారమే నడుచుకుంటాం. కోర్టు తీర్పు మాకు నిరాశ కలిగించినప్పటికీ మేం దాన్ని పాటిస్తాం’’ అని ఆమె చెప్పారు.

  17. మాకు 176 మంది సభ్యుల మద్దతుంది – పీఎంఎల్ఎన్

    పాకిస్తాన్ పార్లమెంటులో తమకు 176 మంది సభ్యుల మద్దతుందని ప్రధాన ప్రతిపక్షమైన పీఎంఎల్-ఎన్ నాయకురాలు మరియమ్ ఔరంగజేబ్ చెప్పారు.

    తమ పార్టీకి చెందిన 84 మంది సభ్యులతోపాటు తమకు మద్దతు ఇస్తున్న ఎంపీల జాబితాను ఆమె ట్వీట్ చేశారు.

    342 మంది సభ్యులున్న నేషనల్ అసెంబ్లీలోఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 172 మంది ఎంపీల మద్దతు అవసరం.

  18. శ్రీలంక: కొలంబోలో నిరసన తెలపటానికి తరలివస్తున్న యువత

    శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అంతకంతకూ విషమిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మీద నిరసన తెలపటానికి దేశం నలుమూలల నుంచీ యువత కొలంబోలోని గాలే ఫేస్ వద్దకు చేరుకున్నారు.

    ఇప్పటికే దాదాపు 5,000 మంది ఇక్కడికి చేరుకోగా ఇంకా వస్తున్న వారితో నిరసనకారుల సంఖ్య మరింతగా పెరుగుతోంది.

  19. ఇండియన్ స్టాండర్డ్ టైమ్: ఈశాన్య రాష్ట్రాలు రెండో టైమ్ జోన్ కావాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి

  20. ఆంధ్రప్రదేశ్: కొత్త మంత్రుల ప్రమాణానికి సిద్ధమవుతున్న వేదిక

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి వేదిక సిద్ధమవుతోంది.

    ఏపీ అసెంబ్లీ పక్కనే ఉన్న ప్రాంతంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

    ఈ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై సీఎస్ సమీక్షలు నిర్వహించారు.

    ఈ నెల 11వ తేది ఉదయం 11.31నిమిషాలకు కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

    కొత్త మంత్రుల పేర్లను ఈ రోజు సాయంత్రానికి ప్రకటించనున్నట్లు వార్తలు వచ్చాయి.