యుక్రెయిన్‌పై రష్యా దాడి: ఇప్పటి వరకు ఏం జరిగింది?
యుక్రెయిన్‌లో గందరగోళమైన, వేగంగా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటివరకు అక్కడ ఏం జరిగిందో చూద్దాం.
యుక్రెయిన్‌పై రష్యా భారీ సైనిక చర్యకు దిగింది. మూడువైపుల నుంచి యుక్రెయిన్‌పై దాడులు చేసింది. ప్రధాన నగరాల్లో బాంబు దాడులు, క్షిపణి దాడులు చేసింది.
యుక్రెయిన్ రాజధాని కీవ్‌లో రోజంతా పేలుళ్ల శబ్ధాలు, వైమానిక దాడుల సైరన్ శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. రష్యా బలగాలు కీవ్ నగరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయని బీబీసీ ప్రతినిధి చెప్పారు. రష్యా దాడులను తిప్పికొడుతున్నామని యుక్రెయిన్ చెబుతోంది. ఆరు రష్యా విమానాలను కూల్చేశామని అంటోంది.
యుక్రెయిన్‌లోని అనేక ప్రాంతాల్లో దాడులు జరిగాయి. క్రిమియా నుంచి రష్యా సైనిక బలగాలు యుక్రెయిన్‌లోకి ప్రవేశించాయని యుక్రెయిన్ బోర్డర్ గార్డ్స్ వెల్లడించింది.
యుక్రెయిన్‌పై సైనిక చర్య మినహా మరో మార్గం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని యుక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించారు. రష్యా చెర్నోబిల్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇది యూరప్‌పై యుద్ధం ప్రకటించడమేనని అన్నారు.
రష్యా సైనిక చర్యను యూరప్ దేశాలు ఖండించాయి.
యుక్రెయిన్ నుంచి పారిపోయి పొరుగున ఉన్న దేశాల్లో తలదాచుకునేందుకు స్థానిక ప్రజలు ప్రయత్నిస్తున్నారు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్‌డేట్స్. యుక్రెయిన్‌పై రష్యా దాడులకు సంబంధించిన తాజా సమాచారం బీబీసీ న్యూస్ లైవ్‌పేజీలో చూడొచ్చు. ధన్యవాదాలు