You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

రేపు బీహార్‌కు కేసీఆర్ పయనం.. నితీష్‌కుమార్‌తో విందు సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం నాడు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను కలువనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

లైవ్ కవరేజీ

  1. ‘ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్‌’: పాతికేళ్ల సాయిప్రణీత్ సొంతంగా వాతావరణ సమాచారం ఎలా ఇస్తున్నారు?

  2. నేటి లైవ్ పేజీ ముగిస్తున్నాం

    ఇక్కడితో బీబీసీ తెలుగు న్యూస్ లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    మళ్లీ తాజా అప్‌డేట్లతో రేపు ఉదయం కలుద్దాం.

    ధన్యవాదాలు!

  3. రేపు బీహార్‌కు కేసీఆర్ పయనం.. నితీష్‌కుమార్‌తో విందు సమావేశం

    తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం నాడు (ఈ నెల 31న) బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను కలువనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

    ఆయన బుధవారం ఉదయం హైదరాబాద్ నుండి పాట్నా బయలుదేరి వెళ్లనున్నట్లు చెప్పింది.

    కేసీఆర్ గతంలో ప్రకటించిన మేరకు.. గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు బీహార్‌కు చెందిన భారత సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తారని సీఎంఓ తెలిపింది.

    ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు కూడా సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందిస్తారని చెప్పింది.

    బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌తో కలిసి సీఎం కేసీఆర్ ఈ చెక్కులను పంపిణీ చేయనున్నట్లు వివరించింది.

    అనంతరం.. నితీష్ ఆహ్వానం మేరకు బుధవారం మధ్యాహ్నం విందు సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారని, ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చిస్తారని చెప్పింది.

  4. LGBTQ: ‘అద్దెకు ఇల్లు ఇవ్వట్లేదు, నన్ను చంపేయండి.. ఎప్పుడు, ఎక్కడ చంపుతారో చెబితే టైమ్‌కి వచ్చేస్తా’

  5. ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్ : ఈ యువకుడు వాతావరణ సమాచారాన్ని ఎలా ఇస్తున్నారు?

  6. కాకినాడలో మరో ప్రమాదం, ఇద్దరు కార్మికులు మృతి, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం

    ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా కేంద్రానికి సమీపంలోని వాకలపూడిలో మరో ప్రమాదం జరిగింది.

    15 రోజుల వ్యవధిలోనే ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ లో రెండో ప్రమాదం జరిగింది.

    ఆగష్టు 12న జరిగిన ప్రమాదంలో ఇదే పరిశ్రమకు చెందిన ఇద్దరు కార్మికులు మరణించారు.

    సోమవారం జరిగిన తాజా ప్రమాదంలో మరో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

    మరణించిన వారిని సుబ్రహ్మణ్యం, ప్రసాద్ గా గుర్తించారు. వారితో పాటు మరో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. వారికి వైద్యం అందిస్తున్నారు.

    గొల్లప్రోలుకి చెందిన రాగం ప్రసాద్ , కే గంగవరం గ్రామానికి చెందిన పేరూరి సుబ్రహ్మణ్యం మృతదేహాలను కాకినాడ జీజీహెచ్ కి తరలించారు.

    పరిశ్రమలో పనిచేస్తున్న సమయంలో సీ పాన్ మీద పడి ఈ ఇద్దరూ మరణించినట్టు కాకినాడ సర్పవరం పోలీసులు ప్రకటించారు.

    ప్రమాదానికి పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

    ఆగష్టు రెండో వారంలో ప్రమాదం జరిగిన సమయంలో ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ప్రకటించింది. స్వయంగా కలెక్టర్ సహా ఇతర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పరిశ్రమను పరిశీలించాలి. భద్రతా ఏర్పాట్ల మీద కార్మికుల నుంచి వస్తున్న ఆందోళనలు పరిగణలోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

    కానీ అంతలోనే మరోసారి ప్రమాదం జరగడంతో పరిశ్రమలో పనిచేస్తున్న వారికి తగిన రక్షణ లేదనే అభిప్రాయం కార్మిక సంఘాల నాయకులు వినిపిస్తున్నారు.

    మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించడంలో విఫలమయిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వివిధ సంఘాలకు చెందిన కార్మిక నాయకులు పరిశ్రమ వద్ద ఆందోళనకు దిగారు.

  7. Artemis: సాంకేతిక లోపంతో నిలిచిపోయిన చంద్రుడిపైకి నాసా రాకెట్ ప్రయోగం

    చంద్రుడిపైకి నాసా ప్రయోగిస్తున్న రాకెట్ ఆర్టెమిస్ 1 ప్రయోగం తాత్కాలికంగా వాయిదా పడింది.

    భారతకాలమానం ప్రకారం ఆగస్ట్ 29 సాయంత్రం 6గంటల 3 నిమిషాలకు నింగిలోకి ప్రయాణించాల్సి ఉంది.

    కానీ లాంఛింగ్ సమయానికి 40 నిమిషాల ముందు కౌంట్ డౌన్ నిలిపేశారు.

    ఆర్టెమిస్ 1 ఎస్ఎల్ఎస్ రాకెట్‌లోని మూడో ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు గుర్తించారు.

    దీంతో లాంఛింగ్ చేయ్యాల్సిన సమయం వరకూ నాసా సిబ్బంది లోపాన్ని సరి చేసేందుకు ప్రయత్నించారు.

    కానీ ఇంజిన్‌లో సమస్య అలాగే ఉండటంతో.. ప్రస్తుతానికి ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు నాసా ప్రకటించింది.

    తమ బృందాలు సమాచారాన్ని సేకరిస్తున్నాయని, తదుపరి లాంఛింగ్ డేట్ ఎప్పుడన్నది త్వరలోనే ప్రకటిస్తామని నాసా ట్విట్టర్లో ప్రకటించింది.

  8. ‘ఎప్పటికీ తండ్రిని కాకూడదు అనుకుని, ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిన ఓ భర్త కథ’

  9. విజయవాడ ఎయిర్‌పోర్టు: విమానం చార్జీ కన్నా క్యాబ్ చార్జీలు ఎందుకు ఎక్కువ? ఓలా, ఊబర్ ట్యాక్సీలను ఎందుకు అనుమతించట్లేదు?

  10. పాకిస్తాన్ వరదలు: ‘మాకు సరుకులు, మందులు కావాలి’.. సహాయం కోసం బీబీసీ బృందానికి నోట్ విసిరిన బాధితులు

  11. జియో 5జీ: దీపావళి నాటికి 5జీ ప్రారంభిస్తాం.. 2023 నాటికి దేశమంతా అందిస్తాం: ముకేష్ అంబానీ

    ఈ ఏడాది దీపావళి కల్లా దేశంలో జియో హైస్పీడ్ 5జీ టెలికాం సేవలు ప్రారంభిస్తామని రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ప్రకటించారు.

    తొలుత దిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన నగారాల్లో 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెస్తామని.. ఆ తర్వాత 2023 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి పట్టణం, తాలూకా, మండలాలకు విస్తరిస్తామని ఆయన చెప్పారు.

    ముకేష్ అంబానీ సోమవారం ముంబైలో.. రిలయన్స్ షేర్ హోల్డర్ల వార్షిక సర్వసభ్య సమావేశంలో మెటావర్స్ టెక్నాలజీ ద్వారా ప్రసంగించారు.

    దేశంలో 5జీ మౌలికసదుపాయాల కోసం జియో 2,00,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తుందని చెప్పారు. స్టాండలోన్ 5జీ అని పిలిచే అత్యాధునిక 5జీ టెక్నాలజీని కూడా జియో వినియోగిస్తుందన్నారు.

    మొబైల్ నెట్‌వర్క్‌లో ఐదో తరం నెట్‌వర్క్‌ను 5జీ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో భారీ మొత్తంలో డాటాను అత్యంత వేగంతో ప్రసారం చేయవచ్చు.

    భారతదేశంలో 5జీ స్పెక్ట్రమ్ వేలం బిడ్డింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది.

    ఇటీవల భారత టెలికమ్యూనికేషన్ల విభాగం నిర్వహించిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో.. 700 మెగాహెర్ట్జ్, 800 మెగాహెర్ట్జ్, 1800 మెగాహెర్ట్జ్, 3300 మెగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌ల స్పెక్ట్రమన్‌ను రిలయన్స్ జియో సొంతం చేసుకుంది.

    రిలయన్స్ జియోతో పాటు అదానీ గ్రూప్, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ఈ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొన్నాయి.

  12. తెలుగు: భాష‌ ఒకటే.. మాండలికాల సొగసులు అనేకం

  13. కెనడాలో ఒక వీధికి సంగీత దర్శకుడు రెహ్మాన్ పేరు

    ప్రముఖ సంగీత దర్శకుడు రెహ్మాన్ కు కెనడాలో ప్రత్యేక గౌరవం దక్కింది.

    కెనడాలోని మర్ఖం నగరంలో ఒక వీధికి రెహ్మాన్ పేరును పెట్టి ఆయన పై అభిమానాన్ని చాటుకున్నారు.

    ఈ సందర్భంగా ఆయన కెనడా అధికారులకు, ప్రజలకు, తన తోటి కళాకారులకు కృతజ్ఞతలు చెబుతూ ఒక లేఖను విడుదల చేశారు.

    ఈ లేఖను ఆయన ట్వీట్ చేశారు.

    "నేను జీవితంలో ఇలాంటి గౌరవాన్ని ఎన్నడూ ఊహించలేదు. రెహ్మాన్ అనే పేరు నాది కాదు. రెహ్మాన్ అంటే దయగల వారని అర్ధం. ఇది మన అందరిలో సామాన్యంగా ఉండాల్సిన లక్షణం. ఈ పేరు కెనడాలో ప్రజలందరికీ శాంతిని, సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అని రాశారు.

    తోటి భారతీయులకు,ఆయనతో పని చేసిన కళాకారులకు, జీవితంలో ఎదిగేందుకు స్ఫూర్తి నిచ్చినవారికి, వందేళ్ల సినిమాకు కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. "ఒక మహాసముద్రంలో నేనొక నీటి బొట్టు వంటి వాడిని" అని అన్నారు.

    "ఈ గౌరవం నా బాధ్యతలను మరింత పెంచుతోంది. అలిసిపోయి, పని నుంచి తప్పించుకోవద్దని చెబుతోంది. నేను అలిసిపోయినా కూడా చేయాల్సిన పనులు, కలవాల్సిన మనుషులు, దాటాల్సిన వారధులు చాలా ఉన్నాయని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను" అని అంటూ లేఖను ముగించారు.

  14. విద్యాలయాల్లో హిజాబ్ నిషేధం పై కర్ణాటక ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలని కోరిన సుప్రీం కోర్టు

    కర్ణాటకలో విద్యా సంస్థలు హిజాబ్ ధరించి కాలేజీలకు రావడం పై నిషేధాన్ని విధించింది. హిజాబ్ ముస్లిం మతంలో భాగం కాదని అంటూ విద్యాసంస్థలు విధించిన నిషేధాన్ని కర్ణాటక హై కోర్టు సమర్ధించింది.

    దీంతో, విద్యార్థులు కోర్టుకు వెళ్లారు.

    కర్ణాటక హై కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో పాటు పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్ నమోదు చేశారు.

    సుప్రీం కోర్టు ద్విసభ్య బెంచ్ సోమవారం కేసు విచారణ చేపట్టింది.

    ఈ అంశం పై కర్ణాటక ప్రభుత్వాన్ని సమాధానం చెప్పమని సుప్రీం కోర్టు కోరింది.

    ఈ అంశం పై విచారణను వాయిదా వేయమని కొంత మంది పిటిషనర్లు సుప్రీం కోర్టును కోరారు.

    "గతంలో ఈ అంశాన్ని తక్షణమే విచారణ చేయాలని కోరారు, ఇప్పుడు వాయిదా వేయమంటున్నారు. ఈ అభ్యర్థనలను మేము అనుమతించం" అని సుప్రీం కోర్టు పేర్కొంది.

    ఈ కేసు విచారణను సెప్టెంబరు 05కు వాయిదా వేసింది.

    కర్ణాటకలోని ఉడుపిలో హిజాబ్ వివాదం మొదలయింది. తర్వాత దీని ప్రభావం కర్ణాటకలోకి చాలా కాలేజీల పై పడింది. ఈ అంశం చాలా చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకునేందుకు కూడా దారి తీసింది.

    విద్యార్థులు కర్ణాటక హై కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ లో హిజాబ్ ధరించి విద్యాలయాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  15. పాకిస్తాన్ మనూర్ వ్యాలీలో వరద తాకిడి- 15 మంది మృతి, భవనాలు, వంతెనలు ధ్వంసం

    పాకిస్తాన్ పర్యటక ప్రాంతం మనూర్ వ్యాలీలో వరదలు ముంచెత్తాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో ఉన్న మనూర్ లోయ దగ్గరున్న నదీ తీరంలో కొన్ని వందల మంది చిక్కుకుపోయారు.

    వరదల్లో కనీసం 10 వంతెనలు, కొన్ని డజన్ల భవనాలు దెబ్బ తిన్నాయి.

    "మాకు సరుకులు కావాలి. మందులు కావాలి. ఈ వంతెనను నిర్మించండి. మా దగ్గర ఏమి మిగలలేదు" అని అంటూ వరదలను కవర్ చేసేందుకు వెళ్లిన బీబీసీ బృందానికి వంతెన అవతలి వైపు నుంచి చేతి రాతతో రాసిన నోట్ విసిరారు.

    మనూర్ వ్యాలీ కాఘన్ పర్వతాల పై నెలకొని ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఏర్పడిన వరదల వల్ల 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు.

    వరదలు, కొండ చరియలు విరిగిపోవడంతో వ్యాలీకి చేరుకునే రోడ్డు మార్గాలు బాగా దెబ్బ తిన్నాయి.

    మనూర్‌లో రెండు వంతెనలు పూర్తిగా కూలిపోయాయి. ప్రస్తుతానికి ఒక తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేశారు.

  16. "రిటైర్డ్ జస్టిస్ ఎన్‌వీ రమణ సీజేఐగా ఉన్నప్పుడు ఆర్థికల్ 370 రద్దు కేసు విచారణను కావాలనే వాయిదా వేశారు" - ఒమర్ అబ్దుల్లా

    సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా విమర్శలు చేశారు.

    ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ఎన్.వి.రమణ ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేస్తూ వచ్చారని ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు.

    భారత ప్రభుత్వం 2019, ఆగస్ట్ 5న జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసింది.

    సుప్రీం కోర్టు వేసవి సెలవుల తర్వాత ఈ పిటిషన్ లను విచారణ చేస్తుందని గతంలో జస్టిస్ ఎన్‌వీ రమణ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు.

    "ఈ విచారణ నిమిత్తం బెంచ్ ను ఏర్పాటు కూడా చేయకుండా ఆయన రిటైర్ అయ్యారు. ఈ అంశాన్ని గాలికొదిలేశారు. కొందరు తీవ్రమైన అంశాల పట్లవ్యవహరించే తీరు వల్లే వ్యవస్థల పై నమ్మకాన్ని కోల్పోతాం" అని అంటూ ట్వీట్ చేశారు.

    ఇటీవల ఆగస్టు 26న జస్టిస్ ఎన్.వి.రమణ పదవీ విరమణ చేశారు.

  17. దిల్లీ అసెంబ్లీలో బల నిరూపణ ప్రదర్శించనున్న అరవింద్ కేజ్రీవాల్

    దిల్లీ అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నేడు బల నిరూపణ ప్రదర్శించుకునేందుకు సిద్ధమవుతోంది.

    తమ ప్రభుత్వ బలాన్ని నిరూపించుకునేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అవుతోంది.

    దిల్లీలో బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన ఆపరేషన్ లోటస్ విఫలమయిందని ప్రజలకు తెలియచెప్పేందుకు సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.

    దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని పడగొట్టేందుకు బీజేపీ రూ.800 కోట్లను పక్కన పెట్టిందని కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ 40 మంది శాసన సభ్యులను తమ పార్టీ నుంచి తప్పించాలని చూసిందని, అందుకోసం ఒక్కొక్కరికీ రూ. 20 కోట్ల రూపాయిలను లంచంగా ఇవ్వాలని చూసిందని ఆరోపించారు.

    గత వారం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో శాసన సభ్యులతో సమావేశమయ్యారు. మొత్తం 62 మంది ఆప్ శాసన సభ్యులకు గాను 53 మంది మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు.

    ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కూడా బీజేపీలో చేరితే ఆయన పై పెట్టిన కేసులను ఉపసంహరిస్తామని చెప్పారని ఆరోపించారు.

    దిల్లీలో మద్యం కుంభకోణానికి సంబంధించి మనీష్ సిసోడియా ఇంట్లో ఇటీవల సోదాలు నిర్వహించింది. ఈ కేసులో మరొక 14 మందితో పాటు సిసోడియా పై కూడా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఆయన పై ఈడీ మనీ లాండరింగ్ కేసును కూడా నమోదు చేసింది.

    దిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు గాను, 62 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉండగా, బీజేపీకి 8 స్థానాలు ఉన్నాయి.

  18. "ముస్లింలకు ఇంట్లోనైనా నమాజ్ చేసుకునే స్వేచ్ఛ ఉందా?" - అసదుద్దీన్ ఓవైసీ

    "ఇంట్లో ప్రార్ధన చేసుకునేందుకు కూడా ప్రధాని అనుమతి తీసుకోవాలా?" అని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మోదీని ప్రశ్నించారు.

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఆగస్టు 24న కొంత మంది సామూహికంగా ప్రార్ధనలు నిర్వహించేందుకు రెండు ఇళ్లల్లోసమావేశమయ్యారు.

    అయితే, మసీదుకు వెళ్లకుండా ఇళ్లల్లో ప్రార్ధనలు నిర్వహించేందుకు అంత భారీ సంఖ్యలో ప్రజలు హాజరవ్వటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఈ మేరకు చజాలత్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

    ఈ అంశం పై స్పందిస్తూ, "ఈ దేశంలో ముస్లింలను రెండవ తరగతి పౌరులుగా ఎంత కాలం చూస్తారు" అని ఒవైసీ ప్రశ్నించారు.

    "ముస్లింలు ఇంటి దగ్గర కూడా నమాజ్ చేసుకోలేరా? ప్రార్ధన కోసం కూడా ప్రభుత్వం/పోలీసుల దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలా? దీనికి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ దేశంలో ముస్లింలను ఎంత కాలం రెండవ తరగతి పౌరులుగా చూస్తారు? ఈ సమస్యను ఎప్పటికైనా సరి చేస్తారా? అని ప్రశ్నించారు.

    "ఇంట్లో ప్రార్ధనలు నిర్వహించడం కూడా ఇతరుల మనోభావాలను గాయపరుస్తుందని చెప్పే స్థాయిలో సమాజంలో చాందసవాదం పెరిగిపోయింది" అని ఆయన మరొక ట్వీట్ చేశారు.

  19. హలో! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ లైవ్ పేజీని ఫాలో అవ్వండి.

  20. రేపు బీహార్‌కు కేసీఆర్ పయనం.. నితీష్‌కుమార్‌తో విందు సమావేశం