You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

రెపో రేటును పెంచిన ఆర్బీఐ.. లోన్ల ఈఎంఐలు పెరిగే అవకాశం

రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. దీంతో ఇప్పుడు రెపో రేటు 4.40 శాతంగా మారింది. ఫలితంగా వడ్డీ రేట్లు, లోన్ల ఈఎంఐలు పెరిగే అవకాశముంది.

లైవ్ కవరేజీ

రాజేశ్ పెదగాడి

  1. ఈ రోజు లైవ్ పేజీలో ముఖ్యాంశాలు

    * కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది.

    * టీమ్ ఇండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను బెదిరించారనే ఆరోపణలపై జర్నలిస్టు బోరియా మజుందార్‌పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించింది.

    * యూరప్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. స్వీడన్ ప్రధాన మంత్రి మగ్దలేనా ఆండెర్సన్‌తో బుధవారం భేటీ అయ్యారు.

    * కేరళలోని పాలక్కడ్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నాయకుడు శ్రీనివాసన్ హత్య కేసులో మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 20కి పెరిగింది.

    * రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. దీంతో ఇప్పుడు రెపో రేటు 4.40 శాతంగా మారింది.

    * టాలీవుడ్ మాజీ నటి, మహారాష్ట్రలోని అమరావతికి చెందిన స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త రవి రానాలకు ముంబయి సెషన్సు కోర్టు బుధవారం బెయిలు మంజూరుచేసింది.

  2. బాలీవుడ్ సినిమా జల్సాలో నటించిన తెలుగు అబ్బాయి సూర్య కాశీభట్లతో బీబీసీ ఇంటర్వ్యూ

  3. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్ కొట్టివేత

    కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనపై ఎన్ఎస్‌యూఐ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది.

    రాహుల్ గాంధీ పర్యటనకు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అనుమతి ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది.

    ఉస్మానియా యూనివర్సిటీలో ప్రస్తుతం ఎంబీఏ, ఎమ్మెస్సీ, ఎం.కామ్ పరీక్షలు జరుగుతున్నాయని, రాహుల్ పర్యటనతో శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చని చెప్పిన వీసీ స్టాండింగ్ కౌన్సిల్ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

    దీంతో ఇంతకుముందు హైకోర్టు సింగిల్ బెంచ్ వెలువరించిన నిర్ణయాన్నే సమర్థిస్తూ ఎన్ఎస్‌యూఐ నేతల పిటిషన్‌ను కొట్టివేసింది.

  4. యాదగిరిగుట్టలో కుంగిన రోడ్డు, పాతబస్తీ వీధుల్లో పడవలు - భారీ వర్షాలకు ప్రజల ఇబ్బందులు

  5. ‘సిగ్గులేకుండా మా అమ్మ పాటను కాపీ చేశారు’ అంటున్న పాకిస్తాన్ గాయని

  6. క్రికెట్: వృద్ధిమాన్ సాహాను బెదిరించిన జర్నలిస్టుపై రెండేళ్ల నిషేధం

    టీమ్ ఇండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను బెదిరించారనే ఆరోపణలపై జర్నలిస్టు బోరియా మజుందార్‌పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించింది.

    బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా నేతృత్వంలోని కమిటీ ఈ విషయంపై విచారణ చేపట్టింది. అనంతరం సాహాను మజుందార్ బెదించారనే ఆరోపణలు నిజమేనని కమిటీ తేల్చింది.

    దీంతో ప్రెస్ అక్రిడిషన్ కార్డును రెండేళ్లపాటు మజుందార్‌కు ఇవ్వకూడదని కమిటీ సూచించింది.

    ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఇంటర్వ్యూ కోసం ఒక జర్నలిస్టు తనను బెదిరించారని సాహా చెప్పారు. ఈ విషయంపై మీడియాలో చాలా కథనాలు వచ్చాయి.

  7. స్వీడన్ ప్రధాన మంత్రితో నరేంద్ర మోదీ భేటీ

    యూరప్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. స్వీడన్ ప్రధాన మంత్రి మగ్దలేనా ఆండెర్సన్‌తో బుధవారం భేటీ అయ్యారు.

    డెన్మార్క్ రాజధాని కోపెన్‌హెగన్‌లో భారత్-నార్డిక్ దేశాల సదస్సు జరుగనుంది. దీనిలో డెన్మార్క్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే దేశాల నాయకులు పాలుపంచుకోబోతున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన మగ్దలేనా మోదీతో భేటీ అయ్యారు.

    భారత్-స్వీడన్ ద్వైపాక్షిక సంబంధాలను మోదీ-మగ్దలేనా సమీక్షించారని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు.

    ‘‘ఆవిష్కరణలు, వాతావరణ మార్పులు, గ్రీన్ హైడ్రోజన్, అంతరిక్షం, ఆర్కిటిక్ పరిశోధన తదితర రంగాల్లో ద్వైపాక్షిక బంధాలు బలోపేతం చేయడంపై ఇద్దరూ దృష్టిసారించారు’’అని జైశంకర్ చెప్పారు.

    మరోవైపు నార్వే ప్రధాన మంత్రి జోనస్ స్టోర్‌తోనూ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.

  8. 2022 చివరికల్లా రష్యా నుంచి చమురు దిగుమతిని నిలిపేస్తాం: యూరోపియన్ యూనియన్

    యుక్రెయిన్‌పై దాడి విషయంలో రష్యా మీద మరిన్ని ఆంక్షలు విధించేందుకు యూరోపియన్ యూనియన్ సిద్ధం అవుతోంది.

    ఈ ఏడాది చివరినాటికి రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్‌డెర్ లాయెన్ చెప్పారు.

    మరోవైపు రిఫైనరీ ఉత్పత్తుల దిగుమతులు కూడా పూర్తిగా నిలిపివేస్తామని ఆమె అన్నారు. యూరోపియన్ యూనియన్‌లోని సభ్య దేశాలు ఈ విషయంపై ఒక అంగీకారానికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

    బ్యాంకింగ్‌కు సంబంధించిన చెల్లింపుల వ్యవస్థ స్విఫ్ట్ నుంచి మరికొన్ని రష్యా బ్యాంకులను తొలగించేందుకు యూరోపియన్ యూనియన్ ప్రయత్నిస్తోంది.

    ఇప్పటికే స్బెర్ బ్యాంక్, క్రెడిట్ బ్యాంక్ ఆఫ్ మాస్కోలను స్విఫ్ట్ నుంచి తొలగించారు. ఇప్పుడు రష్యన్ అగ్రికల్చర్ బ్యాంక్‌పైనా చర్యలు తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

  9. ఇన్వర్టర్‌ను ఎలా ఎంచుకోవాలి... ప్రమాదాలను నివారించడానికి పాటించాల్సిన 8 సూత్రాలు

    వేసవిలో విద్యుత్ డిమాండ్‌కు సరఫరాకు మధ్య అంతరం అనివార్యంగా పెరుగుతుంటుంది. ఏసీలు, కూలర్ల వినియోగం పెరగడంతో విద్యుత్ అవసరాలు మరింత పెరుగుతాయి. దాంతో, చాలా చోట్ల కరెంట్ కోతలు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో పవర్ కట్ నుంచి ఉపశమనం కలిగించే ఇన్వర్టర్లకు డిమాండ్ పెరుగుతోంది.

    ఇంతకీ ఇన్వర్టర్లు ఎలా పనిచేస్తాయి? మన ఇంటి అవసరాలకు తగిన ఇన్వర్టర్లను ఎంచుకోవడం ఎలా? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చూద్దాం.

    పూర్తి కథనాన్ని చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

  10. కేరళ: ఆరెస్సెస్ నాయకుడి హత్య కేసులో మరో నలుగురి అరెస్టు

    కేరళలోని పాలక్కడ్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నాయకుడు శ్రీనివాసన్ హత్య కేసులో మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 20కి పెరిగింది.

    ఈ కేసుపై అడిషనల్ డీజీపీ విజయ్ సాఖ్రే బుధవారం పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడారు. ‘‘మంగళవారం సాయంత్రం ఈ కేసులో మరో నలుగురిని అరెస్టు చేశాం’’అని ఆయన చెప్పారు.

    ఆరెస్సెస్ నాయకుడు ఎస్‌కే శ్రీనివాసన్‌ను ఏప్రిల్ 16న కొందరు హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆరెస్టైన వారందరికీ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తో సంబంధముందని పోలీసులు వెల్లడించారు.

    పీఎఫ్ఐ నాయకుడు సుబైర్ హత్యకు స్పందనగా శ్రీనివాస్‌ను హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు.

    మరోవైపు సుబైర్ హత్య కేసులోనూ ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరికి ఆరెస్సెస్‌తో సంబంధముందని పోలీసులు తెలిపారు.

  11. రింకూ సింగ్: కోచింగ్ సెంటర్లో గదులు తుడిచే పని నుంచి ఐపీఎల్ క్రికెట్ స్టార్ దాకా...

    జీవితంలో కొందరికి చాలా ఆప్షన్లు ఉంటాయి. కానీ, ఏ ఆప్షన్ లేని వాళ్లు కూడా ఉంటారు. వాళ్లేం చేస్తారు? వాళ్లు మొదటి నుంచి తమ లక్ష్యమే లోకంగా అదే పనిలో మునిగిపోతారు. అలీగఢ్‌లో ఒక పేద కుటుంబంలో పుట్టిన రింకూ సింగ్ లాంటి వారు ఒకరోజు ఐపీఎల్ లాంటి క్రీడల్లో స్టార్‌లుగా అవతరిస్తారు.

    24 ఏళ్ల రింకూ సింగ్ సాధించిన విజయం, మీ మనసులో లక్ష్యాలు దృఢంగా ఉంటే, ఆకాశాన్ని కూడా చీల్చుకుంటూ దూసుకెళ్లవచ్చని మరోసారి నిరూపిస్తుంది.

    ఐపీఎల్‌లో సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు, ఆయన జట్టు 44 బంతుల్లో 61 పరుగులు చేయాల్సి ఉంది. ఇదేమీ పెద్ద కష్టమైన లక్ష్యం కాదు. కాకపోతే పిచ్ పై బంతి భయంకరంగా స్పిన్ అవుతోంది. బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు.

    పూర్తి కథనాన్ని చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

  12. ఎల్ఐసీ షేర్ల కోసం ఎలా ధరఖాస్తు చేయాలి? పాలసీదారులకు వచ్చే రాయితీలు ఎంత?

  13. రెపో రేటును పెంచిన ఆర్బీఐ

    కీలకమైన వడ్డీ రేటులను రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) బుధవారం పెంచింది.

    రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. దీంతో ఇప్పుడు రెపో రేటు 4.40 శాతంగా మారింది. ఫలితంగా వడ్డీ రేట్లు, లోన్ల ఈఎంఐలు పెరిగే అవకాశముంది.

    ద్రవ్యోల్బణాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఆర్బీఐ చర్యలు తీసుకుంది.

    మార్చి 2022లో హోల్‌సేల్ ద్రవ్యోల్బణ రేటు 7 శాతానికి పెరిగిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ఆర్బీఐ విధించిన గరిష్ఠ పరిమితి ఆరు శాతం కంటే ఈ రేటు పెరిగిపోయిందని వివరించారు.

    ముఖ్యంగా ఆహార ధరల పెరుగుదల ద్రవ్యోల్బణ రేటుపై ప్రభావం చూపుతోంది.

  14. మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించేవరకు నిరసనలు కొనసాగిస్తాం – రాజ్ ఠాక్రే

    మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే బుధవారం హెచ్చరించారు.

    ‘‘ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని లౌడ్ స్పీకర్లను తొలగించాలని మేం అభ్యర్థించాం. మే నాలుగు తర్వాత కూడా లౌడ్ స్పీకర్ల నుంచి శబ్దాలు వినిపిస్తే, మసీదుల ఎదుట హనుమాన్ చాలీసా పెడతామని చెప్పాం. కానీ, మా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు. అయితే, లౌడ్ స్పీకర్లు పెడుతున్న మసీదులపై ఏం చర్యలు తీసుకున్నారని నేను అడుగుతున్నాను’’అని ఆయన అన్నారు.

    ‘‘నేనేమీ ఆజాన్‌కు వ్యతిరేకం కాదు. నెమ్మదిగా ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చు. కానీ, సౌండ్ మాత్రం పెంచకూడదు. ఈ సౌండ్లు 45 నుంచి 55 డెసిబెల్స్ లోపలే ఉండాలి’’అని ఆయన అన్నారు.

    ‘‘మేం మహారాష్ట్రలో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాం. మసీదుల వెలుపల మాత్రమే కాదు.. దేవాలయాల వెలుపల అక్రమంగా ఏర్పాటుచేసిన లౌడ్ స్పీకర్లనూ తొలగించాలి. ఇది మతపరమైన అంశంగా కాదు. సామాజిక సమస్యగా చూడాలి’’అని ఆయన అన్నారు.

  15. థర్మోకోల్ బోట్లతో చేపల వేట.. ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ..

  16. అస్సాం: ఇండియన్ ఆయిల్ కార్యక్రమంలో పోర్న్ వీడియోల కలకలం

    ఇండియన్ ఆయిల్ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో స్క్రీన్‌పై పోర్న్ వీడియోలు కలకలం రేపాయి. ఘటనపై అసోం క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

    తిన్సుకియా నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి కూడా హాజరయ్యారు.

    ఘటనకు సంబంధించి తిన్సుకియా పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది.

    మరోవైపు ఘటనపై మేజిస్ట్రియల్ విచారణకు ఆదేశించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ మంజిత్ బర్కాకోటి చెప్పారు.

    ‘‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన ఒక అధికారి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన వెనుక తెరపై వీడియోలు ప్లే అయ్యాయి. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. దాదాపు మూడు నాలుగు నిమిషాలు ఆ క్లిప్పులు ప్లే అయ్యాయి. వెంటనే ఆపరేటర్ అప్రమత్తమై ఆ వీడియోలను తొలగించారు’’అని కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టు రాజీవ్ దత్తా చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో లైవ్ ఇచ్చారు.

    ‘‘ఓ అధికారి మాట్లాడుతుంటే వింటున్నాను. ఆ స్క్రీన్ వైపు చూడలేదు. అసలు ఏం జరిగిందో గమనించలేదు. ఆ తర్వాత ఇలా జరిగిందని మా అసిస్టెంట్ చెప్పారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ కూడా అప్పుడు అక్కడే ఉన్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టాలని ఆయనకు వెంటనే సూచించాను. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’అని కేంద్ర మంత్రి రామేశ్వర్ చెప్పారు.

  17. భారత్-నార్డిక్ దేశాల సదస్సుకు హాజరుకానున్న ప్రధాని మోదీ

    డెన్మార్క్‌లో బుధవారం జరుగనున్న భారత్-నార్డిక్ దేశాల సదస్సుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరుకాబోతున్నారు.

    భారత్‌తోపాటు డెన్మార్క్, ఐస్లాండ్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే దేశాల నాయకులు ఈ సదస్సుకు హాజరవుతారు.

    కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తర్వాత ఆర్థిక వ్యవస్థలకు ఊతం ఇచ్చేందుకు తోడ్పడే అంశాలతోపాటు వాతావరణ మార్పులు, ఆవిష్కరణలు, టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన వనరులు తదితర అంశాలపై సదస్సులో చర్చలు జరుపుతారు. భారత్-నార్డిక్ దేశాల మధ్య సంబంధాలపై దీనిలో ప్రధానంగా దృష్టి సారిస్తారు.

    భారత్-నార్డిక్ దేశాల తొలి సదస్సు 2018లో స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో జరిగింది.

    డెన్మార్క్ రాజధాని కోపెన్‌హెగన్‌లోని ప్రవాస భారతీయులతోనూ మోదీ సమావేశమయ్యారు.

  18. యుక్రెయిన్‌ యుద్ధం, సముద్రంలో షిప్ హైజాకింగ్ నుంచి తప్పించుకుని బయటపడ్డ భారతీయ జంట

  19. మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వివాదంపై రాజ్ ఠాక్రేకు నోటీసులు.. ముంబయిలో భారీగా పోలీసుల మోహరింపు

    మసీదుల లౌడ్ స్పీకర్లను తొలగించకపోతే తాము పెద్ద శబ్దంతో హనుమాన్ చాలీసాను పెడతామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే హెచ్చరించిన నేపథ్యంలో ముంబయిలోని సున్నితమైన ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.

    రాష్ట్ర ప్రభుత్వం అన్ని మసీదుల దగ్గరా లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఆజాన్ రోజున తాము మసీదుల ఎదుట లౌడ్‌ స్పీకర్లలో హనుమాన్ చాలీసా పెడతామని అన్నారు.

    ప్రజలను రెచ్చగొట్టేలా రాజ్ ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారని ఔరంగాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనకు నోటీసులు కూడా పంపించారు.

    మరోవైపు అన్నిచోట్లా బుధవారం ప్రార్థనలు శాంతియుతంగానే జరుగుతున్నాయని ముంబయి పోలీసు కమిషనర్ సంజయ్ పాండే వెల్లడించారు.

    ‘‘సున్నితమైన ప్రాంతాల్లో బారికెడ్లు ఏర్పాట్లుచేశాం. వాహనాలను కూడా తనిఖీలు చేస్తున్నాం’’అని ఆయన చెప్పారు.

    ఠానేలోని జుమా మసీద్ పరిసరాల్లో పోలీసు పోస్టును ఏర్పాటుచేశారు. ఇక్కడకు సమీపంలో హనుమాన్ చాలీసా వినిపించేందుకు నవ నిర్మాణ సేన కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.

  20. ఆంధ్రప్రదేశ్: పార్వతీపురం మన్యం జిల్లాలో రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం

    ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాలోవై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఊళ్ల చంటి అనే వ్యక్తం ధ్వంసం చేశారు.

    విగ్రహాన్ని తొలగించిన ఊళ్ల చంటి.. దాన్ని రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. దీంతో ఆయనపై స్థానికులు దాడి చేశారు.

    సమాచారం అందిన వెంటనే పార్వతీపురం వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

    అయితే మతి స్థిమితం సరిగా లేకపోవడంతోనే చంటి ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు చెప్పారు.