నందిగ్రామ్ ఫలితంపై సుప్రీంకోర్టుకు వెళ్తానంటున్న మమత

ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హాట్రిక్ విజయం సాధించింది. ఎన్నికల సంఘం ఇప్పటివరకూప్రకటించిన గణాంకాలను బట్టి టీఎంసీ 209 స్థానాల్లో విజయం సాధించింది. 76 స్థానాల్లో గెలిచిన బీజేపీ రెండో స్థానంలో ఉంది.
మమతా బెనర్జీ రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ఆదివారం మధ్యాహ్నానికే ఒక స్పష్టత వచ్చింది.
కానీ నందిగ్రామ్ ఫలితం మాత్రం రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలకు విరుద్ధంగా వచ్చింది. బెంగాల్‌లోని ఈ హై-ప్రొఫైల్ స్థానంలో అర్థరాత్రి వరకూ ఓట్ల లెక్కింపు కొనసాగింది.
చివరికి మమత ప్రత్యర్థి శుభేందు అధికారి ఇక్కడ గెలిచినట్లు ప్రకటించారు. బెంగాల్లో ఘన విజయం సాధించినప్పటికీ, తను పోటీ చేసిన చోట మమత ఓటమి మూటగట్టుకున్నారు.
ఆ తర్వాత ఆమె నందిగ్రామ్ స్థానంలో ఓట్లు మళ్లీ లెక్కించాలని డిమాండ్ చేశారు. కానీ ఆమె వినతిని ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
నందిగ్రామ్ స్థానం ఓట్ల లెక్కింపులో గందరగోళం, అవకతవకలు జరిగాయని మమత ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం తీరుపై కోర్టుకు వెళ్తానని చెప్పారు.
“ఎన్నికల సంఘం దారుణ వైఖరికి వ్యతిరేకంగా మేం సుప్రీంకోర్టుకు వెళ్తాం” అని ఆమె చెప్పారు.
నిజానికి ఆదివారం ఓట్ల లెక్కింపు మొదలైనప్పుడు మమతా బెనర్జీ కొన్ని రౌండ్లు బీజేపీ అభ్యర్థి శుభేందు అధికారికంటే వెనకబడ్డారు. కానీ, కాసేపటి తర్వాత ఆమె ఆధిక్యం సాధించారు.
బీజేపీ, తృణమూల్ అభ్యర్థుల మధ్యా హోరాహోరీ పోటీ కనిపించింది. కొన్ని రౌండ్లలో ఇద్దరి మధ్యా 6 ఓట్ల నుంచి 1200 ఓట్ల తేడా నమోదైంది. కానీ అర్థరాత్రి అన్ని రౌండ్లు లెక్కింపు పూర్తైన తర్వాత శుభేందు అధికారి విజయం సాధించారు.
విజయం తర్వాత మాట్లాడిన శుభేందు అధికారి “ప్రేమ, నమ్మకం, ఆశీస్సులు, మద్దతు అందించి నన్ను తమ ప్రతినిధిగా ఎన్నుకున్న నందిగ్రామ్ ప్రజలకు రుణపడి ఉంటా. నేను వారి సేవకు, సంక్షేమానికి పనిచేస్తూనే ఉంటానని మాట ఇస్తున్నా. మీకు కృతజ్ఞతలు” అన్నారు.












