కరోనావైరస్ కారణంగా ఈనెల 24వ తేదీ నుంచి భారతదేశ వ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌తో వివిధ రాష్ట్రాల్లోని వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి వారిని ఆదుకోవాలని 200 మంది విద్యావేత్తలు, ఆర్థిక వేత్తలు, సామాజిక కార్యకర్తలు కోరారు.
వారి తరపున ప్రముఖ ఆర్థిక వేత్త జీన్ డ్రెజ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలన్న నిర్ణయం ఎలాంటి ప్రణాళిక లేకుండా తీసుకున్న నిర్ణయమని, దేశంలోని 90 శాతం మంది కార్మికులపై దీని ప్రభావం ఎలా ఉంటుందోనని ఆలోచించలేదని పేర్కొన్నారు.
కేవలం 4 గంటల నోటీసుతో వెలువడిన ఈ ప్రకటనతో ప్రజలంతా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
పరిశ్రమలు మూసివేయడం, పనులన్నీ ఆపివేయడం, రవాణా సదుపాయాలను నిలిపివేయడంతో లక్షలాది మంది వలస కార్మికులు వందలాది కిలోమీటర్లు కాలి నడకన తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు పయనమయ్యారని వివరించారు.
దీంతో వీరందరికీ వైరస్ సోకే ప్రమాదం ఉందని, వీళ్లు మళ్లీ వైరస్ వ్యాప్తికి కూడా కారణం కావొచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి అంగన్ వాడీ కేంద్రాలు, పంచాయితీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, సామాజిక భవనాలు, జిల్లా, మండల కేంద్రాలు మొదలైన చోట్ల వీరికి ఆహారం, వైద్యం, పారిశుధ్య సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరారు.
అలాగే, వీళ్లంతా తమతమ స్వస్థలాలకు వెళ్లేందుకు శుభ్రం చేసిన బస్సులు, రైళ్లను నడపాలని కోరారు.