కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులను, నర్సింగ్ హోంలను స్వాధీనం చేసుకోవాలని మానవ హక్కుల వేదిక(హెచ్‌ఆర్‌ఎఫ్) డిమాండ్ చేసింది.
ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలను వాటిలో ఉన్న అన్ని వైద్య సదుపాయాలు, మానవ వనరులు సహా స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నిర్వహణ చేపట్టి ఈ విపత్తును ఎదుర్కోవాలని కోరింది. ఈ విషయంలో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌ను జాతీయం చేసిన స్పెయిన్‌ను భారత ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలని సూచించింది.
కరోనావైరస్ మహమ్మారి మానవాళిని గడగడలాడిస్తున్న తరుణంలో గూడులేని నిరుపేదలు, వలస కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందని.. 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు ప్రభుత్వం వీరి గురించి ఏమాత్రం ఆలోచించలేదని హెచ్‌ఆర్‌ఎఫ్ ఆరోపించింది. జైళ్లలో ఈ అంటువ్యాధి వ్యాపించకుండా అండర్ ట్రయల్ ఖైదీలు, కొన్ని రకాల శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలను అత్యవసర పెరోల్, ఫర్లోపై విడుదల చేసే విషయంలో తెలుగు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
కోవిడ్-19 నేపథ్యంలో జైళ్లలో ఖైదీల సంఖ్య తగ్గించడానికి అండర్ ట్రయల్ ఖైదీలు, ఏడేళ్ల లోపు శిక్షలు అనుభవిస్తున్నవారిని పెరోల్, బెయిలుపై విడుదల చేసే విషయంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీచేసిన విషయాన్ని మానవ హక్కుల వేదిక గుర్తుచేసింది.