You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్ రాజీనామా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమి పాలవ్వడంతో, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

సారాంశం

  • ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 : కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
  • ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో టీడీపీ 90 స్థానాల్లో గెలుపు, 44 స్థానాల్లో ఆధిక్యం
  • జనసేన 17 స్థానాల్లో గెలుపు, 4 స్థానాల్లో ముందంజ
  • బీజేపీ 5 స్థానాల్లో గెలుపు, 3 స్థానాల్లో ఆధిక్యం
  • వైసీపీ 3 స్థానాల్లో గెలుపు, 9 స్థానాల్లో ముందంజ
  • మే 13న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.

లైవ్ కవరేజీ

  1. నరేంద్ర మోదీ: ‘విపక్షాలన్నీ ఏకమైనా, బీజేపీ సొంతంగా సాధించినన్ని సీట్లను గెలుచుకోలేకపోయాయి’

    విపక్షాలన్నీ ఏకమైనా, బీజేపీ సొంతంగా సాధించినన్ని సీట్లను గెలుచుకోలేకపోయాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీ మాట్లాడారు.

    బీజేపీ కార్యకర్తలకు, నేతలకు, అభ్యర్థులందరికీ ధన్యవాదాలు చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత, రెండు పర్యాయాలు పూర్తి చేసుకున్న ప్రభుత్వమే మూడోసారి తిరిగి అధికారంలోకి రాబోతుందన్నారు.

    ఒడిశాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఒడిశాలో మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. జగన్నాథుడి భూమిపై తొలిసారి బీజేపీ అభ్యర్థి సీఎం కాబోతున్నారని అన్నారు.

    కేరళలో కూడా బీజేపీ గెలిచిందని, ఆ రాష్ట్రంలోని కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు. ఎన్నో తరాలుగా సామాన్య ప్రజలకు సేవలందించేందుకు వారు పోరాటం చేస్తున్నారని తెలిపారు.

    ఎన్నికల సంఘానికి తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ఎంతో సమర్థవంతంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికను నిర్వహించిందని అన్నారు.

    ‘అమ్మ లేని లోటును తీర్చారు’

    ఈరోజు చాలా ఎమోషనల్ డే అని, అమ్మ చనిపోయిన తర్వాత వచ్చిన తొలి ఎన్నికలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

    అమ్మ లేని లోటును ఈ దేశ ప్రజలు తీర్చారని అన్నారు. ఈ దేశ తల్లులు, అక్కాచెల్లెళ్లు తనకు సరికొత్త ప్రేరణను కలిగించారని చెప్పారు.

  2. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్ రాజీనామా

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమి పాలవ్వడంతో, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

    తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు జగన్.

    రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపడానికి ముందు వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

    తాము ఇన్ని మంచి పనులు చేసినా.. ఓటమి తప్పలేదని, కోట్ల మంది ప్రజల ఆప్యాయత ఏమైందో తెలియడం లేదంటూ ఆయన భావోద్వేగంతో మాట్లాడారు.

  3. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కుటుంబ సభ్యులతో చంద్రబాబు సంబరాలు

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ భారీ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు.

    కొడుకు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్, భార్య నారా భువనేశ్వరిలతో కలిసి చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేశారు.

    ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు టీడీపీ 34 స్థానాల్లో విజయం సాధించింది. మరో 102 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

    టీడీపీ కూటమిలో భాగమైన జనసేన పార్టీ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. 5 స్థానాల్లో గెలుపొందినట్లు ఈసీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

  4. మల్కాజిగిరి: దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంలో ఈటల రాజేందర్ ఆధిక్యం

    మల్కాజిగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అభ్యర్థి ఈటల రాజేందర్ 3,81,380 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.

    మల్కాజిగిరి నియోజకవర్గం ఓటర్ల సంఖ్య పరంగా దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. ఇక్కడ అత్యధికంగా 37,28,417 మంది ఓటర్లున్నారు.

    ప్రపంచంలోని 64 దేశాల జనాభా కంటే ఇక్కడి ఓటర్లే ఎక్కువ. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం 2008లో ఏర్పాటైంది.

  5. వైసీపీ అధినేత జగన్‌ ఎంత ఆధిక్యంలో ఉన్నారంటే..

    పులివెందుల నుంచి పోటీ చేసిన వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం 57,020 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    ఆయన ప్రత్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి వెనుకంజలో ఉన్నారు.

    జగన్ మోహన్ రెడ్డికి ఇప్పటి వరకు 1,03,444 ఓట్లు రాగా.. బీటెక్ రవికి 46,424 ఓట్లు వచ్చాయి.

  6. జనసేన: రాజానగరంతో బోణి కొట్టిన పవన్ కల్యాణ్ పార్టీ, బత్తుల బలరామకృష్ణ విజయం

    ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలలో జనసేన పార్టీ బోణీ కొట్టింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్ధి బత్తుల బలరామకృష్ణ విజయం సాధించారు.

    ఈ స్థానంలో బలరామకృష్ణ 1,05,995 ఓట్లు సాధించి తన సమీప ప్రత్యర్ధి, వైసీపీ అభ్యర్ధి జక్కంపూడి రాజాపై 34,049 ఓట్ల తేడాతో గెలిచారు. వైసీపీ అభ్యర్ధికి 71,946 ఓట్లు వచ్చాయి.

    ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ముండ్రు వెంకట శ్రీనివాస్ మూడో స్థానంలో నిలిచారు. ఆయనకు కేవలం 1901 ఓట్లు మాత్రమే వచ్చాయి.

  7. తెలంగాణ: లోక్‌సభ ఫలితాలలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ, చెరి 8 స్థానాల్లో ఆధిక్యం

    లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో 8 స్థానాల్లో బీజేపీ, 8 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి. ఎంఐఎం ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది.

    మెదక్ స్థానంలో మొదటి రెండు రౌండ్లలో బీఆర్‌ఎస్ ఆధిక్యంలో కొనసాగినా ఆ తర్వాత వెనబడింది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్ధి మాధవనేని రఘునందన్ రావు ముందంజలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ కన్నా వెనకబడిన బీఆర్‌ఎస్ మూడో స్థానానికి చేరుకుంది.

    మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి రఘునందన్ రావు సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ అభ్యర్ధి నీలం మధుపై 29,782 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    బీజేపీ ఆధిక్యంలో ఉన్న 8 స్థానాల్లో బీఆర్‌ఎస్ మూడో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ ఆధిక్యం ఉన్న 8 స్థానాల్లో ఒక్క మహబూబాబాద్, ఖమ్మం తప్ప మిగతా 6 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్ధులు మూడో స్థానంలో ఉన్నారు.

    ఎంఐఎం అభ్యర్ధి అసదుద్దీన్ ఒవైసీ ఆధిక్యంలో హైదరాబాద్ స్థానంలో బీజేపీ రెండో స్థానంలో, కాంగ్రెస్ మూడో స్థానంలో ఉన్నాయి.

  8. ఆంధ్రప్రదేశ్: అసెంబ్లీ ఎన్నికల్లో అధికారికంగా వెల్లడైన తొలి ఫలితం, గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం

    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో తొలి ఫలితాన్ని అధికారికంగా ప్రకటించింది ఎన్నికల సంఘం. రాజమండ్రి రూరల్ నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్ధి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

    గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన ప్రత్యర్ధిపై 64,090 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం వెట్‌సైట్ పేర్కొంది.

    బుచ్చయ్య చౌదరికి 1,29,060 ఓట్లు పోల్ కాగా, ఆయన సమీప ప్రత్యర్ధి, వైసీపీకి చెందిన చెల్లుబోయిన గోపాలకృష్ణకు 64,970 ఓట్లు వచ్చాయి. దీంతో బుచ్చయ్య చౌదరి 64 వేల పైచిలుకు తేడాతో గెలిచారు.

  9. కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు ముందంజ

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముందంజలో కొనసాగుతున్నారు.

    మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేప్పటికి 4,683 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి కేఆర్‌జే భరత్‌పై ఆధిక్యంలో ఉన్నారు.

  10. పిఠాపురంలో భారీ ఆధిక్యంలో పవన్ కల్యాణ్

    జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ భారీ ఆధిక్యంలో కొనసాతున్నారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి 24,930 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

    ప్రతి రౌండ్‌లోనూ ఆయన ఆధిక్యం కొనసాగిస్తున్నారు.

  11. తెలంగాణ లోక్ సభ ఓట్ల లెక్కింపు, భారీ ఆధిక్యంలో బండి సంజయ్

    తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ముందంజలో ఉన్నారు.

    నిజమాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, సికింద్రాబాద్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి గోడం నగేశ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    కాంగ్రెస్ పార్టీ ఆరు లోక్ సభ స్థానాల్లో ముందంజలో ఉంది. గడ్డం వంశీకష్ణ (పెద్దపల్లి), సురేష్ షెట్కార్ (జహీరాబాద్), డాక్టర్ మల్లు రవి (నాగర్ కర్నూల్), కుందూరు రఘువీర్ రెడ్డి (నల్లగొండ), కడియం కావ్య (వరంగల్), బలరాం నాయక్ (మమహబూబాబాద్), రామసహాయం రఘురామ్ రెడ్డి( ఖమ్మం) లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది

    మెదక్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పి.వెంకట్రామ రెడ్డి ముందంజలో ఉన్నారు.

    హైదరాబాద్ లోక్ సభ సీటులో ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  12. ఎవరు ముందంజలో? ఎవరు వెనుకంజలో?

    వైసీపీ కీలక నేత, పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనకంజలో ఉన్నారు. రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసే నాటికి తన సమీప ప్రత్యర్థి, కూటమి అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి కంటే 165 ఓట్ల వెనకంజలో ఉన్నారు.

    చీపురుపల్లి నుంచి పోటీ చేస్తున్న మరో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రెండో రౌండ్ ముగిసేనాటికి 600 ఓట్ల వెనకంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి కళా వెంకటరావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామక‌ృష్ణా రెడ్డిపై కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. మూడు రౌండ్ల కౌంటింగ్ ముగిసేనాటికి 3185 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    దెందులూరులో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరిపై ఆధిక్యంలో ఉన్నారు.

  13. ఓట్ల లెక్కింపు ముందు బీజేపీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీ లత ఏమన్నారంటే?

    లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని బీజేపీ హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి మాధవీ లత వ్యాఖ్యానించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    "నాకు చాలా ఉత్సాహంగా ఉంది. దేశంలో చాలా సీట్లతో పాటు హైదరాబాద్‌లోనూ బీజేపీ గెలుస్తుంది. రెండు పర్యాయాలు ప్రధాని మోదీ అద్భుతంగా పని చేశారు. ఈసారి 400 సీట్లు దాటుతాయని ఆశిస్తున్నాం’’ అని ఆమె అన్నారు.

    హైదరాబాద్‌ స్థానానికి ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, బీజేపీ నుంచి మాధవి లత పోటీ పడ్డారు.

    2004 నుంచి హైదరాబాద్‌లో ఒవైసీ గెలుస్తూ వస్తున్నారు.

  14. పల్నాడులో భద్రత కట్టుదిట్టం, పోలీసు ఆంక్షల అమలు

    పోలింగ్ నాడు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా పల్నాడు జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయి ఆంక్షలు విధించారు.

    రెండురోజులుగా మొత్తం వ్యాపార సంస్థలన్నింటినీ మూసివేయించారు. రాకపోకలు కూడా దాదాపుగా నిలిచిపోయాయి. జిల్లా అంతటా కర్ఫ్యూ వాతావరణం తలపిస్తోంది.

    జిల్లా కేంద్రం నరసరావుపేటలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

    నరసరావుపేటలోని జేఎన్‌టీయూ కాలేజీలో కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్ కేంద్రం వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్, ఇతర అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

  15. పిఠాపురంలో ఆధిక్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్

    తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేనాటికి పవన్ 4,350 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  16. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం: ఏపీ డీజీపీ

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సోషల్ మీడియాపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు.

    ఇతరులను బెదిరించేలా సోషల్ మీడియా పోస్టులు పెడితే చూస్తు ఊరుకోబోమని ఆయన హెచ్చరికలు చేశారు.

    అలాంటి వారిపై కేసులు నమోదు చేసి రౌడీషీట్లు ఓపెన్ చేస్తామన్నారు.

    సోషల్ మీడియా గ్రూపుల అడ్మిన్లు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు.

  17. బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానెల్‌లో చేరండి

    బీబీసీ న్యూస్ తెలుగు కథనాలను మీరిప్పుడు వాట్సాప్ ద్వారా చదవచ్చు.

  18. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: మరి కాసేపట్లో కౌంటింగ్ మొదలు

    ఏపీలోని 175అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలు, తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

    ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం 2,383 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈసారి భారీగా పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. మొత్తం 4.61 లక్షలమంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. వీటి లెక్కింపు కోసం 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్ళు ఏర్పాటు చేశారు.

    మరోపక్క ఏపీ వ్యాప్తంగా 33 ప్రాంతాలలో 401 కౌంటింగ్ హాళ్ళను ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు 2446 ఈవీఎం టేబుళ్ళు, పార్లమెంటు నియోజవకర్గాలకు 2443 ఈవీఎం టేబుళ్ళు ఏర్పాటు చేశారు.

    కౌంటింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.కేంద్ర బలగాలను రంగంలోకి దించారు.

    మద్యం దుకాణాలను మూసివేయించారు.144వ సెక్షన్ అమలు చేస్తున్నారు.

    కౌంటింగ్ లోముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు.ఉదయం 8.30గంటల కల్లా ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మొదలుకానుంది.

    మొత్తంగా 3.33 కోట్ల మంది ఆంధ్రులతో కలిపి దేశవ్యాప్తంగా64.2 కోట్ల మందిఎలాంటి తీర్పు ఇచ్చారో మరి కొన్ని గంటల్లో తేలనుంది.దేశవ్యాప్తంగా31.2 కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  19. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.