లైవ్, విలువైన సూచనలిచ్చినందుకు ధన్యవాదాలు: యువతకు కృతజ్ఙతలు తెలిపిన ప్రధాని మోదీ

‘‘రాత్రి మిమ్మల్ని ఆలస్యంగా కలిసే అవకాశం లభించింది. నా వీడియోకు మీరు స్పందించిన తీరును, మీ సానుకూల సూచనలను నేను అభినందిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు’’

సారాంశం

  • యుక్రెయిన్‌ రాజధాని కీయేవ్ సమీపంలో డ్రోన్ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌పై రష్యా చేసిన దాడుల్లో 10 మంది చనిపోయారు. ఈ దాడిలో వందమంది గాయపడ్డారని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ చెప్పారు. దాడిని రష్యా ధ్రువీకరించింది. రష్యాలో పౌర లక్ష్యాలపై దాడికి ఉపయోగించే డ్రోన్లను ఇక్కడ ప్రదర్శించారని రష్యా రక్షణశాఖ ఆరోపించింది.
  • జంతర్ మంతర్ పరిసరాల్లో దిల్లీ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అదనపు బ్యారికేడ్లను ఏర్పాటుచేయడంతో పాటు వాటిని భారీ గొలుసులతో ఒకదానికొకటి అనుసంధానించి, వెల్డింగ్ చేసి మరింత పటిష్టంగా ఏర్పాటుచేశారు.
  • ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో తాగునీటి సరఫరా వ్యవస్థత తీవ్రంగా దెబ్బతింది. జిల్లాలో 102 తాగునీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయని, వాటిలో 27 పథకాలు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయని జల్ శక్తి శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది.
  • లక్షలాదిమంది భక్తుల మధ్య పూరీ జగన్నాథుడి బహుడా యాత్ర వైభవంగా జరిగింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి తిరుగు రథయాత్ర అయిన బహుడా యాత్ర సందర్భంగా మూడు భారీ రథాలు గుండిచా ఆలయం నుంచి 2.6కిలోమీటర్లు ప్రయాణించి పూరీ జగన్నాథ ఆలయం సింహద్వారం చేరుకున్నాయి.

లైవ్ కవరేజీ

  1. కొత్త తరం ప్రశ్నలు అడుగుతోంది, వారికి తార్కికంగా సమాధానం చెప్పాలి - మోహన్ భగవత్

    నీట్, దిల్లీ, ఆందోళనలు

    ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images

    ఫొటో క్యాప్షన్, మోహన్ భగవత్(ఫైల్ ఫోటో)

    కొత్త తరం ప్రశ్నలు అడుగుతోందని, వాటికి తార్కికంగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.

    దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర, దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులు, యువత ఆందోళనలు చేస్తున్న తరుణంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    "మేం చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చెప్పిన విషయాలతో వాదించేవాళ్ళం కాదు. మాట్లాడొద్దు అంటే మాట్లాడే వాళ్లం కాదు" అని అన్నారు.

    ‘‘కానీ ఇప్పుడు అలా లేదు, కొత్త తరం ప్రశ్నలు అడుగుతుంది, వారికి సమాధానాలు చెప్పాలి. నేటి తరానికి మరింత ఆప్యాయత అవసరం. మనం వారితో సమయం గడపాలి. మనం వారితో మాట్లాడాలి. ఈ రోజుల్లో కుటుంబాల మధ్య సంభాషణలు తగ్గిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లతో బిజీగా ఉన్నారు" అని ఆయన అన్నారు.

    శుక్రవారం దిల్లీలో జరిగిన 'విశ్వ మాంగళ్య సభ' కార్యక్రమంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  2. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సులో ఆత్మాహుతి దాడి, 15 మంది మృతి

    పాకిస్తాన్, ఆత్మాహుతి దాడి, ఉగ్రవాదం

    ఫొటో సోర్స్, Abdul BASIT / AFP via Getty Images

    ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లో 15మంది మృతి

    పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సులోని టాంక్ జిల్లాలో ఉన్న సైన్యం, పోలీసుల సంయుక్త చెక్ పోస్టు మాంఝీ ఖేల్‌పై గురువారం రాత్రి ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 12 మంది సైనికులతో సహా మొత్తం 15 మంది మరణించారు.

    మృతుల్లో ఇద్దరు పోలీసులు, ఒక అటవీ శాఖ అధికారి ఉన్నారు. ఈ దాడి అనంతరం భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో పన్నెండు మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

    ‘‘ఉగ్రవాదులు మొదట చెక్‌పోస్ట్ భద్రతను ఛేదించుకుని లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. కానీ భద్రతా దళాలు వారి ప్రయత్నాన్ని విఫలం చేశాయి. ఆ తర్వాత పారిపోతున్న మిలిటెంట్లను వెంబడించి కాల్పులు జరపడంతో 12 మంది మరణించారు’’ అని పాకిస్తానీ సైన్యానికి చెందిన మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) తెలిపింది.

    ‘‘తొలి ప్రయత్నం విఫలమైన తర్వాత ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో చెక్‌పోస్ట్ గోడను ఢీకొట్టారు. దీంతో భారీ పేలుడు సంభవించింది. 15 మంది చనిపోయారు. చెక్‌పాయింట్‌ పూర్తిగా ధ్వంసమైంది’’ అని ఐఎస్‌పీఆర్ తెలిపింది.

  3. పేపర్ లీక్‌ విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కామెంట్లపై వివిధ పార్టీలు ఏమన్నాయి?

    ఆర్థికమంత్రి, విద్యావ్యవస్థ, ఆందోళనలు, దిల్లీ, జంతర్ మంతర్, నీట్

    ఫొటో సోర్స్, David Talukdar/NurPhoto via Getty Images

    ఫొటో క్యాప్షన్, నిర్మలా సీతారామన్

    ప్రశ్నాపత్రాల లీకేజ్‌ను కొందరు విద్యార్థులు మరింత కష్టపడి చదవడానికి అవకాశంగా ఉపయోగించుకున్నారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

    కాంగ్రెస్, కాక్రోచ్ జనతాపార్టీ, ఝార్ఖండ్ ముక్తి మోర్చా సహా పలు పార్టీలు తీవ్రంగా స్పందించాయి.

    ‘‘ఆ సంఘటన తర్వాత ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోతే, అరెస్టులు చేయకపోతే, మళ్లీ పరీక్ష నిర్వహించి ఉండకపోతే, ఫలితాలు వెంటనే విడుదల చేసి ఉండకపోతే ఇప్పుడు యువత ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందే స్థితిలో ఉండేది కాదు’’ అని ఏఎన్ఐతో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.

    ‘పేపర్ లీక్ అయినప్పుడు మేం బాధపడ్డాం. కానీ తర్వాత దాన్ని అవకాశంగా తీసుకుని మరింత కష్టపడి చదివాం. బాగా రాణించాం’’ అని కొందరు విద్యార్థులు చెప్పినట్టు నిర్మలా సీతారామన్ అన్నారు.

    దీనిపై కాంగ్రెస్ ‘ఎక్స్‌లో స్పందించింది. ఇవి బాధ్యతారాహిత్యమైన, సున్నితత్వంలేని మాటలని కాంగ్రెస్ విమర్శించింది.

    ‘‘21 మందికి పైగా యువత ప్రాణాలను బలిగొని, లక్షలమంది యువత నిరసనలకు కారణమైన ప్రశ్నాపత్రాల లీకేజ్ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రభుత్వం లెక్కించుకుంటోంది. పేపర్ లీకేజ్‌లను అరికట్టడంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి ఈ ప్రకటనే నిదర్శనం. ఈ వ్యక్తులు దేశ విద్యావ్యవస్థను నాశనం చేశారు’’ అని కాంగ్రెస్ తన పోస్ట్‌లో పేర్కొంది.

    ‘‘ఆర్థికమంత్రి ఇప్పుడు ప్రశ్నాపత్రాల లీకేజ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు’’ అని ఆప్ విమర్శించింది.

    పేపర్ లీకేజ్‌లు తీవ్రరూపం దాల్చిన ఒక క్యాన్సర్‌లాంటివి. ఝార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వం దీన్ని నిర్మూలిస్తోంది. కానీ ప్రశ్నాపత్రాల లీకుల వల్ల ప్రయోజనాలున్నాయని బీజేపీ అంటోంది’’అని ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధికారిక ‘ఎక్స్’అకౌంట్‌లో రాసింది.

    ‘‘ఈ తర్కం ప్రకారం దేశంలోని పత్రాలన్నీ లీకవ్వాలి’’అని కాక్రోచ్ జనతాపార్టీ అధికార ప్రతినిధి అశుతోశ్ కాంకా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

  4. దిల్లీ నిరసనలు: పెల్లెట్ గన్ అంటే ఏంటి, ఎందుకు వివాదాస్పదంగా మారింది?

  5. విలువైన సూచనలిచ్చినందుకు ధన్యవాదాలు - ప్రధాని మోదీ

    దిల్లీ, జంతర్ మంతర్, ఆందోళనలు, ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ప్రధాని మోదీ

    ఇన్‌స్టా‌గ్రామ్‌లో తాను షేర్ చేసిన వీడియోకు యువత నుంచి వచ్చిన స్పందనపై ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తన వీడియోకు యువత అందించిన విలువైన సూచనలు, సానుకూల స్పందనపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.

    ‘‘ధన్యవాదాలు మిత్రులారా. రాత్రి ఆలస్యంగా మిమ్మల్ని కలిసే అవకాశం లభించింది. నా వీడియోకు మీరు స్పందించిన తీరును, మీ సానుకూల సూచనలను అభినందిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు’’ అని ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ వీడియోలో ప్రధాని తెలిపారు.

    నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్‌పై దేశవ్యాప్తంగా యువత ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పేపర్‌లీక్‌లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని గురువారం అర్ధరాత్రి సెల్ఫీ వీడియోలో ప్రధాని ప్రకటించారు.

  6. నమస్తే, బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    దేశంలో, ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ వార్తలను ఎప్పటికప్పుడు ఇక్కడ అప్‌డేట్ చేస్తాం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.