లైవ్, దిల్లీ ఎన్‌సీఆర్‌లో కాలుష్యం పెరగడంతో అమల్లోకి గ్రాప్-1.. ఏమేం నిషేధించారంటే

‘కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఇన్ నేషనల్ కేపిటల్ రీజియన్ అండ్ అడ్జోయినింగ్ ఏరియాస్’(సీఏక్యూఎం) జారీ చేసిన ఆదేశాలప్రకారం... అక్టోబర్ 20న దిల్లీలో వాయు నాణ్యత సూచిక(ఏక్యూఐ) 179గా ఉంది. ఇది మోడరేట్ కేటగిరీలోకి వస్తుంది. అయితే, అక్టోబర్ 21 మధ్యాహ్నం 2 గంటలకు అది 244కి పెరిగింది. ఏక్యూఐ 244 అనేది పూర్ కేటగిరీలోకి వస్తుంది.. దీంతో గ్రాప్-1 నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు.

సారాంశం

  • ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో రేగిన వివాదానికి సంబంధించి పంజాబ్ గాయకుడు దలేర్ మెహిందీకి బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, రాపర్ బాద్షా అండగా నిలిచారు.
  • జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా పారా క్రీడల్లో, రెండో రోజు ముగిసే సమయానికి భారత్ మొత్తం 35 పతకాలను సాధించింది.

లైవ్ కవరేజీ

  1. దిల్లీ ఎన్‌సీఆర్‌లో కాలుష్యం పెరగడంతో అమల్లోకి గ్రాప్-1.. ఏమేం నిషేధించారంటే

    దిల్లీలో వాయు కాలుష్యం
    ఫొటో క్యాప్షన్, దిల్లీ ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యం

    దిల్లీ ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యం పెరిగిన నేపథ్యంలో బుధవారం గ్రాప్-1(జీఆర్ఏపీ-1) అమల్లోకి తీసుకొచ్చారు.

    గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ను సంక్షిప్తంగా గ్రాప్ అని పిలుస్తారు.

    ‘కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఇన్ నేషనల్ కేపిటల్ రీజియన్ అండ్ అడ్జోయినింగ్ ఏరియాస్’(సీఏక్యూఎం) జారీ చేసిన ఆదేశాలప్రకారం... అక్టోబర్ 20న దిల్లీలో వాయు నాణ్యత సూచిక(ఏక్యూఐ) 179గా ఉంది. ఇది మోడరేట్ కేటగిరీలోకి వస్తుంది. అయితే, అక్టోబర్ 21 మధ్యాహ్నం 2 గంటలకు అది 244కి పెరిగింది. ఏక్యూఐ 244 అనేది పూర్ కేటగిరీలోకి వస్తుంది.. దీంతో గ్రాప్-1 నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు.

    ఏక్యూఐ 201 నుంచి 300 మధ్యలో ఉన్నప్పుడు గ్రాప్-1 అమలు చేస్తారు.

    భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా ప్రకారం, రాబోయే రోజుల్లో కూడా దిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో వాయు నాణ్యత పూర్ కేటగిరీలోనే కొనసాగవచ్చని కమిషన్ కూడా పేర్కొంది.

    గ్రాప్ – 1 అమల్లో ఉన్నప్పుడు ఇవి నిషేధం

    గ్రాప్-1 అనేది వాయు నాణ్యత మరింత క్షీణించకుండా నిరోధించడానికి అమలుచేసే నివారణ చర్యలు. వాహన, పారిశ్రామిక ఉద్గారాలను తగ్గించడం, దుమ్ముధూళిని నియంత్రించడం వంటివి ఈ చర్యల ప్రధాన లక్ష్యం.

    • బహిరంగ ప్రదేశాల్లో చెత్త, ఆకులు, ఇతర వ్యర్థాలను కాల్చడం నిషేధం.
    • ధాబాలు, కమర్షియల్ కిచెన్‌లలో బొగ్గు, కలప వాడకూడదు.
    • డీజిల్ జనరేటర్ల వాడకంపై ఆంక్షలు, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మినహాయింపు.
    • అధికంగా పొగ వెదజల్లే వాహనాలకు జరిమానా, జప్తు
    • దిల్లీలో 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలపై నిషేధం కొనసాగుతోంది.
  2. పారా ఆసియా గేమ్స్ 2026: మూడో రోజు మూడు బంగారు పతకాలు గెలుచుకున్న భారత్

    సచిన్ ఖిలారీ
    ఫొటో క్యాప్షన్, పురుషుల షాట్ పుట్ F46 విభాగంలో సచిన్ ఖిలారీ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు (ఫైల్ ఫోటో)

    జపాన్‌లోని నాగోయాలో జరుగుతున్న పారా ఆసియా గేమ్స్‌లో 2026లో భారత్ మూడో రోజు అద్భుతమైన ఆటతో మూడు స్వర్ణాలను గెలుచుకుంది.

    ఆయుష్ వర్మ, ప్రవీణ్ కుమార్, సచిన్ ఖిలారీ తమతమ విభాగాల్లో మూడు స్వర్ణాలను సాధించి దేశానికి కీర్తి తీసుకొచ్చారు.

    పురుషుల షాట్‌పుట్ ఎఫ్ 53 విభాగంలో ఆయుష్ వర్మ మూడో రోజులో మొదటి స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. పురుషుల హైజంప్ టీ 64 విభాగంలో ప్రవీణ్ కుమార్ రెండో బంగారు పతకం సాధించాడు. పురుషుల షాట్‌పుట్ ఎఫ్ 46 విభాగంలో సచిన్ ఖిలారీ మరో స్వర్ణం భారత్ ఖాతలో వేశాడు.

    మొత్తంగా మూడో రోజు భారత్ అథ్లెట్స్‌ మూడు స్వర్ణ, ఆరు రజత, 3 కాంస్యాలతో మొత్తం 12 పతకాలు గెలుచుకున్నారు.

    మూడో రోజు సాధించిన పతకాలతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 47కు చేరింది. ఇందులో 12 బంగారు, 17 రజత, 18 కాంస్యాలు ఉన్నాయి. ప్రస్తుతం పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉంది.

  3. నకిలీ పోస్టల్ స్టాంపులతో అమెరికాకు రూ.100 కోట్ల నష్టం కలిగించిన పాక్ పౌరుడి అరెస్ట్

    అమెరికా, పాకిస్తాన్,
    ఫొటో క్యాప్షన్, నకిలీ పోస్టేజ్ స్టాంపులతో అమెరికాకు వంద కోట్లకుపైగా నష్టం కలిగించిన పాకిస్తానీ అరెస్టు

    నకిలీ పోస్టల్ స్టాంపులను విక్రయించే వ్యాపారాన్ని నడుపుతున్నాడనే ఆరోపణలపై పాకిస్తాన్ సైబర్ క్రైమ్ ఏజెన్సీ ఒక వ్యక్తిని అరెస్టు చేసింది.

    ఈయన చేసిన మోసం కారణంగానే యూఎస్ పోస్టల్ సర్వీస్‌కు 126 మిలియన్ (119 కోట్ల రూపాయలు) డాలర్ల నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి.

    నిందితుడిని 33 ఏళ్ల ఫహీమ్ అక్రమ్‌గా గుర్తించారు. ఈయన ఒక నకిలీ వెబ్‌సైట్ ద్వారా యూఎస్ వినియోగదారులకు నకిలీ పోస్టల్ స్టాంపులు, షిప్పింగ్ లేబుల్‌లను విక్రయించినట్లు అభియోగాలు ఉన్నాయి.

    యూఎస్ ప్రాసిక్యూటర్ల ప్రకారం, ఫహీమ్ అక్రమ్ 2023 నుంచి లేబుల్స్‌బ్యాంక్‌ డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు. ఈ వెబ్‌సైట్ ద్వారా నకిలీ యూఎస్ పోస్టల్ స్టాంపులు, షిప్పింగ్ లేబుళ్లను విక్రయించారనే ఆరోపణలతో అధికారులు ఆ వెబ్‌సైట్‌ను మూసివేశారు.

    ఫ్లోరిడాలోని ఒక ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ గత నెలలో అక్రమ్‌పై అభియోగాలు మోపింది. ఆయన గత కొన్నేళ్లుగా వేల మంది అమెరికన్ వినియోగదారులకు 5 మిలియన్లకు పైగా నకిలీ షిప్పింగ్ లేబుళ్లను విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

    ఈ నెల ప్రారంభంలో, యూఎస్ పోస్టల్ సర్వీస్ ఆయనను పట్టుకోవడానికి తగిన సమాచారం ఇచ్చినవారికి 100,000 డాలర్ల వరకు బహుమతిని ప్రకటించింది.

  4. దలేర్ మెహందీకి అనుపమ్ ఖేర్ బాసట, దలేర్ మెహిందీకి అనుపమ్ ఖేర్ బాసట

    దలేర్ మెహిందీ, అనుపమ్ ఖేర్,
    ఫొటో క్యాప్షన్, దలేర్ మెహిందీకి అనుపమ్ ఖేర్ బాసట

    ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో జరిగిన ఓ ప్రదర్శనలో రేగిన వివాదానికి సంబంధించి పంజాబ్ గాయకుడు దలేర్ మెహిందీకి బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, రాపర్ బాద్షా అండగా నిలిచారు.

    ఈ ప్రదర్శన జరుగుతుండగా ఉత్తరాఖండ్ మంత్రి సుబోధ్ ఉనియాల్ వేదికపైకి వచ్చి తాగి పాడుతున్నావంటూ దలేర్ మెహిందీ పాటను ఆపేశారు. ఈక్రమంలో దలేర్ మెహిందీకి మద్దతుగా అనుపమ్ ఖేర్ ఓ వీడియో రిలీజ్ చేశారు. అలాగే సినీ పరిశ్రమ కూడా బాసటగా నిలవాలని కోరారు.

    ‘‘నేను ఈ మధ్య ఓ వీడియో చూశాను. అందులో దలేర్ మెహిందీజీ వేదికపై పాడుతుండగా, ఎవరో మంత్రి వేదికపైకి వచ్చి ఆయన గురించి కోపంగా మాట్లాడుతూ ఏదేదో చెప్పారు. నేను అక్కడ లేను. అందుకే దీని గురించి నాకు పెద్దగా సమాచారం లేదు. కానీ దలేర్ జీ గత పాతిక ముప్పై సంవత్సరాలుగా తెలుసు. ఆయన మద్యం సేవించరు. నేను కలిసిన మంచి మనుషులలో ఆయన ఒకరు’’ అని అనుపమ్ ఖేర్ చెప్పారు.

    ‘దలేర్‌జీ ఆరోగ్యం గత రెండుమూడేళ్లుగా సరిగా లేదు. అయినా ఆ సంస్థతో ఏదైనా కమిట్‌మెంట్ ఉండటం వల్ల ఆయనీ కార్యక్రమాన్ని తిరస్కరించలేకపోయి ఉండొచ్చు. బహుశా ఆయన కేవలం పెదాలు మాత్రమే కదిపి ఉండొచ్చు. కానీ జరిగినదానిపై చాలా బాధపడ్డా. ఎవరూ కూడా అలా మాట్లడకూడదు. ప్రత్యేకించి బహిరంగ వేదికలపై. మన పరిశ్రమలోనివారు అందరూ దీనిపై మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోవాలి’’ అని అనుపమ్ ఖేర్ చెప్పారు.

    ‘దలేర్‌జీ మీ మంచితనంపైనా, మీ వృత్తిధర్మంపైనా నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నా. ఇలాంటి ఘటన జరగడంపై విచారం వ్యక్తం చేస్తున్నా’ అని చెప్పారు.

    మరోపక్క దలేర్ మెహిందీ మద్యం తాగలేదని, ఇటీవల ఆయనకు ఆపరేషన్ జరగడం వల్ల ఆయన ఆరోగ్యం సరిగా లేదని దలేర్ సోదరుడు మికా సింగ్ స్పష్టం చేశారు.

  5. ఆసియా పారా స్పోర్ట్స్ 2026: భారత్‌ ఖాతాలో 9 స్వర్ణాలు

    సిమ్రాన్ శర్మ
    ఫొటో క్యాప్షన్, మహిళల 200 మీటర్ల T12 విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న సిమ్రాన్ శర్మ (ఫైల్ ఫోటో)

    జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా పారా క్రీడల్లో, రెండో రోజు ముగిసే సమయానికి భారత్ మొత్తం 35 పతకాలను సాధించింది.

    వీటిలో 9 స్వర్ణ, 11 రజత, 15 కాంస్య పతకాలు ఉన్నాయి.

    పురుషుల డిస్కస్ త్రో (ఎఫ్43/ ఎఫ్44/ ఎఫ్62/ ఎఫ్64 విభాగాల్లో) భారత్ క్లీన్ స్వీప్ చేసింది; దేవేంద్ర కుమార్ స్వర్ణం, రాకేష్ రజతం, ప్రదీప్ కుమార్ కాంస్య పతకాలను గెలుచుకున్నారు.

    పారా అథ్లెటిక్స్‌లో సిమ్రాన్ శర్మ మహిళల 200 మీటర్ల టీ12 విభాగంలో 24.80 సెకన్ల రికార్డు సమయంతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.

    వీరితో పాటు ప్రీతి పాల్, మనీష్ నర్వాల్, పారా పవర్‌లిఫ్టర్ అశోక్ కుమార్ మాలిక్ రజత పతకాలను గెలుచుకున్నారు.

    హోకాటో హోటోజె, ప్రవీణ్ శర్మ, ఆయుష్ వర్మ, నిరంజన్ ముకుందన్ కాంస్య పతకాలు సాధించారు. భారత క్రీడాకారులు పారా టేబుల్ టెన్నిస్, షూటింగ్‌లో కూడా పతకాలను గెలుచుకున్నారు.

    పతకాల పట్టికలో భారత్ ఆరో స్థానంలో కొనసాగుతుండగా, చైనా 149 పతకాలతో మొదటి స్థానంలో ఉంది.

  6. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి ఖగేష్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈలింక్‌ను క్లిక్ చేయండి.