You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాన్ చరిత్ర: హిజాబ్‌కు వ్యతిరేకంగా దశాబ్దాలుగా మహిళల పోరాటం
ఇరాన్‌లో ఇప్పుడు హిజాబ్ వ్యతిరేక ఉద్యమం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది.
చరిత్రలో ఆ దేశాన్ని కుదిపేసిన కొన్ని ఆందోళనలను ముందుండి నడిపించింది మహిళలే.
తమ ప్రాథమిక హక్కైన స్వేచ్ఛ కోసం, హిజాబ్‌ను తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను వ్యతిరేకిస్తూ చేస్తున్న పోరాటం... ఈనాటిది కాదు.
మరి ఈ పోరాటం ఎప్పుడు మొదలైంది? దాని చరిత్రేంటి? బీబీసీ ప్రతినిధి రాణా రహింపూర్ అందిస్తున్న కథనం.
వేర్వేరు మహిళలు.
వేర్వేరు తరాలు.
స్వేచ్ఛ కోసం ఇంకా కొనసాగుతోన్న పోరాటం .
1979లో ఇస్లామిక్ విప్లవం జరిగిన వెనువెంటనే మొదలైంది ఈ పోరాటం.
ఇస్లామి విప్లవం తర్వాత నెల రోజులు గడవకుండానే మహిళలకు డ్రెస్ కోడ్ పెట్టారు. తల మీదుగా హిజాబ్ ధరించాలన్నారు.
దానిని వ్యతిరేకిస్తూ మహిళలు మార్చ్ నిర్వహించారు.
‘‘షా చదోర్‌ను బలవంతంగా తొలగించారు. కానీ వీళ్ళు మళ్ళీ దాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారు’’ అంటూ 1979లో ఉద్యమిస్తున్న మహిళలు చెప్పారు.
దీనికి నిరసనగా మహిళలు అప్పట్లో రోడ్డెక్కారు.
''కొత్త ఇస్లామిక్ రిపబ్లిక్‌లో, కొత్త ప్రభుత్వ పాలనలో తమ హక్కులను కోల్పోతామని చాలా మంది మహిళలు అర్థం చేసుకున్నారు'' అని మహిళా హక్కుల కార్యకర్త షాదీ అమిన్ అన్నారు.
షాదీ అమిన్ ఆమె పినతల్లి కూడా ఆ నిరసనల్లో పాల్గొన్నారు.
''ఆ నిరసన ప్రదర్శనకు ముందు రోజు మా పిన్ని ఇంట్లో మేమంతా మాట్లాడుకున్నాం. నల్లరంగు హిజాబ్ ధరించి ఆ ప్రదర్శనలో పాల్గొని, దానిపై నిరసన తెలుపుతానని మా పిన్ని చెప్పారు'' అని షాదీ అమిన్ తెలిపారు.
1979నాటి ఇస్లామిక్ విప్లవపు తొలి వారాల వీడియోలను నేను చూశాను. మొదటిరోజు నుంచీ మహిళలు తమకు స్వేచ్ఛ, సమానత్వం కావాలని పోరాడారని చాలా వీడియోల్లో స్పష్టమౌతోంది. ముఖ్యంగా మహిళలు తమకు సమానత్వం కావాలని కోరారు.
వ్యతిరేకతల మధ్యే 1983లో హిజాబ్‌ను తప్పనిసరి చేస్తూ ఓ చట్టం చేశారు.
మహిళలు తమ ప్రాథమిక హక్కుల్లో చాలా వాటిని కోల్పోయారు.
''ఆ కాలంలో నైతిక పోలీసులు ఉండేవారు కాదు. కమిటీలు మాత్రమే ఉండేవి. వాళ్ళు వీధుల్లో మహిళలపై పెత్తనం చెలాయించేవారు. అరాచకంగా వ్యవహరించేవారు. అన్ని దుకాణాల్లోనూ 'హిజాబ్ లేని మహిళలను లోపలికి అనుమతించం' అని రాసిన బోర్డులు పెట్టించారు'' అని షాదీ అమిన్ వెల్లడించారు.
కొన్ని దశాబ్దాల పాటు మహిళలు తమ ప్రతిఘటనను ఏదో రూపంలో ప్రకటిస్తూనే వచ్చారు. హిజాబ్‌ను అంతంత మాత్రంగానే ధరించసాగారు.
2018లో మొదటిసారిగా ఈ మహిళ ఓ నిరసన ప్రదర్శనలో హిజాబ్‌ను తొలగించి, ఐకాన్‌గా నిలిచారు.
''మహిళలు చూపిన తెగువకు ఇది ప్రారంభం మాత్రమే. ఎందుకంటే, నాకు ప్రాధాన్యం ఉంది, నేను ఏదైనా సాధించగలను అని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు'' అని షాదీ అమిన్ చెప్పారు.
ఈరోజు చాలా మంది మహిళలు ఇరాన్ వీధుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. వాళ్ళు ఇక ఏ మాత్రం ఒంటరి కాదు.
ఇప్పుడు ఎక్కువ మంది పురుషులు వారికి మద్దతుగా నిలబడుతున్నారు. మునుపటి తరం మహిళల లాగానే నేటి తరం కూడా హిజాబ్‌లను గాల్లో ఎగరేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది.. ఈ ‘విధ్వంసానికి’ 5 కారణాలు..
- తెలంగాణ: ‘చూపు పోయింది.. వరంగల్‌లో అడుక్కుని బతకమన్నారు.. 50 ఏళ్లుగా నేను ఏం చేస్తున్నానంటే..’
- జనాభా నియంత్రణ గురించి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు.. టార్గెట్ ముస్లింలు, క్రైస్తవులేనా?
- శ్రీకాకుళం జిల్లా: బట్టలు ఉతకం అన్న రజకులు.. ఇతర కులాల సహాయ నిరాకరణ.. ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మెక్సికోలో అగంతకుల కాల్పులు, మేయర్ సహా 18మంది మృతి
- రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?
- డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక: ఈ పిల్లల దగ్గు మందులతో జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే ప్రమాదం.. గాంబియాలో 66 మంది చిన్నారుల మృతి..
- ప్రపంచ ఆక్టోపస్ దినం: చేతిలో చేయివేస్తే చాలు పిల్లలు పుట్టేస్తాయి.. ఆక్టోపస్‌ల గురించి 10 ఆసక్తికర విశేషాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)