You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్‌లో పంజాబ్ రాజకీయ సంక్షోభం.. కోల్పోయిన అధికారాన్ని మళ్లీ పొందిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ
పాకిస్తాన్‌లోని కీలక రాష్ట్రం పంజాబ్‌లో గత ఏప్రిల్‌లో మొదలైన రాజకీయ దుమారం ఇప్పటికీ సద్దుమణగడం లేదు.
రాష్ట్రంలో ఈ యేడాది మొదట్లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపు సాధించిన ఇమ్రాన్ ఖాన్... అధికారంపై కోల్పోయిన పట్టును మళ్లీ సాధించారు.
కానీ కేంద్రంలో మాత్రం ఇప్పటికీ ఆయన ప్రత్యర్థులే అధికారంలో ఉన్నారు.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడాలంటే మళ్లీ ఎన్నికలు నిర్వహించడమే పరిష్కారం అంటున్నారు విశ్లేషకులు.
బీబీసీ ప్రతినిధి షుమాయిలా జాఫ్రీ అందిస్తున్న ప్రత్యేక కథనం.
పాకిస్తాన్ రాజకీయాలకు పంజాబ్‌ను కేంద్రబిందువుగా భావిస్తారు. ఎందుకంటే, పంజాబ్‌లో ఎవరు గెలిస్తే ఇస్లామాబాద్‌లో అధికారం వాళ్లదే అవుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ జరిగే ఎన్నికలకు ప్రాధాన్యం ఎక్కువ. అయితే, ఇటీవల 20 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలను అత్యంత నిర్ణయాత్మకమైనవిగా భావించారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పదిహేను స్థానాలు గెలుచుకుంది. కానీ చివరి నిమిషంలో జరిగిన రాజకీయ ఏమార్పుల కారణంగా అధికారం మాత్రం PML-Nకు చెందిన హమ్జా షాబాజ్ షరీఫ్‌కే దక్కింది. దాంతో, ఇప్పటికే రాజకీయ తుఫాన్లలో చిక్కుకుపోయిన పాకిస్తాన్‌లో ఇది మరో సంక్షోభంగా మారింది.
PML-Nకు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడాన్ని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ వ్యతిరేకించింది. సుప్రీంకోర్టులో దీనిపై ఓ పిటిషన్ వేసింది.
మూడు రోజుల పాటు తీవ్రస్థాయిలో జరిగిన విచారణ తర్వాత, నిరంతర రాజకీయ ఒత్తిళ్ల వాతావరణంలో సుప్రీంకోర్టు.. ఇమ్రాన్ ఖాన్, ఆయన భాగస్వాములకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఫలితంగా, ఇమ్రాన్, ఆయన మద్దతుదారులు అతి పెద్ద రాష్ట్రమైన పంజాబ్‌లో మళ్లీ అధికారం చేపట్టగలిగారు. ఇప్పటికే, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్, గిల్టిట్ బాల్టిస్తాన్, పాక్ పాలిత కశ్మీర్‌లలో ఆయన పార్టీనే అధికారంలో ఉంది.
ఏప్రిల్‌లో ప్రభుత్వం పడిపోయిన తర్వాతి నుంచి ముందస్తు ఎన్నికలు జరిపించాలనేదే ఇమ్రాన్ ఖాన్ ఏకైక డిమాండుగా ఉంది. ఇప్పుడు రాజకీయంగా తాను ఏదైనా సాధించగలననే ధీమాతో ఆయన ఉన్నారని విశ్లేషకుల అభిప్రాయం. అయితే, ఇప్పుడు మరో పెద్ద సవాలు ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ ముందుంది.
ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్-ఏ-పాకిస్తాన్‌కు విదేశీ నిధులు అందాయన్న కేసు గత కొన్నేళ్లుగా ఎలక్షన్ కమిషన్ ముందు పెండింగ్‌లో ఉంది. దానిపై తీర్పును రిజర్వ్ చేశారు. ఆ తీర్పు ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా వస్తే, ఆయనపై అనర్హత వేటు పడొచ్చు. లేదా పూర్తిగా ఆయన పార్టీనే రద్దు చేయాల్సి రావచ్చు.
అదే గనక జరిగితే, పాకిస్తాన్‌లో మరో ఉపద్రవం తప్పదు. మరింత రాజకీయ వేడి, ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఆర్థికవ్యవస్థపై మరింత ఒత్తిడి కూడా పెరగక తప్పవు.
ఇస్లామాబాద్‌లో PML-N ప్రభుత్వం, వారి కూటమి చాలా బలహీన పడింది. పంజాబ్ ముఖ్యమంత్రిత్వంపై తమకు వ్యతిరేకంగా తీర్పు వచ్చాక, కోర్టులను, న్యాయమూర్తులను వాళ్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
ఇంతకు ముందు, ఇమ్రాన్ ఖాన్, ఆయన మద్దతుదారులు తమ ప్రసంగాల్లో పాకిస్తానీ సైన్యాన్ని, జనరల్ బాజ్వాను బాహాటంగానే టార్గెట్ చేస్తుండేవారు. ఈ వాతావరణంలో పాకిస్తాన్‌లో వ్యవస్థల మధ్య పోరు రాజుకుంటుందని విశ్లేషణకులంటున్నారు. ఇప్పుడు గ్రాండ్ పొలిటికల్ డిబేట్ గురించి చర్చ జరుగుతోంది. ఈ సంఘర్షణ మరింత ఉగ్రరూపం దాల్చకుండా... ఏ పక్షం ఎంత వరకు వెనక్కి తగ్గుతుందనేది చూడాల్సే ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్లే ఈ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందా?
- బీజీఎంఐ: పబ్జీకి ప్రత్యామ్నాయంగా మారిన ఈ గేమ్‌ను భారత్ ఎందుకు బ్లాక్ చేసింది?
- ఒబేసిటీ: భారతదేశపు చిన్నారుల్లో పెరుగుతున్న ఊబకాయులు, కారణాలు ఇవే
- ఓఆర్ఎస్: డయేరియా నుంచి ప్రాణాలు కాపాడే సంజీవని ఇది, నిర్లక్ష్యం చేస్తున్నామా
- దేశంలో ఒంటరి మహిళల సంఖ్య ఎందుకు పెరుగుతోంది...వీరికి పెళ్లి మీద మనసు విరగడానికి కారణాలు ఏంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)