You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
థాయిలాండ్: గుహలో చిక్కుకుపోయిన టీనేజి ఫుట్‌బాల్ ఆటగాళ్ల రెస్క్యూ ఆపరేషన్‌పై హాలీవుడ్ సినిమా
ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన మర్చిపోలేని కథల్లో ఇది కూడా ఒకటి. ఫుట్‌బాల్ ఆడే బాలలు కోచ్‌తో సహా వరద నీటితో నిండిన గుహలో చిక్కుకున్నప్పుడు వారిని రక్షించిన కథ ఇది.
వందల మంది థాయ్ సైనికులు, అధికారులు, నౌకాదళానికి చెందిన గజ ఈతగాళ్లు, ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాలంటీర్లు ఆ పిల్లల్ని కాపాడే ప్రమాదకరమైన రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. థాయిలాండ్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. చివరకు 18 రోజుల తర్వాత కోచ్ సహా పిల్లలంతా ప్రాణాలతో బయటపడ్డారు. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రోనో హోవార్డ్ ఈ సంఘటన ఆధారంగా ఓ సినిమా నిర్మించారు. నాటి రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా గుహ దగ్గర నుంచి రిపోర్ట్ చేసిన బీబీసీ ప్రతినిధి జోనాథన్ హెడ్ అందిస్తున్న కథనం.
దక్షిణ సరిహద్దుల్లోని మెసాయ్ టౌన్‌లో మధ్యాహ్న శిక్షణ సమయం. ఈ యువ ఫుట్‌బాల్ క్రీడాకారుల్లో ఇద్దరు... నాలుగేళ్ల క్రితం జరిగిన అవిస్మరణీయమైన నాటకీయ సంఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.
12 మంది అబ్బాయిలు, వారి కోచ్ ఒక గుహ లోపలకు వెళ్లాక అందులోకి వరద నీరు చేరడంతో 9 రోజులు అందులోనే చిక్కుకుపోయారు. ఆ సంఘటన ప్రపంచాన్ని కట్టి పడేసింది. వారందరిలోకి టైటన్ చిన్నవాడు. అప్పుడతనికి 11 ఏళ్లు. ఇప్పుడు .. నాడు తన ప్రాణాలు కాపాడిన కోచ్ ఏక్కాపోల్ చంటావాంగ్ దగ్గరే ఫుట్‌బాల్ ఆటలో శిక్షణ తీసుకుంటున్నాడు. వారి కథను ఇప్పుడు హాలీవుడ్ ప్రపంచానికి చెప్పబోతోంది..
గుహలో చిక్కుకుపోయిన ఫుట్‌బాల్ టీమ్ గురించి రిపోర్టింగ్ చేసిన అనేక మంది రిపోర్టర్లలో నేను కూడా ఒకడిని. గుహ పైనున్న కొండకోనల్లో తిరుగుతూ వెళ్లాను, అది ఎలా ముగుస్తుందో అప్పటికి మాకెవ్వరికీ తెలియదు.
నాలుగేళ్ల క్రితం నేను మొదటిసారి ఇక్కడకు వచ్చినప్పుడు, ఈ రెయిలింగ్‌కు ఆనుకుని పిల్లల సైకిళ్లు ఉన్నాయి. వారంతా నా కొడుకు వయసు వాళ్లే. అప్పట్లో నాలో కలిగిన భావోద్వేగాలు ఇప్పటికీ గుర్తున్నాయి. వాళ్లందరూ ప్రాణాలతో బయటకు రావడం దాదాపు అసాధ్యం అనుకున్నాం. నేను రిపోర్ట్ చేసిన అనేక కథనాల్లోకెల్లా ఇది అసాధరణమైందని భావిస్తాను. ఎప్పటికీ గుర్తుండి పోయే రెస్క్యూ ఆపరేషన్ అది.
ఆ పిల్లలు ఈ మార్గం గుండానే లోపలకు వెళ్లారు. అప్పటికి అంతా పొడిగానే ఉంది. కొన్ని గంటల్లోనే అంతా తారుమారైంది.
థామ్ లోంగ్ గుహలపై సాగిన అన్వేషణలో బ్రిటిష్ నిపుణుడు వెర్న్ అన్స్‌వర్త్ పదేళ్లు గడిపారు. అత్యంత ప్రమాదకరమైన ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం ప్రపంచంలోనే అత్తుత్తమ కేవ్ డైవర్స్‌ను తీసుకురావడంలో ఆయనదే కీలక పాత్ర.
ఆ పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్లయ్యారు. కొంత మంది మా సెయ్‌ని వదిలేసి వెళ్లారు.
టైటన్ మంచి ఫుట్‌బాలర్ కావాలనుకుంటున్నాడు. అనుకోకుండా వచ్చి పడిన పేరు ప్రఖ్యాతులతో ఎలా వ్యవహరించాలో అతడు తెలుసుకున్నాడు.
''మొదట్లో చాలా కష్టంగా ఉండేది. తర్వాత అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే నా గురించి చాలా మందికి తెలుసు. అప్పట్లో ఎలా స్పందించాలో తెలిసేది కాదు. కెమెరా ముందు నిల్చున్నప్పుడు, ఇంటర్వూలు ఇచ్చేటప్పుడు ఒత్తిడికి లోనయ్యేవాడిని. ఆ తర్వాత అలవాటు చేసుకున్నాను. ఎలా ప్రవర్తించాలో ఇప్పుడు నాకు బాగా తెలుసు'' అని టైటన్ అన్నాడు.
ఈ పర్వాతాలల్లో జరిగిన సంఘటనలకు ఇప్పటికీ ఆశ్చర్యపరిచే, స్ఫూర్తినిచ్చే శక్తి ఉంది.
ఆ రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా ఒక డైవింగ్ వాలంటీర్ మరణించడం... పన్నెండు మంది బాలలను, వారి కోచ్‌ను సురక్షితంగా బయటకు తెచ్చిన ఓ అద్భుత ఘటనలో ఒక విషాద పార్శ్వం అని చెప్పొచ్చు.