పాకిస్తాన్: కరాచీలో చార్మినార్ దగ్గర దోశ పాయింట్.. మసాలా దోశ రూ.300, చికెన్/కీమా దోశ రూ.400

పాకిస్తాన్‌లోని అతి పెద్ద నగరమైన కరాచీలో వివిధ రకాల అంతర్జాతీయ వంటకాలు లభిస్తాయి.

ఈ ప్రాంతం సంప్రదాయ భారతీయ వంటకాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా దోశ లాంటి వంటకాలిక్కడ దొరుకుతాయి.

ఇక్కడ అనేక రెస్టారెంట్లలో దోశ లభిస్తోంది. ఇటీవల కాలంలో దోశ స్ట్రీట్ ఫుడ్ గా కూడా బాగా ప్రాముఖ్యం చెందింది.

కరాచీ నుంచి బీబీసీ ప్రతినిధి షుమైలా ఖాన్ అందిస్తున్న కథనం.

కరాచీలో దక్కన్ హైదరాబాద్ జ్ఞాపకార్ధం చార్మినార్ కూడా నిర్మించారు.

సూర్యాస్తమయం అవ్వగానే, ఇక్కడకు కొన్ని కుర్చీలు, టేబుళ్లతో సహా వస్తారు.

వాళ్లందరికీ దోశ కావాలి.

ఫరాసత్ అద్నాన్ 1997 నుంచీ దోశలు వేస్తున్నారు. ఆయనకు ఫుడ్ అండ్ బెవెరేజెస్ లో డిప్లొమా ఉంది.

మలేసియా, సింగపూర్‌లో కొన్నాళ్ళు ఉండి వచ్చిన తర్వాత ఆయన సొంతంగా వ్యాపారం మొదలుపెట్టారు.

‘‘ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా దోశ కనిపిస్తుంది. మీరు అమెరికా, కెనడా ఎక్కడకు వెళ్లినా దోశ దొరుకుతుంది. మేము పరాఠా తింటాం. పరాఠా చేసేందుకు చాలా నూనె వాడతాం. పరాఠా తయారు చేసేందుకు ఆరు టేబుల్ స్పూన్ల నూనె, ఆరు టేబుల్ స్పూన్ల వెన్న వాడతాం. అదే దోశ అయితే, ఒకే ఒక్క టేబుల్ స్పూన్ తో చేస్తాం. ఇది కరకరలాడుతూ ఉంటుంది. దీనిని ఎక్కువ నూనెలో వేపకపోవడం వల్ల తొందరగా జీర్ణం కూడా అవుతుంది’’ అని దోశ పాయింట్ యజమాని అయిన ఫరాసత్ అద్నాన్ బీబీసీతో అన్నారు.

కరాచీలో ప్రజల రుచులకు అనుగుణంగా కూరగాయలతో పాటూ చికెన్, కీమా కూడా కలిపి తయారు చేస్తున్నారు. ఇక్కడ మసాలా దోశ 300 రూపాయలు, కీమా, చికెన్ దోశలు అయితే ఒక్కోటీ 400 రూపాయలు.

ఎంతో మంది పాకిస్తానీయులు దోశను ఇష్టంగా తింటున్నారు. దక్షిణ భారతీయ వంటకం అయిన దోశ వారికి ఎంతగానో నచ్చింది.

‘‘ఇక్కడ బిరియాని, కుర్మాను మాత్రమే ఉత్తమమైన ఆహారంగా పరిగణించే అలవాటు ఉంది. నెమ్మదిగా పిజ్జా వచ్చింది. దాని గురించి అందరికీ తెలిసింది. చైనా , ఆఫ్రికాకు చెందినవారు కూడా నా దగ్గరకు వస్తూ ఉంటారు. వారికి స్థానిక వంటకాల గురించి ఏమీ తెలియదు. కానీ, వారు నా దగ్గర దొరికే దోశ వంటకాలు తినేందుకు అలవాటు పడ్డారు. వారు తరచుగా ఇక్కడకు వస్తూ ఉంటారు. కొంత మంది అయితే, గత పదేళ్లుగా నా దగ్గరకు వస్తున్నారు’’ అని ఫరాసత్ అద్నాన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)