జర్మనీ: కోవిడ్ 19కు తొలి వ్యాక్సీన్ తయారు చేసిన దేశంలోనే వ్యాక్సీన్లు వేయించుకోని ప్రజలు

జర్మనీ కోవిడ్ నాల్గవ వేవ్‌ను చవి చూస్తోంది. రోజురోజుకీ రోగుల సంఖ్య పెరుగుతుండటంతో వాక్సీన్ తీసుకోని వారిని బార్లు, రెస్టారెంట్లకు అనుమతించవద్దంటూ ఆంక్షలు విధించారు అధికారులు.

మహమ్మారి మొదలైనప్పటి నుంచి జర్మనీలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అతి త్వరలో ఆసుపత్రులలో రోగులకు బెడ్లు దొరకడం కూడా కష్టమంటోంది జర్మనీ.

వాక్సీనేషన్ రేటు అత్యంత తక్కువగా ఉన్న సాక్సనీ నుంచి బీబీసీ ప్రతినిధి జెన్నీ హిల్ అందిస్తున్న కథనం.

లైప్‌జిగ్ హాస్పిటల్ ఐసీయూ కరోనా రోగులతో నిండిపోతోంది. ఇక్కడున్న 18 మంది కరోనా పేషెంట్లలో నలుగురు మాత్రమే వాక్సీన్ తీసుకున్నారు.

‘‘ఇది నాలుగో వేవ్. రోగులుకు చికిత్స అందించేలా సిబ్బందిని మోటివేట్ చేయడం కష్టంగా ఉంటోంది. ఇక్కడ చాలా మంది ప్రజలు ఇంకా కరోనాను తేలికగా తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి మిత్రులకో, కుటుంబ సభ్యులకో వైరస్ సోకింది. కాబట్టి వారు ప్రమాద తీవ్రతను అర్థం చేసుకొని ఉండాలి. కానీ వాక్సీన్ తీసుకోకుండా ఆసుప్రతుల పాలవుతున్న రోగులను ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం’’ అని లైప్‌జిగ్ యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన ప్రొఫెసర్ సెబాస్టియన్ అన్నారు.

కరోనా వ్యాక్సీన్లను వ్యతిరేకించే జర్మన్లు కోపంతో ఉన్నారు. 12 ఏళ్లు దాటిన జనాభాలో కోటీ అరవై లక్షల మంది ఇప్పటికీ వాక్సిన్ తీసుకోలేదు. ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉన్న సాక్సనీలో దేశంలోనే అత్యంత తక్కువ మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోని వారిని రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, స్పోర్ట్స్ స్టేడియాలకు వెళ్లనీయకుండా ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు.

‘‘ఇది వివక్ష చూపడమే. మా సమాజంలో ఇటువంటి తీరును మేం సహించం. వాక్సిన్ మంచిదేనని, మా పిల్లలకు కూడా ఇవ్వాలని వాళ్లు చెబుతున్నారు. కానీ అది ఎప్పటికీ జరగదు. నా రక్తంలోకి వాక్సిన్ వెళ్లడాన్ని ఎన్నటికీ ఒప్పుకోను. దీని కోసం ఎంత వరకు పోరాడాలో అంత వరకు పోరాడతాం’’ అని లీఫ్ హాన్సెన్ అనే నిరసనకారుడు చెప్పారు.

కానీ మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారేమోనని చాలా మంది భయపడుతున్నారు. పోయిన ఏడాది నదీన్ బార్ అతి కష్టంగా గడిచింది. అధికారులు చెప్పక ముందే వాక్సిన్ తీసుకోని వారిని ఆమె నిషేధించారు.

‘‘వ్యాపారం మూతపడేలా ఉంది. పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయనుకునే లోపే మళ్లీ సమస్యలు వస్తున్నాయి. ఇతరుల గురించి పట్టించుకోకుండా వ్యాక్సిన్లను వ్యతిరేకిస్తున్న వారిని చూస్తుంటే కోపంగా ఉంది’’ అని నదీన్ హెర్జాగ్ అన్నారు.

చాలా మంది ఆలోచనా తీరు మారుతోందనడానికి నిదర్శనంగా వాక్సీన్ సెంటర్ల దగ్గర పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి.

జర్మనీలో ఇప్పటికే బూస్టర్ డోసులు ఇస్తున్నప్పటికీ పరిస్థితి దిగజారుతుందనే భయాలున్నాయి. కరోనా పేషెంట్ల కోసం ఆపరేషన్లు, ఇతర ట్రీట్మెంట్లను కొన్ని ఆస్పత్రుల్లో నిలిపివేశారు.

నాలుగో వేవ్ మరింత దారుణంగా ఉండొచ్చని ఇక్కడి డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఆసుపత్రుల్లో చేరే వారిలో సగం మంది చనిపోతారని చెబుతున్నారు.

ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసిన జర్మనీలో, ఇటువంటి పరిస్థితులు ఆ దేశానికే అవమానం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)