కిమ్‌ ముందు సైనికుల సాహసాలు

ఉత్తరకొరియా సైనికులు తమ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ ఎదుట సైనిక విన్యాసాలు ప్రదర్శించారు.

మెడతో ఇనుప రాడ్లు వంచడం, కాంక్రీట్‌ దిమ్మెలు పగలగొట్టించుకోవడం, గొలుసులు తెంచడం వంటి సాహసాలను ప్రదర్శించారు.

కాగా... 'ఎదురులేని సైనిక శక్తి'ని నిర్మిస్తామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. అమెరికా వైరి విధానాలు అనుసరిస్తున్న నేపథ్యంలో కిమ్ ఈ ప్రకటన చేశారని స్థానిక అధికారిక మీడియా రిపోర్ట్ చేసింది.

ఆయుధాల తయారీ అంతా ఆత్మరక్షణ కోసమేనని, యుద్ధం ప్రారంభించడానికి కాదని కిమ్ అన్నారు. రకరకాల భారీ క్షిపణులతో రక్షణ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకిస్తూ కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉత్తర కొరియా ఇటీవలే సరికొత్త హైపర్సోనిక్, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ మిసైళ్లను పరీక్షించింది. ఇదే సమయంలో దక్షిణ కొరియా కూడా సబ్ మెరీన్ నుంచి ప్రయోగించే క్షిపణిని పరీక్షించింది.

ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ లో నిర్వహించిన 'సెల్ఫ్ డిఫెన్స్ - 2021' ప్రదర్శన వద్ద ప్రసంగించిన కిమ్, తన పొరుగుదేశంతో యుద్ధం చేయాలని తమకు లేదని దక్షిణ కొరియాను ఉద్దేశించి అన్నారు.

"మేం యుద్ధం గురించి మాట్లాడడం లేదు. కానీ, యుద్ధాన్ని నివారించడం గురించి మాట్లాడుతున్నాం. జాతీయ భద్రత కోసం యుద్ధ నిరోధక సంపత్తిని పెంచుకుంటున్నాం" అని కిమ్ అన్నారు. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య అమెరికా చిచ్చు పెడుతోందని ఆయన ఆరోపించారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చాలా సార్లు ఉత్తర కొరియాతో చర్చలకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే, ఆంక్షలు సడలించాలంటే ఆ దేశం ముందుగా అణ్వస్త్రాలను వదిలేయాలని బైడెన్ డిమాండ్ చేశారు. ఆ డిమాండ్‌ను ఉత్తర కొరియా మొదటి నుంచీ తిరస్కరిస్తూ వస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)