కుంచె పట్టిన ఆయన కాళ్లు చేతులను మించిపోయాయి

వీడియో క్యాప్షన్, ఓ చిత్రకారుని కథ

పుట్టుకతోనే రెండు చేతులూ లేవు. నిరుపేద కుటుంబం. ఆపై వైకల్యాన్ని చూసి బిచ్చమెత్తుకోవచ్చు కదా అన్న సలహాలు. అయినా సరే ఆయన నిరుత్సాహ పడలేదు. అద్భుతమైన కళాకారునిగా ఎదిగారు. గేలి చేసిన వారే గౌరవించే స్థాయికి చేరారు. కష్టాలకు ఎదురీదిన ఆ యువ చిత్రకారుడి కథ అందరికీ స్ఫూర్తిదాయకం.

"నాకు ఏదైనా నచ్చింది కనిపిస్తే వెంటనే పెన్సిల్ లేదా కుంచె తీసుకొని దాన్ని చిత్రీకరించడం మొదలుపెడతా.. చిత్రలేఖనం కంటే ఆనందాన్ని, ఉపశమనాన్నీ ఇచ్చేది ఇంకేదీ లేదు’’ అంటారు బందన్వాజ్ నడాఫ్.

ముంబయికి చెందిన ఆయనకు పుట్టుకతోనే రెండు చేతులు లేవు.

14 ఏళ్ల వరకు పాఠశాలకు కూడా వెళ్లలేదు. కారణం.. ఎవరూ ఆయన్ను చేర్చుకోకపోవడమే.

చివరకు.. వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పాఠశాలలో ఆయనకు అడ్మిషన్ దొరికింది. అక్కడే తనలోని కళకు సానపట్టారు.

చేతులు లేకున్నా తనకెంతో ఇష్టమైన చిత్రలేఖనాన్ని నిత్యం ప్రాక్టీస్ చేశారు. కాళ్లతోనే కుంచె పట్టుకుని అద్భుతమైన బొమ్మలు గీశారు.

పాఠశాలకు చెందిన ట్రస్టీలు బందన్వాజ్ ప్రతిభను గుర్తించి ఆయన కోసం ప్రత్యేకంగా చిత్రలేఖన తరగతులు ఏర్పాటు చేశారు.

కొద్ది రోజుల్లోనే ఆయన ప్రతిభ అందరికీ తెలిసింది.

జహింగీర్ ఆర్ట్ గ్యాలరీలో ఆయన చిత్రాలను ప్రదర్శించారు.

రెండేళ్ల క్రితం ఇండియన్ మౌత్ అండ్ ఫుట్ పెయింటర్స్ అసోసియేషన్‌ ఆయన ప్రతిభకు ప్రోత్సాహం అందించింది.

ఈ తరహా చిత్రకారుల ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుంది ఈ సంఘం.

ఈ సంఘాన్ని మొదట స్విట్జర్లాండ్ లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ సంఘంలో 800 మంది కళాకారులు సభ్యులుగా ఉన్నారు.

ప్రస్తుతం బందన్వాజ్ నెలకు 30 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు.

"జీవితంలో ఎప్పుడు నాపై నేను నమ్మకం కోల్పోను. చాలా మంది ఏ గుడి ముందో, మసీదు ముందో బిచ్చమెత్తుకోవచ్చు కదా అంటూ హేళన చేశారు. కానీ నేను ఆ దారిలో వెళ్లదల్చుకోలేదు.

గౌరవప్రదంగా జీవించాలనుకుంటున్నా" అంటారాయన.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)