You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
2018లో తుపానులు మళ్ళీ విరుచుకుపడతాయా?
గత సంవత్సరం అంటే 2017లో ప్రపంచ దేశాలన్నీ అసాధారణ వాతావరణాన్ని ఉష్ణోగ్రతల పెరుగుదల చూశాయి. అట్లాంటిక్ మహా సముద్రం నుండి ఉత్పన్నమైన హార్వీ, అర్మా, మరియా వంటి తుపానులు ఊహకందని బీభత్సాన్ని సృష్టించాయి.
అయితే 2018 లో ఇటువంటి తుపానులు మరిన్ని చూడబోతున్నామా? మే లోపు ఈ విషయంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎల్నినో వంటి పరిస్థితుల ప్రభావం తుపాన్లపై ఉంటుంది.
అయితే ఆఫ్రికా దగ్గరలోని అట్లాంటిక్ మహా సముద్రపు ఉపరితల వేడి సాధారణం కంటే ఎక్కువగా ఉంటే 2017 లాగానే ఈ సంవత్సరం కూడా మళ్ళీ తుపానులు విరుచుకుపడచ్చు. ఇక భూ ఉష్ణోగ్రతల పెరుగుదల విషయం గమనిస్తే 2017లో కొత్త రికార్డులు నమోదు కాకపోయినా, 2017 నమోదయ్యింది. ఇప్పటివరకు 21వ శతాబ్దం అత్యంత వేడైన శతాబ్దం. వాతావరణ కంప్యూటర్ ‘మోడల్స్’ అంచనా ప్రకారం 2018లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉండబోతున్నాయి.
అయితే వాతావరణ పరిస్థితి కొద్దిగా క్లిష్టంగా ఉంటుంది. భూగ్రహం మొత్తం ఒకేరకంగా వేడెక్కదు. ఉదాహరణకు, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉత్తర ధ్రువ ప్రాంతంలోని మంచు కొండలు త్వరగా కరిగిపోతున్నాయి. ఆ కరిగిపోయిన మంచు వల్ల ఉత్తర అట్లాంటిక్లోని నీరు చల్లబడిపోతుంది. దీని ఫలితంగా అక్కడి ఉపరితలం మీద ఎటువంటి వేడి ఉన్నా అది చల్లబడిపోతుంది.
ఇక పసిఫిక్లో ఎల్నినో, లా నీనా లాంటి పరిస్థితులపై శాస్త్రవేత్తలు 2018లో ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఇవి కొన్నేళ్ళకు ఒకసారి ఏర్పడే పరిస్థితులు.. చాలా ముఖ్యమైనవి కూడా. ఎందుకంటే ఇవి ప్రపంచవ్యాప్తంగా మనకి సాధారణంగా కనిపించే వాతావరణంలో పెను మార్పులు తీసుకువస్తాయి.
ఉదాహరణకు ఈ సంవత్సరం ఎల్నినో ఏర్పడితే అట్లాంటిక్ మహా సముద్రంలో భీకర తుపానులు సంభవించకుండా ఉంటాయి. ఎందుకంటే ఎల్నినో వల్ల భూమధ్యరేఖ వెంబడి గాలి ప్రవాహాలలో మార్పులు సంభవించి తూపాన్లు శక్తిమంతంగా మారక ముందే చెదిరిపోతాయి. ప్రస్తుతం వాతావరణంలో ఒక బలహీన లా నీనా పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎల్నినో కు పూర్తి విరుద్ధమైన పరిస్థితి. అయితే చాలా సార్లు లా నినా తరువాత వెంటనే ఎల్నినో ఏర్పడుతుంది.
2018లో వాతావరణం గురించి అంచనాలు వేయడం కష్టమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాతావరణ చిత్రంలో చాలా క్లిష్టమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇవి ఒకదానిపై ఒకటి ప్రభావం చూపించచ్చు. అయితే 2018లో వాతావరణ పరిస్థితులు చాలా ఆసక్తికరంగా ఉంటాయన్న దాంట్లో మాత్రం సందేహం లేదు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)