వెరైటీగా ఆలోచించాడు.. ముత్యాలు సాగు చేస్తున్న యువ రైతు

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన ఈ యువ రైతు పేరు సంజయ్ గండాటే. వైన్ గంగా నది ఒడ్డున ఉన్న తన గ్రామం పార్దీ కుపిలో ఈయన ముత్యాలు సాగు చేస్తున్నారు. సంజయ్ తన చిన్నతనంలో ముత్యపు చిప్పలతో ఆడుకునేవారు. కానీ, అవే తనకు జీవనాధారం అవుతాయని ఎప్పుడూ అనుకోలేదు.

సంజయ్ 2012లో ఓ చిన్న చెరువును కౌలుకు తీసుకుని అందులో ముత్యాల సాగు ప్రారంభించారు. అందులో ఆయన విజయవంతమయ్యారు. కానీ, తీరా ముత్యాలు చేతికొచ్చే సమయానికి దొంగలు పంట మొత్తం దోచుకెళ్లారు. ఆ తర్వాత తన సొంత పొలంలో చిన్న చెరువును తవ్వించి మళ్లీ ముత్యాల సాగు చేపట్టారు సంజయ్.

ఇలాంటి ప్రాజెక్ట్ ప్రారంభించడం మహారాష్ట్రలోనే కాదు, బహుశా దేశంలోనే మొదటిసారేమో అని సంజయ్ అంటారు.

సహజంగా ముత్యాలను పండించాలనేది సంజయ్ ఆలోచన. అందుకు నదిలో ముత్యపు చిప్పలను సేకరించడం, విత్తనాలు తయారు చేయడం, శుద్ధి చేయడం, అవి చిప్పల్లా పెరిగేలా చూడటం, చిప్ప లోపల ముత్యం తయారయ్యేంత వరకు వాటిని సంరక్షించడం.. ఇలా చాలా దశలే ఉంటాయి.

సాధారణంగా ముత్యపు చిప్పలు పూర్తిగా వృద్ధి చెందడానికి ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పడుతుంది. తర్వాత లోపల ఉన్న ముత్యాలను బయటకు తీసి మార్కెట్‌లో అమ్ముతారు. ముత్యాలు సాగులో విజయవంతమైన సంజయ్ గండాటే.. ఈ ప్రాంతంలో ముత్యాల సాగు చేపట్టేందుకు మరికొందరికి స్ఫూర్తిగా నిలిచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)