ధర్మాన ప్రసాదరావు: ‘పది పథకాలకు డబ్బులు పంచే ప్రభుత్వం చెత్త సేకరణకు రూ.100 పన్ను వేస్తే తప్పేంటి?’

రూ.100 చెత్త పన్ను విధిస్తే తప్పేంటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ఎన్నో పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం చెత్తపై పన్ను వేస్తే తప్పేంటన్నారు.

కొద్ది రోజులుగా ఏపీలో చెత్త సేకరణపై పన్ను వసూలు చేసే అంశంపై వివాదం నెలకొంది.

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో విధిస్తున్న ఈ చెత్త పన్నును చాలా చోట్ల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. చెత్తపై పన్ను ఎందుకు కట్టాలంటూ అధికారులను నిలదీస్తున్నారు. చెత్తపై పన్ను కట్టేది లేదని నిరసనలకు దిగుతున్నారు.

శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలోని బలగ ప్రధాన మంచినీటి సరఫరా కేంద్రంలో 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.1.38 కోట్ల అంచనా వ్యయంతో 5 ఎమ్.ఎల్.డి ఇన్ ఫిల్టరేషన్ గ్యాలరీ నిర్మాణం, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ. 1.82కోట్ల అంచనా వ్యయంతో పంపుహౌస్, పైపు లైన్ నిర్మాణ పనులకు మంగళవారం ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కొన్ని కొత్తకొత్త పద్ధతుల్ని మనం ప్రవేశపెడుతున్నాం. వాటిపై ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ప్రభుత్వం ఏ లక్ష్యంతో చేస్తోంది అనేది చెప్పాలి. మనం చెత్త సేకరణ పెట్టాం.

చెత్త సేకరణ జరగకపోతే ఎలా? దానికి వంద రూపాయలు ఇవ్వడానికి పెద్ద బాధ పడిపోతుంటే.. ఎక్కడ పడేస్తాం తీసుకెళ్లి దానిని?

మీకు తెలియని బాధలు ఎన్ని ఉన్నాయో తెలుసా దాంట్లో? ఆ చెత్త తీసుకెళ్లి వేసిన గ్రామాల వాళ్లు ఇప్పుడు మా మీద పడిపోతున్నారు. వాళ్లు తినడం ఏంటి? ఆ చెత్తంతా మామీద వేయడం ఏంటి? అని. అది తీసుకుని వెళ్లి ఇంకో దగ్గర వేయాలి? అంటే ఎక్కడ వేయాలి? భారతదేశంలో భూమి నిండా జనం ఉన్నారు. ఎక్కడ వేసేదానికి కూడా లేదు. 140 కోట్ల జనాభా ఉంది. ఎక్కడ వేసినా ఎవ్వరూ ఒప్పుకునే పరిస్థితి లేదు.

అందుకే దాన్ని ప్రాసెస్ చేయాలి. వీటన్నింటికీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? పర్యావరణానికి సంబంధించి భవిష్యత్ భయంకరంగా రాబోతోంది.

రూ. 100 వసూలు చేస్తుంటే దానికి పెద్ద ఆర్గ్యుమెంట్స్ ఎందుకు? ఏవిటయ్యా? దేనికోసం అది? ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోంది కదా.. దాంట్లో అంత పెద్ద విషయం ఏముంది? 12 నెలలకు 1200 రూపాయలు. నువ్వు చేస్తున్న చెత్తంతా తీసుకెళ్లి, ఎక్కడికో పట్టుకెళ్లి, దాన్ని ప్రాసెస్ చేసి, నిరంతరం కొన్ని వందల మంది పనిచేస్తుంటే.. దానికి రూ.100 ఇవ్వడం పెద్ద కష్టమా? కరెక్ట్ కాదు.. కట్టమని అందరికీ చెప్పండి. సెక్రటేరియేట్ స్టాఫ్ అందరూ దానిపైన పనిచేయండి.

కట్టకపోతే ఎవరింట్లో చెత్త వాళ్లింట్లో వదిలేస్తాం.. ఇష్టమేనా? తీసుకెళ్లం.. వాళ్లింటి ముందే పోసేస్తాం. అనుభవించండి తెలుస్తుంది.

ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తే ఎలా అవుతుంది? ఎక్కడి నుంచి తెస్తుంది ప్రభుత్వం మాత్రం డబ్బులు? పది పథకాలకు డబ్బులు పంచే కార్యక్రమం చేయాలి.. మళ్లీ ఇలాంటి వాటికి పైసా కట్టం అంటే ఎలా?

చెత్త సేకరణకు నెలకు రూ.100 పన్ను రీజనబుల్‌గా ఉంది. ఎంత వీలైతే అంత తగ్గిస్తారు. మిగతాది చెల్లించమని వార్డుల్లో ఉండే నాయకులు, సెక్రటేరియేట్ సిబ్బంది, చైతన్యవంతులైన పౌరులు అందరూ దీనిపైన పనిచేయాలని మనవి చేస్తున్నా’’ అని ధర్మాన ప్రసాదరావు కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)