చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి అసెంబ్లీలో పల్లెత్తు మాట కూడా ఎవ్వరూ అనలేదు - పేర్ని నాని

ఏపీ అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ ఎమ్మెల్యేల వివాదంపై సినీ నటుడు నందమూరి తారకరామారావు జూనియర్, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, ఏపీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పందించారు.

అసెంబ్లీలో జరిగిన పరిణామాలు తన మనసును తీవ్రంగా కలచివేశాయని ట్విటర్లో పోస్ట్ చేసిన వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

అంతకుముందు హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై స్పందించారు. సజావుగా సాగాల్సిన అసెంబ్లీ వ్యక్తిగత దూషణలకు వేదికైందని అన్నారు. చాలా ధైర్యంగా ఉండే చంద్రబాబు ఏనాడూ కంటతడి పెట్టలేదన్నారు. అసెంబ్లీలో కుటుంబ సభ్యులపై దాడి సరికాదన్నారు. ఎవరైనా తమ కుటుంబం జోలికి వస్తే ఊరుకోబోమని అన్నారు.

చంద్రబాబు భార్య గురించి ఎవరు ఏమన్నారు? ఏమైనా ఆధారం ఉందా? - పేర్ని నాని

బాలకృష్ణ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. బాలకృష్ణ అమాయక చక్రవర్తి అని.. చంద్రబాబు ఏం చెప్తే అదే నిజమని అయన అనుకుంటున్నారని నాని వ్యాఖ్యానింంచారు.

‘‘చంద్రబాబు భార్యను ఎవరు అన్నారు? ఏమన్నారు? ఇటువైపు ఉన్న (వైపీసీ పార్టీ)వారు ఏమైనా సంస్కారం లేనివాళ్లు అనుకున్నారా? వ్యవస్థలను, రాజకీయాలనూ ఎక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు?’’ అని పేర్ని నాని ప్రశ్నించారు.

వాస్తవానికి అసెంబ్లీలో ఫోన్లలో రికార్డింగ్ చేయకూడదని, అయినా టీడీపీ వాళ్లు షూటింగ్ చేశారని.. అలాంటిది చంద్రబాబు భార్య గురించి ఎవరు ఏమన్నారు? ఏమైనా ఆధారం ఉందా? అని ప్రశ్నించారు. రాజకీయ అవసరాల కోసం వ్యక్తులను, వ్యక్తిత్వాలను కించపర్చే సంస్కృతికి తెరతీసింది చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు.

ఒకవేళ నిజంగానే తమ పార్టీ వాళ్లు అలాంటి మాటలు మాట్లాడితే, వీడియోలు, ఆధారాలు ఉంటే తమ బతుకులు ఇలా ఉండేవా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి పల్లెత్తు మాట అసెంబ్లీలో ఎవ్వరూ అనలేదని, ఆమె పేరు కూడా ఎత్తలేదని పునరుద్ఘాటించారు.

చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలనే బాలకృష్ణ సహా నందమూరి కుటుంబ సభ్యులంతా నిజం అని నమ్ముతున్నారని, ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన సందర్భంగా కూడా చంద్రబాబు మాటలనే వాళ్లు నమ్మారని పేర్ని నాని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)