‘చిన్న టోపీ.. అంత పెద్ద హిప్పోపొటామస్ ప్రాణాలు తీసింది’

ఫొటో సోర్స్, Cincinnati Zoo
- రచయిత, మేడలైన్ హాల్పెర్ట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
సిన్సినాటి జూలో కిందపడిన టోపీని మింగి చికిత్స పొందుతున్న హిప్పోపొటమస్ ఫియోనా మరణించినట్టు ఒహియోలోని జూ యాజమాన్యం తెలిపింది.
" పశువైద్యులు, సంరక్షకుల బృందం ఫియోనాను రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ, ప్రాణాలు కాపాడలేకపోయామనే విషాదకరమైన వార్తను మీకు తెలియజేయడానికి చాలా విచారిస్తున్నాం," అని జూ గురువారం మధ్యాహ్నం ప్రకటించింది.
2017లో నెలలు నిండకుండానే పుట్టి, సోషల్ మీడియా స్టార్‌గా ఫియోనా మారింది.
సుమారు 10 రోజుల క్రితం టోపీని మింగేయడంతో అత్యవసర వైద్య సంరక్షణ అవసరమైంది.
పశువైద్య సిబ్బంది దానిని కాపాడేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, చివరికి అది సాధ్యపడలేదని జూ అధికారులు తెలిపారు.

మొదట్లో దానికి ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదని ఫియోనా శరీర పరిమాణం పెద్దది కాబట్టి ఆ చిన్న టోపీ సాధారణంగానే జీర్ణమై బయటకు వచ్చేస్తుందని భావించామని జూ యాజమాన్యం పేర్కొంది.
అయితే కొన్ని రోజుల తర్వాత ఫియోనాకు ఆకలి తగ్గడం మొదలైంది.
దీంతో దానికి అత్యవసర వైద్య చికిత్స అందించాల్సి వచ్చిందని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ టోపీ జీర్ణవ్యవస్థ ద్వారా బయటకు వచ్చేలా చేసేందుకు దానికి ఆహారం తినిపించడానికి జూ సిబ్బంది ప్రయత్నించారు.
సిన్సినాటి జూలో నెలలు నిండకముందే పుట్టిన ఫియోనా తొలినాళ్లలో ప్రాణాలతో పోరాడింది.
దాని స్ఫూర్తిదాయక కథ ఆధారంగా ఒక ఐస్‌క్రీమ్ ఫ్లేవర్, సిన్సినాటి బ్యాలే నృత్య రూపకంలో ఒక పాత్రను రూపొందించారు.
సందర్శకుల్లో ఒకరు టోపీని గాలిలోకి విసిరినప్పుడు అది సీలింగ్ ఫ్యాన్‌కు తగిలి ఒక చిన్న రంధ్రంలోంచి ఫియోనా ఉన్న చోట పడిందని జూ ప్రతినిధి మిచెల్ కర్లీ అమెరికా మీడియాకు తెలిపారు.
"మళ్లీ అలా చేయాలని మేం ప్రయత్నించినా బహుశా సాధ్యం కాదేమో" అని కర్లీ పేర్కొన్నారు.
ఫియోనా త్వరగా కోలుకోవడానికి జూ సిబ్బంది దానికి ద్రవ పదార్థాలు (ఫ్లూయిడ్స్) అందించడంతో పాటు అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించారు.
అల్ట్రాసౌండ్ స్కాన్‌లో ఆ టోపీ ఫియోనా చిన్న పేగు గుండా కదులుతున్నట్లు గుర్తించామని అయితే దాని శరీరంలో ఇంకా కొంత నీటి శాతం తక్కువగా (డీహైడ్రేషన్) ఉందని సిబ్బంది తెలిపారు.
"పూర్తిగా ఎదిగిన నీటిగుర్రాలకు శస్త్రచికిత్స చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఫియోనా దానంతట అదే ఆ టోపీని బయటకు విసర్జించడమే అత్యుత్తమ మార్గం" అని జూ సంరక్షకుల్లో ఒకరు పేర్కొన్నారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా రక్షించలేకపోయామని జూ అధికారులు తెలిపారు.
"మేము ప్రస్తుతం దిగ్భ్రాంతిలో ఉన్నాం," అని సిన్సినాటి జూ డైరెక్టర్ డేవ్ జెనికే ఒక ప్రకటనలో తెలిపారు. "మేము ఈ ఫలితాన్ని ఊహించలేదు. హిప్పో చివరి వరకుపోరాడింది." అని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
2017లో ఫియోనా జన్మించింది. పుట్టినప్పుడు దాని బరువు కేవలం 13 కిలోలు మాత్రమే ఉంది.
ఈ జాతి జంతువులలో అంతకుముందు నమోదైన అత్యల్ప జనన బరువులో ఇది సగం మాత్రమేనని జూ అధికారులు తెలిపారు.
"పుట్టినప్పుడు ఎంతటి ధైర్యాన్ని, పోరాట పటిమను ప్రదర్శించిందో ఇప్పుడు కూడా ఫియోనా అంతే బలంగా కోలుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం" అని జూ సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు.
హిప్పోలు సాధారణంగా మానవ సంరక్షణలో 50 సంవత్సరాల వరకు జీవిస్తాయి కాబట్టి, దాని మరణం కూడా చాలా అకాలమైందని జూ అధికారులు తెలిపారు.
"ఇది ఉద్దేశపూర్వకంగా చేసినది కానప్పటికీ, దురదృష్టవశాత్తు ఇలాంటివి చాలా జరుగుతుంటాయి, జంతువుల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, గౌరవంగా ప్రవర్తించాలనే విషయాన్ని ఫియోనా మరణం విషాదకరంగా గుర్తుచేస్తుంది," అని జంతు హక్కుల సంఘం పీటాకు చెందిన క్యాప్టివ్ వైల్డ్‌లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్ డెబ్బీ మెట్జ్లర్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























