రాధిక, యశోదలు రోజూ బడికి వెళ్లి రావడానికి ఆరు గంటల సమయం పడుతుంది.
వాళ్లిద్దరూ హిమాలయ పర్వతాల్లో చాలా ఎత్తులో ఉన్న ఒక మారుమూల గ్రామంలో ఉంటారు. అయితే వాళ్లకు చదువంటే ప్రాణం.
ఈ 360 వీడియోలో వాళ్ల రోజువారీ ప్రయాణాన్ని చూడొచ్చు - లేదా వారి కథనాన్ని చదవడానికి కిందకు స్క్రోల్ చేయండి.
360 డిగ్రీల అనుభూతి పొందేందుకు గాను వీడియో చూస్తున్నప్పడు మీ మొబైల్‌ను వంచండి. డెస్క్‌టాప్‌లో చూస్తుంటే వీడియోను అన్ని కోణాల్లో స్క్రీన్‌పై చూసేందుకు మౌస్‌ను ఉపయోగించండి.
ఇది సఫారీ వెబ్ బ్రౌజర్ లో పని చేయదు - దీన్ని యూట్యూబ్ మొబైల్ యాప్ లో చూస్తే బాగా కనిపిస్తుంది.
వర్షాకాలపు వేకువ జామున 5 గంటల సమయంలో బాల్కనీ అంచున నిలబడి ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ ముఖం కడుక్కుంటున్నారు.

ఈ రోజు టిఫిన్ లో ఎవరికి ఎక్కువ రొట్టెలు దొరకుతాయంటూ ఒకరితో ఒకరు చిలిపిగా పోట్లాడుకుంటున్నారు.
మరో అరగంటలో వాళ్లిద్దరూ బడికి వెళ్లడం కోసం కాలినడకన ఒక ప్రమాదకరమైన యాత్రకు బయల్దేరనున్నారనే సంకేతం వాళ్ల సరదాలో కనిపిస్తుంది.
వాళ్లొక కొండ మార్గంలో, దట్టమైన అడవి గుండా, వేగంగా ప్రవహించే నది మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంది.
అయితే మొట్టమొదట వారు ఈ హిమాలయ గ్రామం నడి మధ్యన ఉన్న హిందూ దేవాలయాన్ని దర్శించుకుంటారు.
గుడిలో మోగే గంటలను దేవుడి ఆశీర్వాదంలా భావిస్తారు.

స్యాబా అనే ఈ మారుమూల గ్రామం నుంచి 14, 16 ఏళ్ల వయసున్న ఈ అక్కాచెల్లెళ్లతో పాటు మొత్తం ఆరుగురు రోజూ బడికి వెళతారు.
మొఖంపై చిరునవ్వుతో, బరువెక్కిన హృదయంతో వాళ్ల నాన్న బై అంటూ చేయి ఊపి ఇద్దరినీ సాగనంపుతారు.

స్యాబా గ్రామంలో ఓ మనోహరమైన ఉదయం
వాతావరణ పరిస్థితులను బట్టి ప్రయాణానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది.
కానీ ఆడపిల్లల పాఠశాలలున్న మనేరీ, మల్లా అనే దూరపు పట్టణాలకు చేరుకోవాలంటే ఇదొక్కటే దారి.

భాగీరథి నదీ లోయ (గూగుల్ మ్యాప్)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎత్తయిన హిమాలయ పర్వతాలపై 500 మంది ప్రజలు నివసించే స్యాబా గ్రామానికి ఎలాంటి రోడ్డు సౌకర్యం లేదు.
ఓ ఇరుకైన రాళ్ల దారి గుండా ఈ అమ్మాయిలిద్దరూ నడక సాగిస్తారు. వారి వెంట మధ్యాహ్నం తినడానికి టిఫిన్ డబ్బా, పుస్తకాల సంచీ.
వీరి ప్రయాణంలో అత్యంత ప్రమాదకరమైన ఘట్టం రెండు గంటల తర్వాత ఎదురవుతుంది. వేగంగా పారే భాగీరథి నదిని దాటాల్సి ఉంటుంది.

నది మీదుగా తీగలు, బోను.
అక్కడ వీరు అటువైపు ఉన్న లోహపు ట్రాలీని ఇటువైపునకు లాగాల్సి ఉంటుంది.
దీనికి చాలా బలం అవసరమవుతుంది.ఇక వర్షం పడితే ఈ తాడు మరింత బరువెక్కుతుంది. దీన్ని లాగే సమయంలో గాయాలు సరేసరి.
ఈ వేలాడే తీగలను లాగే సందర్భంలో స్థానికులు కొందరు చేతి వేళ్లను కోల్పోయారు కూడా.
మేం ఈ నీటి ప్రవాహంలో పడిపోకుండా ఉండాలంటే.. ఈ ట్రాలీని గట్టిగా పట్టుకోవాలి.”
‘‘మా బంధువుల పిల్లాడు ఒకసారి ఈ తీగల్లో చిక్కుకుని కింద నీటిలో పడిపోయాడు. కానీ లక్కీగా బతికాడు.’’
ఈ తీగల్లోని గ్రీస్ విషయంలోనూ మేం జాగ్రత్తగా ఉండాలి.లేకుంటే మా చేతులకు మురికి అంటుతుంది. అందువల్ల మేం బట్టలతో చేతులకు మురికి అంటకుండా చూసుకుంటాం.’’- యశోద
‘‘మా స్కూల్ ప్యాంట్లు చాలా తెల్లగా ఉంటాయి. దీంతో కొంచెం మురికి అయినా స్పష్టంగా కనిపిస్తుంది.’’

ఒకసారి వీరు భాగీరథి ఉత్తర గట్టుకు చేరాక.. కాసేపు ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తారు. ట్యాక్సీ వచ్చాక రోడ్డు మార్గంలో స్కూల్‌కి వెళ్తారు.
ఇక్కడి దట్టమైన అడవులు కూడా వీరికి ప్రమాదకరమే. ఎందుకంటే ఇక్కడ ఎలుగుబంట్లు, చిరుతలు కనిపిస్తూ ఉంటాయి.
ఇది వర్చువల్ రియాలిటీ డాక్యుమెంటరీ. దీంతో యశోద, రాధికలు వీక్షకులను కూడా తమ సాహసోపేత ప్రయాణంలోకి ఇలా తీసుకెళ్తున్నారు.
ఉత్తరాకాశీ పర్వతాల్లో స్యాబా వంటి గ్రామాలు 200 దాకా ఉన్నాయి.
వీటిలో కొన్నింటికి రోడ్డు మార్గం ఉన్నా.. చాలా గ్రామాలకు మాత్రం నడిచి వెళ్లాల్సిందే.

భాగీరథి నది కలిసే చోటు దిల్లీ నుంచి దాదాపు 250 మైళ్ల/400 కి.మీ. దూరంలో ఉంది.(గూగుల్ మ్యాప్స్)
16 ఏళ్ల యశోద పోలీసు అధికారి కావాలని కలలు కంటుండగా.. 14 ఏళ్ల రాధిక టీచర్ కావాలనుకుంటోంది.
ఈ ఇద్దరూ తమ తల్లిదండ్రులలాగానే గా చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాలని భావించకుండా చక్కగా చదువుకోవాలని అనుకుంటున్నారు.
యశోద కాస్త సీరియస్‌గా.. మౌనంగా ఉంటుంది. రాధిక కథ వేరే. కాళ్లకు అంటుకున్న జలగలను తొలగించడానికి వంగినపుడు మాత్రమే కొన్ని సెకన్లు మాట్లాడదు, అంతే!

రాధిక, యశోద
వర్షాకాలంలో ఈ రోడ్డు మార్గంలో చాలా జలగలు ఉంటాయి.
వీటిని అగ్గిపుల్లలతో కాల్చుతున్నపుడు రాధిక నవ్వుతుంది. ఆమె ఆలోచనంతా రోజూ ఆరుగంటల పాటు ప్రయాణం గురించే కానీ ఈ జలగల గురించి కాదు.
‘‘నేను దేని గురించీ భయపడను.’’ అంటున్న రాధిక తన సోదరిలాగానే గ్రామాన్ని చుట్టూ ఉన్న ప్రకృతిని ప్రేమిస్తారు.
వాన కురిసినపుడు ఇక్కడి పర్వతాల్లో చిన్న చిన్న జలపాతాలు చాలా కన్పిస్తాయి. మీరు ఇక్కడకు వచ్చి చూస్తే చాలా అద్భుతంగా ఫీలవుతారు.”
రాధిక, యశోదలు తమ బంధువుల ఫోన్ తీసుకున్నపుడు ఎక్కువుగా బాలీవుడ్ పాటలు, వీడియోలు చూస్తుంటారు.
వీరి ఇళ్లలో టీవీలు లేవు. కానీ వీరి బంధువులకు ఉన్నాయి. దీంతో కొన్ని సార్లు మొత్తం కుటుంబం బంధువుల ఇంటికి వెళ్లి టీవీ చూస్తుంది.
వీరిని షూట్ చేయాలని భావించిన బీబీసీ బృందం ఓ ప్రశాంతమైన ఆదివారం వీరి ఇంటికి వెళ్లగా.. యశోద మంచంపై కూర్చొని ఫోన్‌లో బాలీవుడ్ పాటలు చూస్తోంది. రాధిక తన తలకు గులాబీ రంగు దుపట్టాను చుట్టుకుని డాన్స్ చేయడానికి సిద్ధమవుతోంది.


‘‘మాకు చాలా కలలు వస్తాయి.’’-యశోద
‘‘కొన్ని సార్లు దెయ్యాలు కల్లోకి వస్తాయి. మరొకొన్ని సార్లు మా తమ్ముడు కల్లోకి వస్తాడు. అతను హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. వీకెండ్‌లోనే ఇంటికి వస్తాడు.’’
స్యాబాలో చాలా మంది చిన్నారులు ఎనిమిదో తరగతి వరకే చదువుతారు. అంతకు మించి చదవాలంటే వీరు ఇంటిని వదిలివెళ్లాలి. దీంతో వారి చదువుకు చాలా ఖర్చవుతుంది.
చాలా కుటుంబాలు ఈ ఖర్చును భరించలేవు.

తమ తల్లిదండ్రులతో రాధిక, యశోద
బీబీసీ బృందం స్యాబాకి వీఆర్ హెడ్ సెట్ ను తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది. దీంతో వారు మొదటిసారి వర్చువల్ రియాలిటీ వీడియోలను చూడగలరు.
ఇది వారి చలనచిత్రమే. యశోద, రాధికలు ఈ వీఆర్ హెడ్ సెట్ వల్ల తమ ప్రయాణ అనుభవాలను తల్లిదండ్రులకూ పంచగలుగుతారు.












